
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఆయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ.. ఫలితాల్లో పరాభవాన్ని చవిచూసింది. వ్యక్తిగతంగా రెండు నియోజకవర్గాల్లో పోటీచేసిన సిద్దరామయ్యకు అక్కడ కూడా గడ్డు పరిస్థితి నెలకొంది. చాముండేశ్వరి నియోజకవర్గంలో 17వేల ఓట్లకుపైగా తేడాతో సిద్దరామయ్య ఓటమిపాలయ్యారు. ఇటు బాదామి స్థానంలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములుతో హోరాహోరీగా పోరాడుతున్నారు. బాదామిలో అతికష్టం మీద 160 ఓట్ల ఆధిక్యంలో సిద్దరామయ కొనసాగుతున్నారు.
సిద్దరామయ్య ఓటమికి ఆయన అహంకారపూరిత వైఖరే కారణమని జేడీఎస్ నేతలు మండిపడుతున్నారు. తన గురువు అయిన దేవెగౌడను సిద్దరామయ్య కించపరిచారని, అందుకే ఆయన ఓటమిపాలయ్యారని అభిప్రాయపడ్డారు. చాముండేశ్వరి నియోజకవర్గంలో సిద్దరామయ్యపై గెలుపొందిన జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ మాట్లాడుతూ సీఎం తీరుపై మండిపడ్డారు. ప్రజలు సిద్దరామయ్య తిరస్కరించారని, అహంకారపూరిత వైఖరే ఆయన పరాజయానికి కారణమని విమర్శించారు. ప్రతి ఒక్కరినీ దూషించడం, నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు ఆయనకు ప్రజలు తగిన శాస్తి చేశారని జీటీ దేవెగౌడ వ్యాఖ్యానించారు.