కారెక్కనున్న స్వర్ణారెడ్డి..? | Swarna Reddy Joining In Trs? | Sakshi
Sakshi News home page

కారెక్కనున్న స్వర్ణారెడ్డి..?

Apr 6 2019 12:13 PM | Updated on Apr 6 2019 12:13 PM

Swarna Reddy Joining In Trs? - Sakshi

డాక్టర్‌ స్వర్ణారెడ్డి (ఫైల్‌)

సాక్షి, ఆదిలాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని నిర్మల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నిర్మల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ స్వర్ణారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కారెక్కనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్‌లో బీజేపీకి కొంత పట్టుంది. ఆమె చేరికతో టీఆర్‌ఎస్‌కు ప్రయోజనం చేకూర్చే అవకాశాలున్నాయి. ఆమె కేసీఆర్‌ సభలో టీఆర్‌ఎస్‌లో చేరుతారా.. లేకపోతే అంతకుముందే కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారా.. అనేది వేచిచూడాల్సిందే!

రాజకీయ భవిష్యత్తు కోసమే..!
స్వర్ణారెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం తాజాగా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల ముందు ఆమె బీజేపీ పార్టీలో చేరారు. అంతకుముందు ఏడాది కాలం నుంచి నిర్మల్‌ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. ప్రధానంగా మాజీ డిప్యూటీ స్పీకర్‌ భీంరెడ్డి కుమార్తెగా, స్త్రీవైద్య నిపుణురాలిగా ఆమెకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది.

ట్రస్ట్‌ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో శాసన సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టిక్కెట్‌ ఆశించారు. ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆమె 16వేల 900 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కాగా ఆమె తండ్రి దివంగత మాజీ డిప్యూటీ స్పీకర్‌ భీంరెడ్డికి మాజీ స్పీకర్‌ మధుసూదనచారితో సన్నిహితం ఉండడంతో ఆయన ద్వారా ఆమె పార్టీలోకి వస్తుందనే చర్చ కూడా సాగుతోంది. ఏదేమైనా నిర్మల్‌ నియోజకవర్గంలో ప్రస్తు్తత పరిణామాలు ప్రతీ ఒక్కరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 

‘అల్లోల’ ఎత్తుల వల్లే..!
సీఎం ఆదిలాబాద్‌ లోక్‌సభ ఎన్నికల బాధ్యతలను రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి అప్పగించారు. దీన్ని ఐకేరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పార్లమెంట్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోడం నగేష్‌ గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ కంటే ఈ ఎన్నికల్లో మెజార్టీ పెంచేందుకు నియోజకవర్గాల వారీగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే బోథ్‌ నుంచి కాంగ్రెస్‌ రెబల్‌గా పోటీ చేసి ఓటమి పాలైన అనిల్‌ జాదవ్‌ను ఇటీవల పార్టీలో చేర్పించడం ఎత్తుగడలో భాగంగానే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బోథ్‌ నియోజకవర్గంలో అనిల్‌ జాదవ్‌ 28 వేల ఓట్లను సాధించారు. తద్వారా ఈ ఓట్లను లోక్‌సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోడం నగేష్‌కు మళ్లించిన పక్షంలో అసెంబ్లీ కంటే ఈ ఎన్నికల్లో మెజార్టీ అధికంగా సాధించవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిర్మల్‌ నియోజకవర్గంలో స్వర్ణారెడ్డి రాక టీఆర్‌ఎస్‌కు ఓట్ల పరంగా లాభం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శాసనసభ ఎన్నికల్లో నిర్మల్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన ఐకేరెడ్డి 79వేల 985 ఓట్లు సాధించారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మహేశ్వర్‌రెడ్డి 70వేల 714 ఓట్లు సాధించారు. 9,271 మెజార్టీతో ఐకేరెడ్డి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక ఓట్లు సాధించేందుకు ఐకేరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీకి చెందిన స్వర్ణారెడ్డిని టీఆర్‌ఎస్‌లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement