ఎమ్మెల్సీ పదవికి నరేందర్‌రెడ్డి రాజీనామా

Patnam Narender Reddy Resigned To MLC Post - Sakshi

ఇటీవల కొడంగల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానిక సంస్థల కోటా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జోడు పదవుల నేపథ్యంలో నరేందర్‌ ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. కాగా, ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై వేటు వేసేందుకు గులాబీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎమ్మెల్సీ పదవికి పట్నం నరేందర్‌రెడ్డి రాజీనామా చేశారు. గురువారం ఆయన తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు అందజేశారు. స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి సభ్యుడిగా గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి.. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. జంట పదవుల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ పదవిని త్యజించారు. తొలిసారి 2007లో ఎమ్మెల్సీగా పెద్దల సభలోకి నరేందర్‌ అడుగు పెట్టారు. ఆ తర్వాత రెండోసారి 2015లోనూ స్థానిక సంస్థల కోటాలోనే ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇటీవల ఆయన వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌ రేవంత్‌రెడ్డిని ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అయితే, జోడు పదవులను అనుభవించ వద్దనే కారణంగా మండలికి నరేందర్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు. 

ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే! 
నరేందర్‌రెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయినా.. ఇప్పట్లో భర్తీ చేసే అవకాశం కనిపించడం లేదు. ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉన్న ఈ సీటును స్థానిక సంస్థల ఓటర్లతో భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ పదవులకు 2015లోనే ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఒకరు నరేందర్‌రెడ్డి గెలవగా.. మరొకరు శంభీపూర్‌ రాజు ఎన్నికయ్యారు. అయితే, ఈ ఫిబ్రవరిలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో.. అప్పటిలోగా ఈ ఖాళీని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటిఫికేషన్‌ ద్వారా గుర్తిస్తుందా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.  

యాదవరెడ్డిపై వేటు? 
ఇటీవల గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్‌ గూటికి చేరిన ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై వేటు వేయాలని టీఆర్‌ఎస్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంతో ఆయను పార్టీ నుంచి అధినాయకత్వం బహిష్కరించిన విషయం తెలిసిందే.చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అధినాయకత్వంపై తిరుగుబాటు చేసిన తరుణంలోనే ఆయనతో కలిసి యాదవరెడ్డి కూడా ధిక్కారస్వరం వినిపించిన సంగతి విదితమే. తాజాగా ఎసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడం.. ఆఖండ విజయం సాధించడంతో ఊపుమీద ఉన్న టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌..

ఎన్నికల వేళ తిరుగుబాటు చేసిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన యాదవరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేసే అంశాన్ని పరిశీలిస్తోంది. కేవలం యాదవరెడ్డే కాకుండా... మరికొందరు రెబల్స్‌పై వేటు వేయాలని నిర్ణయించిన టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌.. ఒకట్రెండు రోజుల్లో స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. అయితే, ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాంగ్రెస్‌ తరుఫున గెలిచి.. టీఆర్‌ఎస్‌లో చేరిన దామోదరరెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరిపై చర్యలకు ఇది సాంకేతికంగా అడ్డుగా మారిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎలాంటి అడుగు వేస్తుందో వేచిచూడాల్సిందే!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top