‘పవర్‌’ గేమర్‌

Natinalist Congress Leader sharad pawar Story - Sakshi

కటౌట్‌

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌. ఈయన పేరు వినగానే రాజకీయాలతో పాటు, క్రికెట్‌ ఆట కూడా కళ్లెదుట మెదులుతుంది. క్రికెట్‌లో రాజకీయాలు చేసినా, రాజకీయాలను ఓ ఆటాడుకున్నా ఆయనకే చెల్లింది. క్రీడలంటే పవార్‌కి ఆరో ప్రాణం. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, రెజ్లింగ్, ఫుట్‌బాల్‌.. ఇలా ఎన్నో క్రీడా సంస్థలకు అధ్యక్షుడిగా పనిచేశారు. ముంబై క్రికెట్‌ అసోసియేషన్, బీసీసీఐ సారథ్యంతో పాటు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. అటు రాజకీయ క్రీడలోనూ ఆరితేరారు. అంశమేదైనా అనర్గళంగా మాట్లాడగలరు.

ఒకప్పుడు ప్రధాని కావాలని కలగన్నారు. కానీ ఇప్పుడు వయో భారంతో ఆ ఆశ వదులుకున్నారు. సిద్ధాంతాలకు, భావజాలాలకు, ప్రాంతీయవాదాలకు అతీతంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఏ రాజకీయ పార్టీ అయినా పవార్‌కు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అదే ఆయన అసలు సిసలైన పవర్‌. చక్కెర రైతుల్లో పవార్‌కున్న అంతులేని ఆదరణ ఆయన రాజకీయ జీవితంలో ఎప్పటికీ తీపి గురుతుగా మిగిలిపోతుంది. శరద్‌ పవార్‌ రాజకీయ గురువు వైబీ చవాన్‌. ఆయన సలహా సూచనలు పాటిస్తూ 1978లో, అత్యంత పిన్న వయసులో (37) మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. నోటి కేన్సర్‌ను కూడా జయించి విజేతగా నిలిచారు.

మహారాష్ట్రలోని పుణే జిల్లా బారామతిలో 1940, డిసెంబర్‌ 12న శరద్‌ పవార్‌ జన్మించారు.

పుణేలో బృహన్‌ మహారాష్ట్ర కాలేజీ ఆఫ్‌ కామర్స్‌లో చదివారు. చదువుల్లో పెద్దగా రాణించలేదు. సాదాసీదా విద్యార్థిగానే ఉన్నారు.

విద్యార్థి దశలో ఉండగానే రాజకీయాల వైపు మళ్లి కొత్త పంథాలో వ్యూహాలు రచించారు.

1967లో కాంగ్రెస్‌ నుంచి తొలిసారిగా మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
1978లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి చీలిపోయి జనతా పార్టీతో కలిసి సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేశారు.

1983లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (సోషలిస్టు) పార్టీ పగ్గాలు చేపట్టారు.
1984లో బారామతి నియోజకవర్గం నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.

1985లో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కీలకపాత్ర పోషించారు.
1987లో శివసేన హవాను అడ్డుకోవడానికి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు.

ఆ తర్వాత కాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పని చేశారు.
1991లో పీవీ నరసింహారావు హయాంలో రక్షణ మంత్రిగా సత్తా చాటారు

1993 ముంబైలో అల్లర్ల అదుపునకు పీవీ.. మహారాష్ట్ర సీఎంగా పవార్‌నే పంపించారు. అదే సీఎం పదవిలో ఉండటం పవార్‌కు చివరిసారి.

1999లో కాంగ్రెస్‌ పార్టీకి సోనియాగాంధీ అధ్యక్షురాలు కావడంతో ఆమె విదేశీ మూలాల్ని ధైర్యంగా ప్రస్తావించారు. కాంగ్రెస్‌ని వీడి పీఏ సంగ్మాతో కలిసి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు.

2004లో యూపీఏ హయాంలో తిరిగి సోనియాకు దగ్గరై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవిని పొందారు.

శరాద్‌ పవార్‌ మంచి రచయిత, వ్యాపారవేత్త, వ్యవసాయవేత్త. అధ్యయనాలపై ఆయనకు అమితమైన ఆసక్తి.

అత్యంత ధనికుడైన రాజకీయవేత్త. ప్రపంచం నలుమూలలా లక్షలాది ఎకరాల భూమి ఆయన సొంతం.

ఎన్నో అవినీతి కేసుల్లో ఆరోపణలు, అండర్‌ వరల్డ్‌ మాఫియాతో లింక్‌లు, నకిలీ స్టాంపు కుంభకోణం, గోధుమ ఎగుమతులు, తప్పుడుగా ఆస్తుల్ని చూపించారన్న ఆరోపణలు, క్రికెట్‌కు రాజకీయ రంగు పులమడం వంటివి పవార్‌ రాజకీయ జీవితానికి ఓ మచ్చలా మారాయి. అయినా పవార్‌ రాజకీయ ఎదుగుదలకు అవేవీ అడ్డంకి కాలేదు.
బాలీవుడ్‌ తారలందరికీ పవార్‌తో సత్సంబంధాలున్నాయి.
పవార్‌ కుమార్తె సుప్రియా సూలే కూడా రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేశారు. ఎంపీగా మంచి గుర్తింపును పొందారు.
చిన్నతనంలో చదువుని నిర్లక్ష్యం చేశానన్న బాధతో ఎన్నో విద్యాసంస్థలు స్థాపించారు. అందులో పుణేలో శరద్‌ పవార్‌ ఇంటర్నేషనల్‌ స్కూలు, శరద్‌ పవార్‌ పబ్లిక్‌ స్కూలు ప్రముఖమైనవి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top