సరోగసీ బిల్లుకు ఓకే

Lok Sabha passes Surrogacy (Regulation) Bill - Sakshi

ఆమోదం తెలిపిన లోక్‌సభ

ఉభయ సభల్లో నిరసనలు

ఇరు సభలు వాయిదా

న్యూఢిల్లీ: రఫేల్‌ వివాదంపై రాజ్యసభ, లోక్‌సభల్లో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. సభా కార్యకలాపాలకు ఆటంకం జరిగింది. అయితే ఆందోళనల నడుమనే సరోగసీ (రెగ్యులేషన్‌) బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కావేరీ డ్యాం సమస్యపై డీఎంకే, అన్నా డీఎంకే సభ్యులు ఉభయ సభలను నినాదాలతో హోరెత్తించారు. రఫేల్‌ విమానాల కొనుగోలు వివాదంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్‌ గోయెల్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేత రఫేల్‌ వివాదంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలు కొనసాగడంతో ఉదయం11 గంటలకు ప్రారంభమైన రాజ్యసభ.. కొద్దిసేపటికే మరుసటి రోజుకు వాయిదా పడింది. సభ నడవడం ఎవరికీ ఇష్టం లేనట్లు ఉందంటూ చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. కాగా, లోక్‌సభలో మాత్రం సరోగసీ (రెగ్యులేషన్‌) బిల్లు ఆమోదం పొందింది. వినియోగదారు హక్కుల రక్షణ బిల్లుకు మాత్రం మోక్షం కలగలేదు. ఆందోళనలు తీవ్రతరం కావడంతో ఈ బిల్లుపై చర్చ సాధ్యం కాదని, దీనిపై గురువారం చర్చిస్తామని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పేర్కొన్నారు.

24, 26 తేదీల్లోనూ రాజ్యసభకు సెలవు
సభ్యుల వినతి మేరకు రాజ్యసభకు శనివారం(డిసెంబర్‌ 22) మొదలుకొని బుధవారం (డిసెంబర్‌ 26) వరకు సెలవు ప్రకటించారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని డిసెంబర్‌ 25న మాత్రమే సెలవు దినంగా నిర్ణయిస్తూ గతంలో ప్రకటన వెలువడింది.

సరోగసీ బిల్లు ముఖ్యాంశాలు
► 23–55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు, 26–55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పురుషులు మాత్రమే సరోగసీ(అద్దె గర్భం) కోసం దరఖాస్తు చేసుకోవాలి.
► వాణిజ్య అవసరాల కోసం సరోగసీ చేపట్టడాన్ని నిషేధించారు.
► ఎన్‌ఆర్‌ఐలు, విదేశీయులు, పీఐవోలు, హోమో సెక్సువల్స్, సింగిల్‌ పేరెంట్స్, సహ జీవనం చేసే జంటలు సరోగసీకి అనర్హులు.
► ఒకే సంతానం ఉన్న జంటలు సైతం సరోగసికి అర్హులు కారు. కానీ వీరు ఇతర చట్టాల ప్రకారం చిన్నారులను దత్తత తీసుకోవచ్చు.
► సమీప బంధువులు అంటే సోదరి లేదా మరదలు వంటివారినే సరోగసీ కోసం అనుమతిస్తారు.
► ఓ మహిళను సరోగసీ కోసం జీవితకాలంలో ఒకసారి మాత్రమే అనుమతిస్తారు.
► సరోగసికి ముందుకొచ్చే మహిళకు అప్పటికే వివాహమై, ఓ కుమారుడు/కుమార్తె ఉండాలి.
► ఈ చట్టం జమ్మూకశ్మీర్‌ తప్ప దేశమంతటా వర్తిస్తుంది.
► 3 నెలల్లోగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సరోగసీ బోర్డులను ఏర్పాటు చేస్తారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top