జగన్‌ను సీఎం చేసేందుకు కష్టపడదాం: సజ్జల

Sajjala Ramakrishna Reddy Speaks On YSRCP Training Classes - Sakshi

సాక్షి, ప్రకాశం: బూత్‌ కమిటి కన్వీనర్లు అంటే గ్రూప్‌ కెప్టెన్‌ లాంటి వాళ్ళని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి అన్నారు. ఒంగోలులో జరుగుతున్న వైఎస్సార్‌సీపీ రాజకీయ శిక్షణ తరుగతుల్లో సజ్జల మాట్లాడుతూ... గ్రామాల్లో జరిగే అధికార పార్టీ ఆగడాలు పసిగట్టేది మొదట బూత్‌ కమిటీ మాత్రమేనని, రాష్ట్రంలో ఉన్న 44 వేల బూత్‌ కన్వీనర్లు పార్టీకి సుశిక్షితులైన సైన్యంలా యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

‘పచ్చ మీడియా విషం చిమ్ముతోంది ఆత్మవిశ్వాసం కోల్పోకండి. చంద్రబాబు అంటే ఒక నకిలీ. రాజకీయం అంటే బాబుకి ప్రజాసేవ కాదు ఒక ఆట. మీలో ఉన్న సందేహాలను పక్కనపెట్టి కష్టపడండి. టీడీపీని నామరూపాలు లేకుండా చేద్దాం. మీ బూత్‌ పరిధిలో నిత్యం ప్రజలతో మమేకమై, జగన్‌మోహన్‌ రెడ్డిని సీఎం చేసేందుకు కష్టపడండి. చంద్రబాబులా ప్రచారం కాకుండా జగన్‌ పేదల కోసం సేవ చేస్తాడు. పార్టీ అధిష్టానం నుంచి నేరుగా బూత్‌ కమిటీ కన్వీనర్ల ఫోన్స్‌కి సందేశాలు వస్తాయి వాటిని గ్రామ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లండి.

రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే కేంద్రంపై ఒత్తిడి చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవచ్చు. బీజేపీతో వైఎస్సార్‌సీపీ పొత్తు అంటూ టీడీపీ విషప్రచారం చేస్తోంది, వాటిని గ్రామ స్థాయిలో తిప్పికొట్టండి. బీజేపీతో సంబంధాలు ఉంటే 13 సార్లు కేంద్రంపై అవిస్వాసం పెడతామా?. అవిస్వాసం పెట్టడమంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటమే. క్షేత్రస్థాయిలో మీరు జగన్‌ ప్రతినిధిలా నిజాయితీగా పనిచేస్తే 160 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాం. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గ్రామ స్థాయిలో బూత్‌ కన్వీనర్లదే కీలక పాత్ర’ అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top