ఓటర్ల కొనుగోలుకు టీడీపీ బరితెగింపు

TDP conspiracy in 175 constituencies all over the state - Sakshi

సర్వేల పేరుతో డేటా సేకరణ

ఆన్‌లైన్‌ ద్వారా నగదు మార్పిడి

తెలంగాణ నుంచి 30 మంది యువకులను పిలిపించి సర్వే

అడ్డుకున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఇదే కుట్ర

సాక్షి, గుంటూరు/మంగళగిరి: అధికారపార్టీకి ఓటమి తప్పదని తెలిసి బరితెగించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ సర్వేల పేరుతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. మంగళగిరిలో ఆదివారం సర్వే చేస్తున్న యువకులపై అనుమానం వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  నాయకులు  వివరాలు సేకరించగా వారు చెప్పిన విషయాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. సర్వే పేరుతో ఇళ్లకు వెళ్తున్న యువకులు వారి ట్యాబ్‌లోని ఓటర్ల జాబితాను చూసుకుని ఓటర్ల ఫోన్‌ నంబర్, ఆధార్‌ నంబర్‌ సేకరించి ఆన్‌లైన్‌లో మరో సర్వర్‌కు పంపుతున్నారు. సర్వర్‌కు వెళ్లిన అనంతరం ఫోన్‌ నంబర్, ఆధార్‌ నంబర్‌ ద్వారా ఆ ఓటరు బ్యాంక్‌ అక్కౌంట్‌ తెలుసుకుని నేరుగా గూగుల్‌ పే, ఫోన్‌పే లాంటి ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ యాప్స్‌ ద్వారా ఓటర్లకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నట్లు సర్వే చేస్తున్న యువకులు తెలిపారు. ఒక్క మంగళగిరిలోనే గత మూడు రోజులుగా బస చేసిన 30 మంది యువకులు సర్వే పేరుతో ఓటర్ల ఫోన్‌ నంబర్‌ ఆధార్‌ నంబర్‌లను సేకరించి వేరే సర్వర్‌కు పంపుతుండడం కలకలం సృష్టించింది.

ఆన్‌లైన్‌ ద్వారా వేరే వారు నగదు బదిలీ చేస్తారని తాము వివరాలు మాత్రమే సేకరించి పంపుతామని ఆ యువకులు చెప్పారు. ఒక్క మంగళగిరిలోనే కాక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఈ సర్వే పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. యువకులంతా తెలంగాణ నుంచి రావడం గమనార్హం. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పలు మండలాలనుంచి విద్యార్థులను  సర్వేకు తరలించి వారికి బస, భోజనం ఏర్పాటు చేసి రోజుకు రూ.400 చెల్లిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న యువకులంతా ఇంటర్మీయడియెట్, డిగ్రీ, బీటెక్‌ చదివినవారు కావడం విశేషం. సర్వేకు పంపిన వారు మాత్రం ఎవరు అడ్డుకున్నా తమకు తెలపాలని, ఒక వేళ పట్టుకున్న వారు పోలీసులకు అప్పగించినా పోలీసులు మిమ్మల్ని ఏమీ అనరని భరోసా ఇవ్వడంతోనే తాము వచ్చినట్లు యువకులు తెలిపారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు యువకులను స్టేషన్‌లో అప్పగించి ఫిర్యాదు చేశారు. 

‘సీఎం ఇంట్లో అంట్లు కడుగుతున్నారా’
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రానికి చెందిన యువకులు సర్వే పేరుతో తిరుగుతుంటే ఇంటెలిజెన్స్‌ చీఫ్‌  ఏం చేస్తున్నారని, ముఖ్యమంత్రి ఇంట్లో అంట్లు కడుగుతున్నారా అని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. లోకేశ్‌కు ఓటమి తప్పదని తెలిసి డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, సీఎం కలిసి కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మంగళగిరిలో లోకేశ్‌ ఓటమి తథ్యమన్నారు. పోలీసులు ఏమీ అనరని యువకుల ఫోన్‌లకు మెసేజ్‌లు వచ్చాయని, డబ్బులు పంపినట్లు రసీదులు ఉన్నాయని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top