
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీకి 150 స్థానాలు దక్కుతాయంటూ ప్రఖ్యాత ‘దినమలర్’ పత్రిక సర్వే నివేదికను ప్రచురించడం తమిళనాడులో సంచలనం రేపుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ ప్రభంజనం సృష్టిస్తారని, ఆయన సీఎం కావడం తథ్యమని నివేదికలో తెలిపారు. సదరు కథనంపై అధికార అన్నాడీఎంకేలో విపరీతమైన చర్చ నడుస్తున్నట్లు తమిళ మీడియా పేర్కొంది. చాలా రోజుల కిందటే రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తానని ప్రకటించిన రజని.. ఇప్పటిదాకా పార్టీ పేరుగానీ, విధానాలుగానీ వెల్లడించని సంగతి తెలిసిందే. రజనీకాంత్ నటించిన కాలా సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఆ సినిమా విడుదలైన తర్వాత రజనీ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిసారిస్తారని ‘దినమలర్’ తెలిపింది.