
మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీపీఐ, టీజేఎస్ నేతలు కూటమిలో అవమానాలు భరిస్తూ సీట్ల కోసం తమ గౌరవాన్ని తాకట్టు పెట్టొ ద్దని బీఎల్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం హితవు పలికారు. కూటమి నుంచి బయటకు వచ్చి బీఎల్‌ఎఫ్‌తో కలిస్తే అడిగినన్ని సీట్లు ఇస్తామని చెప్పా రు. ఖమ్మంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు, మూడు సీట్ల కోసం పాకులాడి చులకన కావద్దని సీపీఐకి హితవు పలికారు. టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అంటూ సీపీఐ చెప్పడం ఆత్మహత్యాసదృశమేనని చెప్పారు.
ఈ పరిస్థితి నుంచి సీపీఐతో పాటు టీజేఎస్ బయటపడి ప్రజల కోసం విధానపరంగా పోరాడుతున్న సీపీఎం–బీఎల్‌ఎఫ్ కూటమికి చేరువ కావాలని కోరారు. స్వచ్ఛమైన రాజకీయాల కోసం ప్రత్యామ్నాయ రాజకీయమే లక్ష్యంగా బీఎల్‌ఎఫ్ పోటీ చేస్తోందని చెప్పారు. 72 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశాన్ని అధోగతి పాలు చేసిందని, టీఆర్‌ఎస్ కుటుంబ పాలనతో ఆపార్టీ నేతలు జనం కలలను కల్లలు చేశారన్నారు. ఇప్పటికైనా సీపీఐ, టీజేఎస్‌లు పునరాలోచించుకోవాలని కోరారు.