మోగిన పుర నగారా

Telangana SEC Releases Scheduled For Municipal Elections - Sakshi

జనవరి, 22 మున్సిపల్‌ ఎన్నికలు

120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు

7న నోటిఫికేషన్‌.. 8 నుంచి నామినేషన్ల దాఖలు

25న ఫలితాల ప్రకటన బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు

షెడ్యూల్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

కోర్టు కేసుతో జహీరాబాద్‌ మున్సిపాలిటీకి ఎన్నిక వాయిదా

వారం పది రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసే చాన్స్‌

జనవరి 4న తుది ఓటర్ల జాబితా  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మరో ఎన్నికల ఘట్టానికి తెర లేచింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగించింది. 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లకు జనవరి 22న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు మున్సి పల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ కమిషనర్‌ నాగిరెడ్డి సోమవారం విడుదల చేశారు. 

120 మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులకు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని 385 డివిజన్లకు బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టులో పాత కేసు పెండింగ్‌లో ఉండటంతో జహీరాబాద్‌ మున్సి పాలిటీకి ఎన్నికల నిర్వహణను వాయిదా వేశారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఎస్‌ఈసీ జనవరి 7న నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. మరుసటి రోజు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రిట ర్నింగ్‌ అధికారులు ఎన్నికల నోటీసులు ఇస్తారు. 

అదే రోజు ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమై 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 22న ఎన్నికలు నిర్వహిస్తారు. 25న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అది ముగిసిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. కాగా, ఎన్నికలు జరిగే పట్టణ స్థానిక సంస్థల పరిధిలో సోమవారం నుంచే ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’అమల్లోకి తెస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. 

ఇదీ ఎన్నికల షెడ్యూల్‌ ...

వారం పది రోజుల్లో రిజర్వేషన్ల ఖరారు?
మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మరో వారం పది రోజుల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు కావొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఎస్టీ, ఎస్సీ ఓటర్ల జాబితాలు సిద్ధం కాగా, బీసీ జాబితా దాదాపు రెండు నెలల క్రితమే రూపొందించారు. అయితే ఈ మధ్యకాలంలో కొత్త ఓటర్లు నమోదు కావడంతో మరోసారి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల జాబితా పూర్తిచేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేస్తారని సమాచారం. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుగా ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు ఖరారు చేసి మిగిలిన శాతం రిజర్వేషన్లను బీసీ వర్గాలకు కేటాయిస్తారు. 

పది మున్సిపల్‌ కార్పొరేషన్లకు మేయర్లు, 120 మున్సిపాలిటీలకు చైర్మన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం, జనరల్‌ కేటగిరీ కింద 50 శాతం కేటాయిస్తారు. అదే విధంగా మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులకు, 10 కార్పొరేషన్లలోని 385 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి 800 ఓటర్ల చొప్పున వార్డుల్లో ఓటరు జాబితాను రూపొందిస్తారు. ఆ తర్వాత వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటరు జాబితాలను ప్రకటిస్తారని అధికారవర్గాల సమాచారం.

4న ఓటర్ల జాబితా ప్రకటన
మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ జారీ కావడంతో ఓటర్ల జాబితా ఖరారుపైనా అధికారులు దృష్టి సారించారు. డిసెంబర్‌ 30న ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. అనంతరం అభ్యంతరాల స్వీకరణ, రాజకీయ పార్టీలతో ఎన్నికల అధికారుల సమావేశం వంటి ప్రక్రియలు పూర్తి చేసి జనవరి 4న వార్డులవారీగా ఫొటో ఓటర్ల తుది జాబితాలను ప్రచురిస్తారు. జనవరి 8న రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికలు జరగనున్న పట్టణ స్థానిక సంస్థల్లో వార్డులు, డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top