మోదీ x దీదీ

narendra modi vs mamata banerjee in west bengal - Sakshi

పశ్చిమబెంగాల్‌ @ 5వ విడత

పశ్చిమ బెంగాల్‌లో సమఉజ్జీల సమరం

ఈ పోరాటం రాజకీయాల్ని ఏ మలుపు తిప్పుతుంది ?

అయిదో దశలో ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్‌

హుగ్లీ నదీ తీరంలో వేడెక్కిన రాజకీయాలు

బెంగాల్‌ అంటే ఎన్నికల్లో హింస, బెంగాల్‌ అంటే నాటు బాంబుల పేలుళ్లు, బెంగాల్‌ అంటే తుపాకుల రాజ్యం. ఇన్నాళ్లూ ఇదే మాట. ఈ సారి లోక్‌సభ ఎన్నికల వేళ బెంగాల్‌ అంటే మోదీ వర్సెస్‌ దీదీ అనే మాటే వినిపిస్తోంది. ఒకరు కొదమ సింహమైతే, మరొకరు రాయల్‌ బెంగాల్‌ టైగర్‌. వీరిద్దరి మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తృణమూల్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ చేసిన కామెంట్స్‌ బెంగాల్‌ రాజకీయాల్ని కుదిపేశాయి. ఇద్దరు సమ ఉజ్జీల మధ్య జరుగుతున్న సమరం రసకందాయంలో పడింది. ఇప్పుడు ఇదే ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపించే అంశంగా మారింది. ఈ నెల 6న జరిగే అయిదో దశ పోలింగ్‌లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో రెండింట్లో మాత్రమే బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు అంచనా.

స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే బెంగాల్‌ రాష్ట్రం గురించి చెప్పిన మాట ఒకటుంది.  ‘‘ఇవాళ బెంగాల్‌ ఏం ఆలోచిస్తుందో, రేపు భారత్‌ కూడా అదే ఆలోచిస్తుంది‘‘ అంటే ఆ రాష్ట్ర ప్రజలు ఆలోచనల్లో ఎంత ముందు ఉంటారో అన్న అర్థంలో గోఖలే  బెంగాల్‌ను ప్రశంసించారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 42 లోక్‌సభ స్థానాలతో కేంద్రంలో చక్రం తిప్పగలిగే ఈ రాష్ట్రంలో రాజకీయపరమైన హింస, ఎన్నికల వేళ  హింస, వ్యక్తిగత దూషణలు, ధనబలం, కండబలం ఒక్కొక్కటిగా వచ్చి చేరాయి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడడం మొదలు పెట్టాక మతపరమైన విభజన కూడా మొదలైంది. కనీసం 22 లోక్‌సభ సీట్లలోనైనా నెగ్గాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న మోదీ, షా ద్వయం వ్యూహాలు అంత తేలిగ్గా అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయితే తనకు తిరుగులేదని, తన మాటే శాసనమన్న నియంతృత్వ ధోరణిలో పాలిస్తున్న మమతా బెనర్జీ(దీదీ)లో ఒక కలవరమైతే తెప్పించారు. ఈ సారి ఎన్నికల పోరు టీఎంసీ, బీజేపీ మధ్యే సాగుతోంది, సీపీఎం, కాంగ్రెస్‌ సైడ్‌ ప్లేయర్లుగా మారి బిత్తర చూపులు చూస్తున్నాయి.

బన్‌గావ్‌లో మార్పు కోరుతున్నారా ?
భారత్, బంగ్లాదేశ్‌లకు సరిహద్దుగా ఉన్న బన్‌గావ్‌ నియోజకవర్గం (ఎస్సీ నియోజకవర్గం)లో ఎస్సీల్లో విష్ణువుని పూజించే  మతువా వర్గం ఓట్లు అత్యంత కీలకం. ఈ సారి ఎన్నికల్లో  ప్రజలు మార్పు కోరుకున్నట్టు స్పష్టమవుతోంది. బంగ్లాదేశ్‌ నుంచి ఎగుమతులు, దిగుమతులు అత్యధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో పారిశ్రామిక పురోగతి జరగలేదు. అందుకే ఇక్కడ యువత మోదీ పట్ల ఆకర్షితులవుతున్నారు. ‘ఎప్పుడైనా మార్పు మంచికే జరుగుతుంది. కొత్త తరం మోదీపైనే ఆశలు పెట్టుకున్నారు’ అని స్థానిక వ్యాపారులు అంటున్నారు. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వచ్చే వలసలు, వారిని అక్కున చేర్చుకోవడానికి తృణమూల్‌ అనుసరించే బుజ్జగింపు విధానాలు ఎంత మేర ప్రభావితం చూపిస్తాయో చూడాల్సిందే. తృణమూల్‌ తరపు నుంచి సిట్టింగ్‌ ఎంపీ మమతా బాల్‌ ఠాకూర్‌ పోటీ పడుతుంటే, అదే కుటుంబానికి చెందిన శాంతను ఠాకూర్‌ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు.

బ్యారక్‌పూర్‌లో కమల వికాసం ?
బ్యారక్‌పూర్‌లో ఇతర రాష్ట్రాలైన యూపీ, బీహార్‌ నుంచి వలస వచ్చిన ఓటర్లే ఎక్కువ. ఈ సారి ఎన్నికల్లో తృణమూల్‌ నుంచి పార్టీ ఫిరాయించి బీజేపీ గూటికి చేరిన అర్జున్‌ సింగ్‌ బరిలో ఉన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున ఒకప్పుడు రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన దినేశ్‌ త్రివేది పోటీ పడుతున్నారు. రాష్ట్రేతరులు ఎక్కువగా ఉండడం, పరిశ్రమలు మూతపడి ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి.
ఇక మిగిలిన నియోజకవర్గాలైన  హౌరా, ఉల్బేరియా, శ్రీరామ్‌పూర్, హుగ్లీ, ఆరంబాగ్‌లో మోదీపై దీదీ పైచేయి సాధించే అవకాశాలే కనిపిస్తున్నాయి.

ఓట్ల శాతం పెరుగుతుంది కానీ...
2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 17శాతం ఓటు షేరుతో 2 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ సారి ఓటింగ్‌ శాతం పెరగడం ఖాయం అన్న అంచనాలున్నాయి. అయిదు నుంచి ఏడు సీట్లు బీజేపీ గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో 15 సీట్లలో తృణమూల్‌కి గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. ఉత్తర బెంగాల్‌లో హోరాహోరీ పోరు నెలకొంది. ఇక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పశ్చిమ ప్రాంతాలు, బెంగాల్‌కు సరిహద్దు ప్రాంతాల్లో బీజేపీ తన పట్టు ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మొత్తం 42 నియోజకవర్గాలకు గాను 40 శాతం ఓటుషేర్‌తో 34 సీట్లలో నెగ్గి తన పవరేంటో చూపించిన మమతపై బెంగాల్‌ ప్రజలు ఎంత మమత కురిపిస్తారో చూడాల్సిందే మరి.

బెంగాలీలు త్వరగా మార్పుని ఆహ్వానించలేరు
బెంగాల్‌ ఓటర్లు  మార్పుని త్వరితగతిన కోరుకోరు. వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం జెండాలు, ఎజెండాలు మారుస్తారేమో కానీ, ఓటరు రాత్రికి రాత్రి పార్టీలను మార్చడు. పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టుల కంచుకోట బద్దలవడానికే మూడు దశాబ్దాలకుపైగానే పట్టింది. ఇందుకు టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ రేయింబగళ్లు కష్టపడాల్సి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కమ్యూనిజంతోనే సమాజంలో మార్పు వస్తుందన్న నమ్మకం బెంగాల్‌ మధ్యతరగతి ప్రజల్లో బలంగా ఉండేది. 1977లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక రాజకీయ, ఆర్థిక, ఎన్నికల ప్రణాళికకు సంబంధించి ఒక మోడల్‌ని సృష్టించారు. బెంగాల్‌ గ్రామాల్లో దున్నేవాడికే భూమిపై హక్కుల్ని కట్టబెట్టడంతో వ్యవసాయ రంగం పరుగులు పెట్టింది.

అయితే పారిశ్రామిక రంగంపై మాత్రం నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. పట్టణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో అసంఘటిత రంగాలనే సీపీఎం ప్రోత్సహించింది. చిల్లర వ్యాపారులు, వీధి వ్యాపారులు, దుకాణదారులు, వారి సహాయకులు ఇలా కార్మిక శక్తినే కామ్రేడ్లు నమ్ముకున్నారు. 1990ల్లో అసంఘటిత రంగాల్లో ఉద్యోగాల రేటు ఏడాదికి 12 శాతం వరకు వెళ్లింది. కర్షక, కార్మిక శక్తులు బలపడినా  ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆ రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించింది ఏమీ లేదు.  పారిశ్రామిక రంగ పురోగతి సాధించకపోవడం,  చిన్న కమతాలు కలిగిన రైతుల సంఖ్య పెరిగిపోవడం వల్ల పశ్చిమ బెంగాల్‌ మోడల్‌ ఒక విఫలప్రయోగంగానే మిగిలిపోయింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కూడా భారత్‌ జాతీయ సగటుకి చేరుకోలేకపోయింది.

దీంతో సీపీఎం తన దారి మార్చుకొని పారిశ్రామికీకరణను బలవంతంగా అమలు చేయడం మొదలు పెట్టింది. అదే తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమత దీదీ ఒక అస్త్రంలా మార్చుకొని పోరు బాట పట్టారు. సింగూర్‌ ఆందోళనలు జనంలో ఆమె ఇమేజ్‌ను పెంచాయి. ఫలితం బెంగాల్‌లో ఎర్రకోట బీటలు వారింది. 2011లో తొలిసారిగా అధికారం చేపట్టిన  దీదీ తనపైనున్న సింగూర్‌ ఇమేజ్‌ని చెరిపేసుకోలేక, కొత్త విధానాలు అమలు చెయ్యలేక కొంతకాలం సతమతమయ్యారు. ఆ తర్వాత మార్క్సిస్టుల బాటలో నడవక తప్పలేదు. బడా బడా పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచారు. ముఖేశ్‌ అంబానీ వంటి వారు ఆ రాష్ట్రాన్ని ‘వెస్ట్‌ బెంగాల్‌ ఈజ్‌ బెస్ట్‌ బెంగాల్‌’ అనేలా పారిశ్రామిక విధానాలు సరళతరం చేశారు.

ఎన్నికల మోడల్‌ సూపర్‌ హిట్‌
పరిపాలనలో చతికిలపడినా ఎన్నికల ప్రణాళికలో సీపీఎం అనుసరించిన విధానాలు సక్సెస్‌ అయ్యాయి. 1990లలో సీపీఎంకి కార్యకర్తల బలం ఎంత ఉందంటే, అప్పట్లో బెంగాల్‌లో ఓటర్ల సంఖ్య 4 కోట్లు ఉంటే, దాదాపుగా 20 లక్షల మంది సీపీఎం కార్యకర్తలే ఎన్నికల్లో పనిచేసేవారు. ఆ తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌ అంతకు అంత కార్యకర్తల అండదండ సంపాదించింది. అయితే ఇదంతా అధికార దర్పంతో, నియంతృత్వ విధానాలతోనే సాధించారు. రాష్ట్రంలో ఆరెస్సెస్‌ చాలా కాలంగా పనిచేస్తున్నప్పటికీ కమలనాథులు తృణమూల్‌ పార్టీ స్థాయిలో బలపడలేదు. కానీ మతపరమైన విభజన రేఖ గీయడంలో విజయం సాధించారు. అదే ఇప్పుడు ఎన్నికల్లో కీలక భూమిక పోషించబోతోంది.

ముస్లిం ఓటర్లే కీలకం
పశ్చిమ బెంగాల్‌ ఓటర్లలో 27శాతం ముస్లింలే. 28 లోక్‌సభ స్థానాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు. సీపీఎం ఓటు బ్యాంకు అటూ ఇటూ మళ్లిందేమో కానీ, ముస్లింలు మాత్రం దీదీ వైపే ఉన్నారు. ఆమె పాలనలోనే వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగారు ‘‘ముస్లింలు ఇప్పుడు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. టీఎంసీలో కూడా స్థానికంగా నాయకత్వం వహిస్తున్నారు’’ అని  ప్రశాంత చటోపాధ్యాయ అనే జర్నలిస్టు వ్యాఖ్యానించారు.

నదీ తీరంలో రాజకీయాలు ఏ మలుపు తిప్పుతాయి?
ఈ నెల 6న జరగనున్న అయిదో దశ పోలింగ్‌లో మొత్తం  ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో అయిదు హుగ్లీ నదికి చెరోవైపున విస్తరించి ఉన్నాయి. బన్‌గావ్, బ్యారక్‌పూర్, హౌరా, ఉల్బేరియా, శ్రీరామ్‌పూర్, హుగ్లీ, ఆరంబాగ్‌లలో పోలింగ్‌ జరగనుంది. వీటిలో ఉత్తర 24 పరగణా జిల్లాలకు సరిహద్దుగా ఉన్న బన్‌గావ్, బ్యారక్‌పూర్‌లలో మతపరమైన హింస చెలరేగిన చోట    బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నట్టుగా అంచనా.


మమతఠాకూర్, శాంతను ఠాకూర్, అర్జున్‌ సింగ్, దినేశ్‌ త్రివేది

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top