మోదీ ఇలాకాలో ప్రియాంక తొలి ప్రసంగం..! | Sakshi
Sakshi News home page

మోదీ ఇలాకాలో ప్రియాంక తొలి ప్రసంగం..!

Published Tue, Mar 12 2019 8:28 PM

Priyanka Gandhi debuts at Gujarat rally - Sakshi

సాక్షి, గాంధీనగర్‌‌: ప్రేమ, అహింస, సద్భావన పునాదులుగా నిర్మితమైన దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ.. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మంగళవారం కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగసభలో ప్రియాంక గాంధీ తొలిసారి రాజకీయ ప్రసంగం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. విద్వేషం, విభజన రాజకీయాలకు ఈ దేశంలో చోటులేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 2కోట్ల ఉద్యోగాలు, 15లక్షల నల్లధనం హామీలు ఏమయ్యాయో చెప్పాలని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ఓటు  గొప్ప ఆయుధమన్న ప్రియాంక.. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని ఓడించాలి: రాహుల్‌
దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని ఓడించేందుకు ఎంతటి త్యాగమైనా  తక్కువేనని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఈ యుద్ధం గెలవాల్సిందేనని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సొంత ఇలాఖా గుజరాత్‌లో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించింది. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులంతా ఈ భేటీకి హాజరయ్యారు. సైన్యం సాహసాలను రాజకీయం చేస్తున్నారంటూ వర్కింగ్ కమిటీ భేటీలో ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు సోనియాగాంధీ. విభజించి పాలిస్తూ... ప్రజల ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ప్రతిపాదించిన పేదలకు కనీస ఆదాయ పథకం తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. 1961 అంటే 58 ఏళ్ల తర్వాత గుజరాత్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరిగింది. లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం మార్చ్‌ 14న ఢిల్లీలో సమావేశం అవుతుంది.

సీడబ్ల్యూసీ  భేటీ కోసం అహ్మదాబాద్‌ వచ్చిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఉప్పు సత్యాగ్రహానికి 88 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సబర్మతీ ఆశ్రమ నిర్వాహకులు రాహుల్‌ గాంధీకి చరఖాను బహుమతిగా అందించారు. తర్వాత సోనియా, రాహుల్‌, ప్రియాంక సబర్మతీ ఆశ్రమం మ్యూజియంను సందర్శంచి... విజిటర్స్ బుక్‌లో సంతకాలు చేశారు.



కాంగ్రెస్‌లో చేరిన హార్థిక్‌ పటేల్‌
పటేల్‌ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమించిన గుజరాత్ యువ నాయకుడు హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌లో చేరారు. అహ్మదాబాద్‌లో కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Advertisement
Advertisement