ఎంపీ టికెట్ల లొల్లి..!

Leaders Interested To Contest  MP Seats - Sakshi

టీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ సీటు వినోద్‌కుమార్‌కే

పెద్దపల్లి టికెట్‌పై తొలగని సందిగ్ధత

వివేక్‌కు అడ్డం పడుతున్న ఎమ్మెల్యేలు

కరీంనగర్‌ కాంగ్రెస్‌ సీటుపై ‘పొన్నం’ ధీమా

దరఖాస్తు చేసుకున్న పలువురు నాయకులు

పెద్దపల్లికి 32 మంది దరఖాస్తు

శాసనసభ ఎన్నికల్లో కలిసిరాని అదృష్టాన్ని పార్లమెంటు పోరులోనైనా దక్కించుకునేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని రెండు లోక్‌సభ సీట్లలో టికెట్ల కోసం కాంగ్రెస్, టీడీపీ ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెలాఖరులోగా వస్తుందని భావిస్తున్న తరుణంలో కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలో టీఆర్‌ఎస్‌ నుంచి ప్రస్తుత ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ బరిలో నిలవడంలో అనుమానం లేదు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2014లో ఎంపీగా గెలిచిన బాల్క సుమన్‌ శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఈ సీటు ఖాళీగా ఉంది. ఇక్కడినుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం ఎవరికి..? అనే విషయంలో స్పష్టత రావడం లేదు. కాంగ్రెస్‌లో ఈ రెండు సీట్లలో టికెట్ల కోసం నేతల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. కరీంనగర్‌కన్నా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్టు ఆశిస్తున్న వారి సంఖ్య 35కి చేరింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌ 2018 ఆఖరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వివేక్‌ పట్లనే కేసీఆర్‌ సానుకూల వైఖరితో ఉన్నారని అర్థమైంది. 2013లో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వివేక్, 2014 ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి సుమన్‌ చేతిలో ఓడిపోయారు. 2017లో వివేక్‌ తన సోదరుడు వినోద్‌తో కలిసి తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటినుంచే పెద్దపల్లి సీటు వివేక్‌కే అని టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిర్ణయించుకున్నారు. తదనుగుణంగానే చెన్నూరు నుంచి ఎంపీ సుమన్‌కు సీటిచ్చారనే ప్రచారం జరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న సంఘటనలు వివేక్‌కు ప్రతికూలంగా మారాయి. వివేక్‌ సోదరుడు వినోద్‌ కుమార్‌ బెల్లంపల్లి నుంచి బీఎస్పీ నుంచి పోటీచేయగా.. వివేక్‌ ఆయనకు అండగా నిలిచారు.

ఇక్కడ టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విజయం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. చిన్నయ్యతోపాటు పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని మిగతా ఆరుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఓటమికి వివేక్‌ వెన్నుపోటు రాజకీయాలు నడిపారని ఎమ్మెల్యేల ఆరోపణ. ఈ పరిస్థితుల్లో రామగుండం, మంథనిలో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీట్లు రెండు ఓడిపోగా.. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఓటమి అంచులనుంచి బయట పడ్డారు. ఈ పరిణామాలు రచ్చకెక్కగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ పెద్దపల్లి, మంచిర్యాల, చెన్నూరు, ధర్మపురి, బెల్లంపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతోపాటు ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన కోరుకంటి చందర్‌ సైతం వివేక్‌కు వ్యతిరేకంగానే ఉన్నారు. చెన్నూరులో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఫ్లెక్సీలో వివేక్‌ ఫొటో ఉన్నందుకు ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుమన్‌ వెళ్లలేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

వివేక్‌కు కాకపోతే ఎవరికి..?
పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని గెలిచిన, ఓడిన ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌ టికెట్టు వివేక్‌కు ఇవ్వకూడదని అధిష్టానానికి స్పష్టం చేయడంతో ఎంపీ సీటు సందిగ్ధంలో పడింది. ఆయనకాకుంటే ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీలో మేధావులుగా పేరున్న మల్లెపల్లి లక్ష్మయ్య, ఘంటా చక్రపాణిలలో ఒకరికి అవకాశం దక్కవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో చెన్నూరు టికెట్‌ను తనను కాదని సుమన్‌కు అవకాశం ఇచ్చారని, ఈసారి తనకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కోరుతున్నారు. అలాగే బెల్లంపల్లి సీటును ఆశించి భంగపడిన ఆర్‌.ప్రవీణ్‌కుమార్‌ సైతం టికెట్‌ రేసులో ఉన్నారు. 

కరీంనగర్‌ కాంగ్రెస్‌ టికెట్‌ పొన్నంకేనా..?
2009 నుంచి ఐదేళ్లు కరీంనగర్‌ ఎంపీగా కొనసాగిన పొన్నం ప్రభాకర్‌ 2014 ఎన్నికల్లో వినోద్‌కుమార్‌ చేతిలో ఓడిపోయారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే మళ్లీ లోక్‌సభకే పోటీ చేయాలని భావించిన పొన్నంను ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కరీంనగర్‌ అసెంబ్లీ నుంచి బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన లోక్‌సభ ఎన్నికల కోసం మళ్లీ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మాజీ ఎంపీగా ఆయనకే టికెట్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ టికెట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా కరీంనగర్‌ నుంచి కటకం మృత్యుంజయం, రేగులపాటి రమ్యారావు, ప్యాట రమేష్, ఆనంద్, నిఖిల్‌ చక్రవర్తి, జయశ్రీ తదితరులు ముందుకొచ్చారు. వీరిలో పొన్నంకే అవకాశం ఉందని పార్టీవర్గాలు అంటున్నాయి. హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరును ఇటీవల తెరపైకి తెచ్చినప్పటికీ, ఆయన దరఖాస్తు చేసుకోలేదని సమాచారం. 

పెద్దపల్లి నుంచి 32 మంది దరఖాస్తు
పెద్దపల్లి లోక్‌సభ సీటు కోసం కాంగ్రెస్‌ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. టికెట్‌ కోసం 32 మంది నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన గోమాస శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, జెడ్పీ మాజీ చైర్మన్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, గజ్జెల కాంతం, గుమ్మడి కుమారస్వామి తదితరులు వీరిలో ఉన్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇక్కడ టికెట్‌ విషయంలో కీలకం కానున్నారు. ఆయన గోమాస శ్రీనివాస్‌కు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top