ఆ ఓట్లు.. ఎటు పడతాయో..!  

Tdp Votes Converted To Which Party? - Sakshi

సాక్షి, నిర్మల్‌: ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలోనే చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కనీసం పోటీచేయలేని స్థితికి చేరింది. జిల్లాలో ఆ పార్టీకి ఉన్న కాస్త ఓటుబ్యాంకుపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. తొలిసారి పార్టీ ఎన్నికల బరిలో లేకపోవడంతో సంప్రదాయ ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపుతారన్నది చర్చనీయాంశంగా మారింది. శాసనసభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ వైపు వెళ్తారా..? లేక ఇటీవల తమ నాయకగణమంతా వలస వెళ్లిన టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతారా..? లేదా తమవిచక్షణ మేరకు ఓటేస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో లేకున్నా చాలా గ్రామాల్లో సైకిల్‌ గుర్తుకు సానుభూతిపరులు ఉన్నారు.  

చక్రం తిప్పిన పార్టీ.. 
1983 ఎన్నికల నుంచే వివిధ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలోనూ తన సత్తా చాటింది. 1984 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన సి.మాధవ్‌రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1989లో మళ్లీ కాంగ్రెస్‌ గెలిచింది. ఇక 1991 నుంచి ఆదిలాబాద్‌ ఎంపీ స్థానాన్ని టీడీపీ వరుసగా కైవసం చేసుకుంది. 1991లో ప్రస్తుత రాష్ట్ర మంత్రిగా ఉన్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత మైనార్టీలో పడ్డ అప్పటి ప్రధాని పీ.వీ.నర్సింహారావు ప్రభుత్వానికి మద్దతు పలికి, తెలుగుదేశానికి దూరమయ్యారు. 1996 ఎన్నికల్లో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న డాక్టర్‌ సముద్రాల వేణుగోపాలాచారి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత వరుసగా వచ్చిన 1998, 1999 ఎన్నికల్లోనూ ఆయనే గెలిచి, హ్యాట్రిక్‌ సాధించారు. అనంతరం మళ్లీ రెండు దఫాలు ఆదిలాబాద్‌ స్థానాన్ని కోల్పోయిన టీడీపీ మళ్లీ 2009లో గెలుచుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న రాథోడ్‌ రమేశ్‌ అప్పుడు టీడీపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. 

మారిన పరిస్థితి.. 
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో తెలుగుదేశం క్యాడర్‌ కూడా చెల్లా చెదురైంది. చాలా మంది సీనియర్‌ నాయకులు పార్టీ మారారు. అధిక శాతం మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరు పోగా        – మిగతా
మిగిలిన సంప్రదాయ టీడీపీ ఓటర్లపైనే కాంగ్రెస్‌ నమ్మకం పెట్టుకుంది. జిల్లాలో 2014 వరకు టీడీపీ కొంత బలంగానే కనిపించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన అప్పటి సిట్టింగ్‌ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌ 1,84,198ఓట్లను సాధించినా ఓటమి పాలయ్యారు. ఆతర్వాత వరుసగా ఆ పార్టీకి ఎదురు దెబ్బలు తగిలాయి. ఒక్క ఎమ్మెల్యేనూ కూడా గెలిపించుకోలేక పోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్టీ కోలుకోలేకపోయింది. ఇక ఈ ఐదేళ్లలో జరిగిన పరిణామాలతో ఈసారి ఆ పార్టీ కనీసం బరిలో కూడా నిలువకుండా పోయింది. 

సైకిల్‌ ఖాళీ.. 
రాష్ట్రస్థాయిలో పేరుపొందిన మహామహులైన నేతలు సైకిల్‌ దిగి.. కారెక్కారు. అయినప్పటికీ వార్డుస్థాయి నుంచి తెలుగుదేశం క్యాడర్‌ చాలా ఏళ్ల పాటు బలంగా ఉంది. గ్రామీణుల్లో చాలామందికి చేయి గుర్తు తర్వాత సైకిల్‌ గుర్తే అన్నట్లుగా టీడీపీ చొచ్చుకుపోయింది. ఇప్పటికీ ఆ పార్టీకి గ్రామాల్లో వీరాభిమానులు ఉన్నారు. కానీ.. రాజకీయ పరిస్థితులు, పార్టీ అధినాయకత్వం తీరుతో క్యాడర్‌ ఒక్కొక్కరుగా జారిపోయింది. జిల్లా అధ్యక్షులతో పాటు కొంతమంది నాయకులు ఉన్నా.. పేరుకే పార్టీ ఉందన్నట్లుగా మారింది. ఉన్న కొంతమంది మాత్రమే ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఈసారి ఆ పార్టీ బరిలో కూడా నిలువకపోవడంతో మున్ముందు పార్టీ ఉంటుందో.. లేదో తెలియని పరిస్థితి. మరోవైపు ఆ పార్టీకి ఉన్న కొంత ఓటుబ్యాంకు ఈసారి ఎన్నికల్లో ఎటు వైపు వెళ్తుందోనన్నదే ఇక్కడ చర్చనీయాంశం. ప్రస్తుతం కాంగ్రెస్‌తో కలిసి చెట్టాపట్టాల్‌ వేస్తున్నా.. ఆపార్టీకి ఓట్లు వేస్తారన్న నమ్మకం లేదు. మరోవైపు చాలామంది నాయకులు, కార్యకర్తలు సైకిల్‌దిగి.. టీఆర్‌ఎస్‌లో చేరారు. కొంతమంది బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ టీడీపీ ఓటర్లు ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎటు ఓటు వేస్తారన్నది ఫలితాల తర్వాతే తేలనుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top