ఓటరూ.. పారాహుషార్‌

TDP Ruthlessly removing the voters from the list - Sakshi

     జాబితాలో ‘పచ్చ’దొంగల హస్తలాఘవం.. మీ ఓటు ఉందో లేదో తనిఖీ చేసుకోండి

     ఎన్నికల్లో నెగ్గడానికి అధికార పార్టీ బరితెగింపు

     ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లు నిర్దాక్షిణ్యంగా తొలగింపు  

     సొంత పార్టీ మద్దతుదారుల పేరిట మూడు నాలుగు ఓట్లు

     కింది స్థాయి నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ  

     టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో భారీగా పెరిగిన ఓట్లు  

     సీఎం సొంత నియోజకవర్గంలో పెరిగిన ఓటర్ల సంఖ్య  

     ఓటర్ల జాబితాను వెంటనే చూసుకోవాలంటున్న ప్రజాస్వామ్యవాదులు

     ఓటు లేకపోతే కొత్తగా నమోదు చేయించుకోవాలని సూచన

     2014తో పోల్చితే తగ్గిపోయిన ఓట్ల సంఖ్య 17.98లక్షలు

ఎన్నికల్లో నెగ్గడమే లక్ష్యంగా అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పవిత్రమైన ఓటు హక్కుపైనే వేటు వేస్తోంది. ప్రతిపక్షానికి సానుభూతిపరులన్న అనుమానం వస్తే చాలు వారి ఓట్లను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తోంది. అదేసమయంలో తమకు అనుకూలంగా వ్యవహరించే వారి పేరిట ఇష్టమొచ్చినట్లు కొత్త ఓట్లను నమోదు చేయిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో పేరుతో మూడు నాలుగు ఓట్లు ఉండడం ప్రజాస్వామ్యవాదులను నివ్వెరపరుస్తోంది. ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లను తొలగించడానికి, సొంత పార్టీ మద్దతుదారుల ఓట్లను పెంచుకోవడానికి అధికార తెలుగుదేశం పార్టీ నేతలు కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలో ప్రజలు తమ పేరు ఉందో లేదో వెంటనే చూసుకోవాలని, లేకపోతే ఓటరుగా పేరు నమోదు చేయించుకోవాలని ప్రజాస్వామ్యవాదులు సూచిస్తున్నారు.

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. 2014 సాధారణ ఎన్నికల నాటి ఓటర్ల జాబితాతో పోల్చితే 2018 ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య దాదాపు 18 లక్షలు తగ్గిపోవడం గమనార్హం. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉండే కుటుంబాలను టార్గెట్‌ చేసి మరీ ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారు. చాలా నియోజకవర్గాల్లో వేలాది ఓట్లు మాయమ్యాయి. అధికార టీడీపీ నాయకులు కుట్రపూరితంగానే ఇలా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా పక్కా ప్రణాళికతో చేశారని, లేకపోతే  మొత్తం తమ పేర్లే ఓటర్ల జాబితా నుంచి ఎందుకు మాయమవుతాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితాతో పోల్చితే తాజాగా ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన 2018 ముసాయిదా ఓటర్ల జాబితాలో కొన్ని నియోజకవర్గాల్లో ఏకంగా 30 వేల నుంచి 50 వేల ఓట్లు గల్లంతయ్యాయి. అధికార పార్టీకి బలమైన నాయకులున్న కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల సంఖ్యను పెంచుకున్నారు.  

విపక్షం ఓట్లే బలి  
2014 ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,67,21,608 ఓటర్లు ఉండగా, ప్రస్తుత ముసాయిదా జాబితాలో ఈ సంఖ్య 3,49,23,171కు పడిపోయింది. అంటే 2014 ఎన్నికల నాటితో పోల్చితే ప్రస్తుతం 17.98 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. ఇందులో అత్యధికం విపక్ష అనుకూల ఓట్లేనని తెలుస్తోంది.  

జాగ్రత్తపడకపోతే ఓటు హక్కు హుళక్కే   
2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండేవారితోపాటు అర్హులై ఉండి ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఓటరుగా నమోదు చేయించుకోవడానికి వీలుగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఈ నెల 31వ తేదీ వరకూ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఈ గడువును నవంబరు 20వ తేదీ వరకూ పొడిగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అందువల్ల ప్రతిఒక్కరూ ఈ ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఓటు హక్కు పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘గతంలో ఓటు వేశాం కదా! మా ఓటు ఎక్కడకు పోతుందనే ఉదాసీనత చూపకుండా ప్రతి ఒక్కరూ నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించి మీ పేర్లు ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే వెంటనే అక్కడి సిబ్బందిని అడిగి ఓటరుగా నమోదు కోసం ఫారం–6ను పూరించి నివాస ధ్రువీకరణ, వయసు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి’’ అని ప్రజాస్వామ్యవాదులు సూచిస్తున్నారు.  

మోసాల్లో కార్యకర్తలకు శిక్షణ    
వచ్చే సాధారణ ఎన్నికల్లో మోసపూరితంగా గెలవాలనే ఉద్దేశంతో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటినుంచే ఎత్తులు వేస్తున్నారు. రెండు మూడు నియోజకవర్గాల్లో ఓటర్లుగా పేరు నమోదు చేయించుకుంటున్నారు. గతంలో చాలామంది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓటర్లుగా కొనసాగారు. మరీ ముఖ్యంగా ఎక్కువ మంది తెలుగుదేశం వర్గీయులు హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఓటర్లుగా కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్‌లోని సొంత ప్రాంతంలోనూ ఓటు హక్కు ఉంచుకున్నారు. రెండు చోట్లా ఓటు వేశారు. ‘ఈఆర్‌వో నెట్‌’ టెక్నాలజీ వినియోగిస్తున్నామని, డూప్లికేషన్‌ ఇక ఉండదని ఎన్నికల కమిషన్‌ అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. చాలామంది ఒకే పేరుతో ఏమాత్రం మార్పులు లేకుండా రెండు మూడు నియోజకవర్గాల్లో ఓటర్లుగా కొనసాగుతుండగా, మరికొందరు ఒకే నియోజకవర్గంలోని వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇంకొందరు పేరులోనో, ఇంటిపేరులోనే చిన్న మార్పుతో రెండు మూడు చోట్ల ఓటర్లుగా కొనసాగుతున్నారు. టీడీపీ నాయకులు శిక్షణ సమయంలో తమ కార్యకర్తలకు ఇలాంటి మోసాలు నేర్పించారనే విమర్శలు ఉన్నాయి. కొన్నిచోట్ల సాంకేతిక లోపం వల్లే ఒకే వ్యక్తి పేరిట రెండు మూడు ఓట్లు ఉన్నాయి.   

ఒకే వ్యక్తికి మూడు ఓట్లు! 
- పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష్మీ నాగ లోకేశ్వర కృష్ణసాయి (తండ్రి చక్ర«ధరరావు ఇమ్మంది)కి  ఐడీ నంబరు ఐఎంహెచ్‌1064732తో ఓటరు జాబితాలో పేరుంది. ఇదే వ్యక్తికి ఐఎంహెచ్‌1064807, ఐఎంహెచ్‌ 1064880 ఐడీ నంబర్లతోనూ ఓట్లు ఉన్నాయి. అంటే ఒకే వ్యక్తికి మూడు ఓట్లు ఉన్నాయన్నమాట!  
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో జయలక్ష్మి బేరికి(భర్త లక్ష్మీనారాయణ బేరి) ఐడీ నంబరు డబ్ల్యూఏయూ1715143తో ఓటు ఉంది. డబ్ల్యూఏయూ1715150, డబ్ల్యూఏయూ1715168 ఐడీనంబర్లతోనూ మరో రెండు ఓట్లు ఉన్నాయి.  

టీడీపీ నేతల నియోజకవర్గాల్లో పెరిగాయెందుకో..  
కొన్ని నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు గల్లంతు కాగా, టీడీపీకి బలమైన నాయకులు ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల నాటికంటే ప్రస్తుతం ఓట్ల సంఖ్య భారీగా పెరగడం గమనార్హం.   
అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో 2014లో 2,52,686 ఓట్లు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య1,85,591కి తగ్గింది. అంటే ఈ ఒక్క నియోజకవర్గంలోనే 67,095 ఓట్లు తగ్గిపోయాయి. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంత భారీగా ఓట్లు తగ్గడమంటే గతంలోనైనా తప్పులు జరిగి ఉండాలి. లేదా ఇప్పుడైనా మోసాలు జరిగి ఉండాలి.  
అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,25,300 నుంచి 2,14,634కు తగ్గింది.  
చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో 2,40,941 నుంచి 2,09,093కు ఓట్లు తగ్గాయి.  
చాలా నియోజకవర్గాల్లో ఇలా 2014తో పోల్చితే ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓట్లు తగ్గగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో మాత్రం ఓట్ల సంఖ్య పెరగడం గమనార్హం. ఈ నియోజకవర్గంలో 2014 ఎన్నికల సమయంలో 1,95,800 ఓట్లు ఉండగా, ప్రస్తుతం 2,00,138కి పెరిగాయి.  
టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఓట్ల సంఖ్య 2014తో పోల్చితే 2,38,539 నుంచి 2,45,373కు పెరిగింది.  
టీడీపీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అధికారులను బెదిరించి భారీగా బోగస్‌ ఓట్లు చేర్పించడం ద్వారా ఓట్ల సంఖ్య పెంచుకున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top