చర్చనీయాంశంగా మారిన సచిన్‌ పైలట్‌ ట్వీట్‌

Sachin Pilot Tweet Over Jyotiraditya Scindia Leaves Congress Party - Sakshi

జైపూర్‌: ఇప్పటికే అధినాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు జ్యోతిరాదిత్య సింధియా ఎపిసోడ్‌తో మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవకుండా చతికిలపడటం వంటి పరిణామాలతో పాటు తాజాగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మైనార్టీలో పడటం వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ వైదొలగడం.. మళ్లీ సోనియా గాంధీకే పగ్గాలు అప్పగించిన క్రమంలో పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న నాయకుల వాదనకు.. సింధియా నిష్క్రమణ మరింత బలాన్ని చేకూర్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ మరో యువనేత, రాజస్థాన్‌ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ చేసిన ట్వీట్‌ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్న విషయాన్ని స్పష్టం చేసింది. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీని వీడటం దురదృష్టకరమన్న సచిన్‌.. పార్టీలో ఉన్న అన్ని సమస్యలు పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు.(సొంత ప్రభుత్వంపై సచిన్‌ పైలట్‌ విమర్శలు)

కాగా దాదాపు 15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సింధియాను పక్కన పెట్టడంతో ఆయన పార్టీని వీడిన విషయం తెలిసిందే. సీనియర్‌ నేత, సీఎం కమల్‌నాథ్‌తో తలెత్తిన విభేదాల కారణంగానే ఆయన బీజేపీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడటంతో కమల్‌నాథ్‌ సర్కారు కూలిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో మాదిరే.. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌.. రానున్న రోజుల్లో రాజస్థాన్‌లో బీజేపీ... ఆపరేషన్‌ కమల్‌కు తెరతీయవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎందుకంటే అక్కడ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం బొటాబొటి మెజార్టీతో నెట్టుకొస్తున్న విషయం విదితమే. (‘మహరాజ్‌’ కోసం ఏం చేయడానికైనా సిద్ధం..!)

ఇక కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో కీలకంగా వ్యవహరించిన సచిన్‌ పైలట్‌, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ల మధ్య కూడా సంబంధాలు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన.. రాజస్తాన్‌లోని కోటాలో చిన్నారుల మృతి అంశం సహా వివిధ అంశాల్లో సచిన్‌.. అశోక్‌కు వ్యతిరేకంగా బాహాటంగానే తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. అదే విధంగా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి రాజీవ్‌ అరోరాను పెద్దల సభకు పంపాలన్న గహ్లోత్‌ ప్రతిపాదనను కూడా ఈ యువనేత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాలను ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రాజస్తాన్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల బలం 200 కాగా కాంగ్రెస్‌కు 112 మంది సభ్యుల మద్దతు ఉంది. వీరిలో సీపీఎం నుంచి ముగ్గురు, ఆర్‌ఎల్‌డీ నుంచి ఇద్దరు ఉన్నారు. ఇక బీజేపీకి 80 మంది సభ్యులున్నారు. ఒక 20 మందిని తమ వైపుకి లాక్కుంటే రాజస్తాన్‌ కూడా బీజేపీ వశమవుతుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top