కాంగ్రెస్‌ ఓ పనికిమాలిన పార్టీ!

Tammineni Veerabhadram Fires On Congress And TRS - Sakshi

‘సాక్షి’ ఇంటర్వ్యూలో తమ్మినేని వీరభద్రం

దుష్ట టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు వారితో కలవాలా? 

పాలక పార్టీలతో దోస్తీ వామపక్ష విస్తరణకు ప్రమాదం

 కేసీఆర్‌ విధానాలతో టీఆర్‌ఎస్‌లో అంతర్గత కలహాలు సహజమే

బీఎల్‌ఎఫ్‌ గెలిస్తే బీసీనే ముఖ్యమంత్రి

కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్, టీడీపీ అంతా ఒక్కటే

సాక్షి, హైదరాబాద్‌: పాలక పార్టీలతో పొత్తులు, అవగాహన వంటివాటితోనే రాష్ట్రంలో.. వామపక్షపార్టీల విస్తరణకు విఘాతం కలిగిందని భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో పాలక పార్టీని ఓడించేందుకు.. మరో రాష్ట్రంలోని పాలక పార్టీతో పొత్తులు కుదుర్చుకోవడం కారణంగానే.. కమ్యూనిస్టులకు ఓట్లేసినా అంతే.. అనే నిర్లిప్తత ప్రజల్లో వచ్చిందన్నారు. ‘టీఆర్‌ఎస్‌ దుష్టపాలనను అంతం చేయడానికి, కాంగ్రెస్‌ అనే పనికిమాలిన పార్టీతో కలవాలా?’అని ఆయన ప్రశ్నించారు.

బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) ద్వారా ఎందరో సమర్థులు, కొత్త నేతలు పోటీలోకి వస్తున్నారని చెప్పారు. గతంలో ఏనాడూ నామినేషన్‌ కూడా వేయని అట్టడుగు కులాలు, సామాజికవర్గాలు ఇప్పుడు బీఎల్‌ఎఫ్‌ ద్వారా ఎన్నికల్లోకి వస్తున్నారన్నారు. తాను ఎక్కడా పోటీ చేయడం లేదని.. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నవారు పోటీకి దూరంగా ఉండాలనే పార్టీ విధాన నిర్ణయాన్ని శిరసావహిస్తానని.. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. 

సాక్షి: రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? 
తమ్మినేని: ఇంత త్వరగా రావాల్సిన ఎన్నికలు కావివి. 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దుచేయడం అప్రజాస్వామికం. అసెంబ్లీ రద్దుకు సీఎం కేసీఆర్‌ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నందుకే అసెంబ్లీని రద్దు చేశామనడం పిచ్చోళ్ల మాటల్లా ఉన్నాయి. పైకి కేసీఆర్‌ ఏ కారణం చెప్పినా, అసలు కారణం వేరు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను విడదీయడం వెనుక రాజకీయ కారణముంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎజెండా, ఒక పొత్తుతో ఎన్నికలకు వెళ్లడం.. లోక్‌సభ ఎన్నికల్లో మరో ఎజెండా, మరో పొత్తుతో వెళ్లాలనేది కేసీఆర్‌ ఎత్తుగడ. ఈ ఎన్నికల్లో ప్రధానంగా నాలుగు కూటమిల మధ్య పోటీ ఉంటుంది. అవి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కూటమి, బీజేపీ కూటమి అయితే నాలుగోది బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌. ఆ మూడూ కూటములూ ఒక్కటే. ఆ పార్టీల ఎజెండా, ఆర్థిక విధానాలన్నీ ఒక్కటే. 

బీఎల్‌ఎఫ్‌ ఎజెండా ఏమిటి? 
బీఎల్‌ఎఫ్‌ ప్రధానంగా 7 అంశాల్లో ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తోంది. అన్నివర్గాలకు ఉచితంగా విద్యను అందించడం. వైద్యాన్ని కార్పొరేట్‌ రంగం చేతుల్లో లేకుండా చేసి, ప్రభుత్వమే పూర్తిగా ఉచిత వైద్యం అందించడం. దున్నే వారికే భూమి, ఉండటానికి ఇళ్లు ఇవ్వడం. నైపుణ్య స్థాయిని బట్టి ఉద్యోగం లేదా ఉపాధిని కల్పించడం. ఉద్యోగులకు జీతంపై భద్రత కల్పించడం. అన్ని రంగాల్లోనూ సామాజికన్యాయం అమలుచేయడం. ఈ ఏడు ముఖ్యమైన అంశాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ పాలకపార్టీల వైఖరితో బహుళజాతి కంపెనీలు, భూస్వాములు, ధనికుల చేతుల్లో ఇవన్నీ ఉన్నాయి, వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని బీఎల్‌ఎఫ్‌ చెబుతోంది. 

ప్రత్యామ్నాయంగా మీరు చూపిస్తున్న మార్గాలేవీ? 
విద్య, వైద్యం వంటివాటిలో ప్రైవేటు పెట్టుబడులను క్రమంగా తగ్గించడం. ఆ తర్వాత కాలంలో పూర్తిగా ప్రైవేటు పెట్టుబడులు లేకుండా చేస్తాం. వీటిని ప్రజలకు ఉచితంగా అందిస్తాం. పారిశ్రామికరంగంలోనూ ప్రభుత్వ పెట్టుబడులను పెంచుతాం. స్థానికంగా లభ్యమయ్యే వనరులను బట్టి పరిశ్రమలను స్థాపిస్తాం. పత్తి పండుతున్న ప్రాంతంలో జిన్నింగ్‌ మిల్లు, గ్రానైట్, పసుపు, మిర్చి, వెదురు బొంగులు వంటి పరిశ్రమలకు అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో రైతుల ఆత్మహత్యలను నివారించడానికి.. దోపిడీ చేస్తున్న దళారులపై ఉక్కుపాదం మోపే ౖధైర్యం, సాహసం ఆ పార్టీలకుందా? గిట్టుబాటు ధరలు ఇస్తామనేది బీఎల్‌ఎఫ్‌ ప్రతిపాదన. దళితులకు చట్టబద్ధ హక్కులు, అట్టడుగు వర్గాలకు, కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలని బీఎల్‌ఎఫ్‌ కోరుతోంది.  

అన్ని పార్టీలు సామాజికన్యాయం అంటున్నాయి కదా.... 
కులాలను ఆదుకోవడాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంకుచితంగా నిర్వచిస్తోంది. గొర్రెలు, బర్రెలు, చేప లు, పందిపిల్లలను ఇచ్చి కులాలకు ఏదో చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నది. వృత్తులను కాపాడాల్సిందే. కానీ.. ఒక కులంలో పుట్టినవారంతా ఆ కుల వృత్తిలోనే తరాలు అన్నీ మగ్గిపోవాల్సిందేనా? అట్ట డుగు వర్గాల్లో పుట్టినవారు డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రజా ప్రతినిధులు, పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు కావాలి. అంతిమంగా కుల నిర్మూలన జరగాలి. ఇది సామాజిక న్యాయానికి అసలైన అర్థం. మా పార్టీ రిజర్వుడు స్థానాల్లోనే కాకుండా జనరల్‌ స్థానాల్లోనూ సంచార కులాలు, బీసీలు, ఎంబీసీలు, మైనారిటీలు, మహిళా అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ ఇప్పటిదాకా కేవలం 20–25 సీట్లను ఇస్తే, కాంగ్రెస్‌ ఇంకా ప్రకటించలేదు. బీసీనే బీఎల్‌ఎఫ్‌ ద్వారా సీఎం అవుతారు. మహిళకు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం వస్తుంది.  

బీఎల్‌ఎఫ్‌ ఏర్పాటు టీఆర్‌ఎస్‌కు లాభం చేయడానికేనన్న విమర్శలపై.. 
ఓట్ల చీలిక అనేది గతంలోనే జరిగిన చర్చ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవద్దనే గతంలో కొన్ని పార్టీలతో కలిసి పనిచేసినం. పాలకపార్టీని ఓడించడానికి స్వంతంగా బలం సరిపోదని, మరో పాలకపార్టీతో కలిసి పనిచేసినం. టీఆర్‌ఎస్‌ దుష్టపాలనను అంతం చేయడానికి, కాంగ్రెస్‌ అనే పనికిమాలిన పార్టీతో కలవాలా? అందుకే ప్రత్యామ్నాయ విధానాలు, సామాజికన్యాయం, బహుజనవాదంతో ప్రజల ముందుకు వస్తున్నం. ప్రజలు అంగీకరిస్తారా..? అంగీకరించరా..? అనేది ప్రజల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. బీఎల్‌ఎఫ్‌లో సీపీఎంతోపాటు ఆర్‌ఎస్‌పీ, ఎంసీపీఐ వంటిపార్టీలు ఉన్నాయి, ఉమ్మడి గుర్తుకోసం బహుజన లెఫ్ట్‌ పార్టీ (బీఎల్‌పీ) పేరుతో రాజకీయపార్టీని రిజిష్టర్‌ చేశాము. నాగలి పట్టిన రైతు గుర్తు వచ్చింది. సీపీఎం అభ్యర్థులు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై పోటీచేస్తారు. బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులంతా నాగలి పట్టిన రైతు గుర్తుపై పోటీచేస్తారు. 

ప్రభుత్వంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? 
టీఆర్‌ఎస్‌తో ఉపయోగం లేదని ప్రజలు గుర్తించారు. ప్రత్యామ్నాయంగా కనిపించిన మహాకూటమి ఆ బలాన్ని సంతరించుకోలేదు. బీజేపీ చాలా దూరంలో ఉంది. ఈ పరిస్థితుల్లో బీఎల్‌ఎఫ్‌ సాధించే సీట్లు కీలకం అవుతాయి. కచ్చితంగా రాష్ట్రంలో హంగ్‌ అసెంబ్లీ తప్పదు. ఈ హంగ్‌లో బీఎల్‌ఎఫ్‌ సాధించే సీట్లతో ప్రభుత్వంలో భాగం అవుతాం. బీఎల్‌ఎఫ్‌ ఎజెండాను అమలు చేసుకుంటాం. ఇప్పటికిప్పుడే పూర్తిగా బలాన్ని సాధిస్తామని చెప్పలేం. ఏ రోజుకైనా మా ప్రత్యామ్నాయ ఆర్థికవిధానాలు, ఎజెండాను ప్రజలు గుర్తిస్తారు. 

మీ బలం సరిపోతుందా.? 
స్వంత ఎజెండాతో ప్రజల ముందుకు వస్తున్నాం. తాత్కాలిక అవసరాలకోసం దీర్ఘకాల ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దనే నిర్ణయానికి వచ్చినం. కొన్ని ఓట్లు, కొన్ని సీట్లకు ఎందుకు పరిమితం కావాలి? పాలకపార్టీలతో జత కట్టడం వల్ల కమ్యూనిస్టులపై నమ్మకం సన్నగిల్లుతోంది. కమ్యూనిస్టులకు ఓట్లేసి గెలిపించినా ఏదో ఒక పార్టీ అనే రైలు ఇంజనుకు బోగీని తగిలిస్తారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. 2014లో సీపీఎం బలం చాలా తక్కువ. అన్ని వర్గాల్లో చేసిన పోరాటంతో సీపీఎం బలం చాలా పెరిగింది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌పార్టీ నేతలు కూడా మాట్లాడటానికి భయపడిన రోజుల్లోనే సీపీఎం ధైర్యంగా పోరాటాలు చేసింది.  

టీఆర్‌ఎస్‌ పాలన తీరు ఎలా ఉంది? 
టీఆర్‌ఎస్‌ అన్ని రంగాల్లో విఫలమైంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. నీళ్లు, నిధులు, నియామకాలైన ఉద్యమ నినాదాలేమీ సాధించలేదు. ఆ నినాదాలు వట్టి నినాదాలుగానే మిగిలిపోయాయి, బంగారు తెలంగాణ పేరు చెప్పి కేసీఆర్‌ కుటుంబాన్ని బంగారు కుటుంబాన్ని చేసుకున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు అలాగే ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్‌ విధానాలతో టీఆర్‌ఎస్‌లో అంతర్గత కలహాలు సహజం. ఆ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలే కాకుండా కుటుంబంలోనూ అంతర్గత కలహాలున్నాయనే వార్తలు చూస్తున్నాం. హోంమంత్రే తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించే పరిస్థితి వచ్చింది.

సీపీఐని కలుపుకోలేకపోవడంపై.. 
వామపక్షాలుగా ఐక్యంగా ఉండటం కంటే కాంగ్రెస్‌పార్టీతో కలవడానికే సీపీఐ ప్రాధాన్యతను ఇచ్చింది. గతంలో కాంగ్రెస్‌ పాలనను చూశాం. కుంభకోణాలు, ముఠా తగాదాలు, అవినీతి, ప్రజా వ్యతిరేక ఆర్థికవిధానాలు అమలు వంటివన్నీ అనుభవంలోనే ఉన్నాయి. కాంగ్రెస్‌ను ఓడించేందుకు టీడీపీతో.. ఆ తర్వాత టీడీపీని ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలిసి పనిచేశాం. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఇప్పుడు కాంగ్రెస్‌తో.. మరో నాలుగేళ్ల తర్వా త కాంగ్రెస్‌ను ఓడించడానికి టీఆర్‌ఎస్‌తో జతకట్టాలా? ఇలాం టి ప్రయోగాలు సరైనవి కావు. ఒకరిని ఓడించడానికో, మరొకరిని గెలిపించడానికో కమ్యూనిస్టులు పరిమితం కావాలా? పొత్తులు ఇంకా పూర్తికాకున్నా ఇప్పటికే సీపీఐకి కొంత అర్థమైనట్టుంది. కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుంటే బీఎల్‌ఎఫ్‌లోకి సీపీఐ, టీజేఎస్‌లను ఆహ్వానిస్తాం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top