
లక్నో: కేంద్రంలోనూ, 19 రాష్ట్రాల్లోనూ అధికారాన్ని చెలాయిస్తున్న కమలం పార్టీలో వింత పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీటును దక్కించుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మాజీ రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ రాజీనామాతో ఖాళీ అయిన పెద్దలసభ సీటును బీజేపీలో ఎవరూ ఆశించకపోవడం వెనుక మరో కారణం ఉంది. పరీకర్ రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయనను యూపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేశారు. మళ్లీ తన సేవలు అవసరం పడటంతో ఆయన తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు.
ఆశావహుల నిరాసక్తత
పార్టీలో ఏదైనా పదవి ఖాళీగా ఉందంటే ఆశావహులు భారీగా పైరవీలకు దిగుతుంటారు. కానీ పరీకర్ వదిలివెళ్లిన రాజ్యసభ సీటు దక్కించుకునేందుకు ఎవరూ ముందుకురావడం విస్తుగొల్పుతుంది. ఈ సీటుకు గడువు 2020, నవంబర్ వరకు ఉంది. రెండున్నరేళ్లలో గడువు ముగియనుండటంతో దీనిపై బీజేపీ నేతలెవరూ ఆసక్తి చూపడం లేదు. పూర్తికాలం కొనసాగే పదవులు చేపట్టే అవకాశముండగా స్వల్పకాలిక పోస్ట్ ఎందుకున్న భావనతో ఆశావహులు ఉన్నట్టు కనబడుతోంది.
ఎనిమిది సీట్లపైనే గురి
ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 403 సీట్లున్న శాసనసభలో కమలదళం బలం 325కు పెరగడంతో రాష్ట్రంలో 8 రాజ్యసభ సీట్లు ఈ పార్టీకి దక్కనున్నాయి. మరో ఆరు నెలల్లో ఈ సీట్లను భర్తీ చేస్తారు. ఈ ఆరు మాసాలు ఓపిక పడితే ఆరేళ్ల పదవి సొంతమవుతుందన్న భావనతో పరీకర్ సీటును ఎవరూ ఆశించడం లేదు. ‘రెండేళ్ల రాజ్యసభ సీటు పట్ల ఆశావహులు ఆసక్తి చూపడం లేదు. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్న యూపీలోని పది రాజ్యసభ సీట్ల కోసమే పైరవీలు చేస్తున్నార’ని బీజేపీ అంతర్గత వర్గాలు వెల్లడించాయి.
అల్ఫోన్స్‌కు ఛాన్స్
అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి విజయ్ బహదూర్ పాఠక్ తోసిపుచ్చారు. ఖాళీ అయిన సీటును ఎవరికి కేటాయించాలనేది తమ పార్టీ పార్లమెంటరీ సెంట్రల్ బోర్డు నిర్ణయిస్తుందని చెప్పారు. త్వరలోనే అభ్యర్థిని ఎంపిక చేస్తుందని తెలిపారు. పరీకర్ సీటు కోసం తమ పార్టీ నేతలు ఎందుకు పైరవీలు చేయడం లేదనే దానికి కారణం లేదన్నారు. ఈ సీటును కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి కె. అల్ఫోన్స్‌కు కేటాయించే అవకాశముందని లక్నో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో ఎన్నిక జరగనున్న ఈ స్థానంలో అభ్యర్థిని నిలిపేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది.
పదో సీటు ఎవరిదో..?
యూపీలో వచ్చే ఏడాది ఖాళీ కానున్న 10 రాజ్యసభ సీట్లలో బీజేపీ సొంత బలంతో కనీసం ఎనిమిదింటిని దక్కించుకుంటుంది. 47 మంది ఎమ్మెల్యేలు కలిగిన సమాజ్‌వాదీ పార్టీ ఒక సీటు గెలిచే అవకాశముంది. పదో సీటును ప్రతిపక్షాలు దక్కించుకోవాలంటే సమాజ్‌వాదీ పార్టీకి బీఎస్పీ(19), కాంగ్రెస్(7), ఆర్‌ఎల్డీ(1) మద్దతు అవసరమవుతుంది. యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే 37 ప్రథమ ప్రాధాన్య ఓట్లు అవసరం.