ఓట్లు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కు లేదు: జీవన్‌రెడ్డి 

TRS does not have the right to ask vote says Jeevan Reddy - Sakshi

జగిత్యాల రూరల్‌: రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌ పార్టీకి లేదని జగిత్యాల తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా లింగంపేట గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఉద్యమ పార్టీగా భావించి 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పట్టంకట్టారని అన్నారు. అయితే ఐదేళ్లు పాలన చేయకుండా 8 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేయడం కేసీఆర్‌ అహంకారానికి నిదర్శనమన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా రాచరిక పాలన కొనసాగించారన్నారు. శాసన సభలో ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేసిన సంఘటన దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు, విద్యార్థులు, యువత ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే సోనియా గాంధీ చలించపోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని పేర్కొన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా నిరుద్యోగులను, యువతను పట్టించుకోకుండా నియంత పాలన కొనసాగించారన్నారు. గతంలో వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులను అదుకునేందుకు ఉచిత విద్యుత్, ఐకేపీ కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్య చదివేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకువచ్చి విద్యార్థులకు మంచి భవిష్యత్‌ అందించామన్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ రాష్ట్రాన్ని రూ.1.6 లక్షల కోట్లమేర అప్పులోకి నెట్టారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top