భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అండ

Muttamsetti Srinivasa Rao Fired on Pawan kalyan - Sakshi

ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు

మరో రెండు వారాల్లో ఇసుక కొరత తీరనుంది

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌

సాక్షి, విశాఖపట్నం:  భవన నిర్మాణ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, దయచేసి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. సోమవారం మేఘాలయ హోటల్‌ల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు నెలల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని పవన్‌కల్యాణ్‌కు మంత్రి ఈ సందర్భంగా    సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో ఉన్న 70 శాతం మందికి పైగా ప్రజలు పాలన బావుందంటే, లాంగ్‌మార్చ్‌లో   చెప్పిన విధంగా  పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలకు స్వస్తి పలికి సినిమాల్లోకి వెళిపోతారా? అని  ముత్తంశెట్టి  ప్రశ్నించారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక దళిత ఎమ్మెల్యేకు మీరిచ్చిన గౌరవమేమిటని ఆయన జనసేన అధినేతను ప్రశ్నించారు. పేరుకు భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్‌మార్చ్‌ పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.

గత ఐదేళ్లలో ఇసుకను దోచుకు తిన్న ఇసుక మాఫియా బ్రాండ్‌ అంబాసిడర్‌ అచ్చెన్నాయుడిని పక్కపెట్టుకుని మాట్లాడినప్పుడే ప్రజలు చీదరించుకున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా భవననిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఆలోచిస్తే మంచి సూచనలు చేస్తే   స్వీకరిస్తామని వ్యక్తిగత దూషణలకు దిగితే సహించబోమని అన్నారు. అగనంపూడి, ముడసర్లోవల్లో 2172 మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉందని, అందులో 57వేల టన్నులు డిస్పాచ్‌ చేయగా 5వేల టన్నుల స్టాక్‌ ఉన్నట్లు తెలిపారు. 2 వేల టన్నుల కొరత ఉందని మంత్రి అన్నారు. మరో రెండు వారాల్లో ఇసుక కొరత తీరనుందని ఆయన అన్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ వరద ఉద్ధృతి కారణంగా కొంతమేరకు ఇసుక కొరత ఏర్పడిందని, భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. గతేడాదితో పోల్చుకుంటే వర్షాలు ఎక్కువగా కురవడం కారణంగా నదుల్లో ఇసుక తీయడం కుదర్లేదని, మరో రెండు వారాల్లో నదుల ఉద్ధృతి తగ్గుతోందని ఇసుక కొరత తీరనుందని ఎంపీ అన్నారు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆంక్షల ద్వారానే అవినీతి జరగకూడదనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కొత్త ఇసుక పాలసీనీ తీసుకొచ్చారన్నారు. పరిమితి లోబడి 20 కిలోమీటర్లు లోపు వారు ఇసుక రవాణా చేసుకునే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌ వెనక ఎవరున్నారో చెప్పాలి
వీఎంఆర్డీఏ చైర్మన్‌  ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ  జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వెనక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విశాఖలో లాంగ్‌మార్చ్‌ పెట్టింది కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులపై వ్యక్తిగత దూషణలు చేయడానికే తప్ప భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సు కోసం కాదని తేటతెల్లమైందన్నారు. లాంగ్‌మార్చ్‌లో పవన్‌ మాటలు విన్న ప్రతి సామాన్యుడికి పవన్‌ వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నట్లు తేటతెల్లమవుతోందని అన్నారు. ప్రశాంతతకు మారు పేరైన విశాఖ నగరంలో లాంగ్‌మార్చ్‌ల పేరిట రచ్చచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాజ్యసభ సభ్యుడుగా విజయసాయిరెడ్డి పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నిసార్లు ఏపీ అభివృద్ధికి, సమస్యలపై మాట్లాడారో మీ ఢిల్లీ పెద్దలను అడిగి తెలుసుకో అని పవన్‌పై ఆయన విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత కొయ్యప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top