కరీం'నగారా'

KCR Sentiment Election Start From Karimnagar - Sakshi

ఉద్యమమైనా.. మార్పునకైనా ఇక్కడే నాంది

ప్రముఖుల పురిటిగడ్డ.. అభ్యుదయ భావాల అడ్డా

‘నూలుపోగుల’ మేలి మెరుపుల ఖిల్లా

టీఆర్‌ఎస్‌కు ఇది సెంటిమెంట్‌ సీటు..

పాత ప్రత్యర్థుల మధ్యే తాజా పోటీ!

దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాని ఖాతాను తెరిచి, తెలుగుబిడ్డకు ఆ పదవిని ఆర్జించి పెట్టిన జిల్లా. పీవీ నరసింహారావు మొదలుకొని, సినారె వరకూ ప్రముఖులెందరినో కన్నగడ్డ. అగ్గిపెట్టెలో ఇమిడే చీరనేసి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసిన నేతన్నల పురిటిగడ్డ. ఉద్యమాల ఖిల్లా కరీంనగర్‌ జిల్లా. తెలంగాణ రాజకీయ ప్రస్థానంలోనూ ప్రతిసారీ సరికొత్త మార్పులకు తార్కాణంగా నిలుస్తూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తోంది. ఉత్తర తెలంగాణ ఎన్నికల ఫలితాలను కరీంనగర్‌ జిల్లా సెగ్మెంట్‌లో వచ్చే ఫలితం ప్రతిబింబిస్తుందని జనం విశ్వసిస్తారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారీ ఇక్కడ ముక్కోణపు పోటీ ఉండబోతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. హన్మకొండ స్థానం నుంచి 2004లోనూ, ఆ తర్వాత 2008లోనూ జరిగిన ఉపఎన్నికల్లో వినోద్‌కుమార్‌ గెలుపొందారు. 2009లో పొన్నం ప్రభాకర్‌ చేతిలో వినోద్‌ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గం రద్దు కావడంతో 2014లో కరీంనగర్‌ సీటుకి మారారు. 2014లో కరీంనగర్‌ లోక్‌సభకు టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధికంగా 2,04652 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌పై ఘన విజయం సాధించారు.

ఐదేళ్లలో మూడుసార్లు కేసీఆర్‌...
మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా మారిన కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారిగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 2004లో ఎన్నికయ్యారు. ఈ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో టీఆర్‌ఎస్‌ సీట్ల సర్దుబాటు చేసుకుంది. 1998, 1999 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్ర మంత్రిగా కూడా ఉన్న చెన్నమనేని విద్యాసాగరరావుపై 2004లో కేసీఆర్‌ విజయం సాధించారు. అటు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో, ఇటు రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్‌లో టీఆర్‌ఎస్‌ భాగస్వామి అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 2006లో టీఆర్‌ఎస్‌ బయటకు వచ్చిన సందర్భంగా కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి కూడా కేసీఆర్‌ రాజీనామా చేశారు. కేసీఆర్‌ రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డిపై 2,01582 ఓట్ల మెజారిటీతో కేసీఆర్‌ మళ్లీ గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2008లో మరోసారి రాజీనామా చేసిన కేసీఆర్‌ మళ్లీ జీవన్‌రెడ్డిపైనే పోటీచేసి 15,765 ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు.

ఏడు సెగ్మెంట్లు..
కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కరీంనగర్, చొప్పదండి (ఎస్సీ), సిరిసిల్ల, మానకొండూరు (ఎస్సీ), హుజూరాబాద్, హుస్నాబాద్, వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో వేములవాడలోనే బీజేపీకి మెజారిటీ వచ్చింది. మిగతా అన్ని శాసనసభాస్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే మెజారిటీ వచ్చింది.

అన్ని అసెంబ్లీ సీట్లూ టీఆర్‌ఎస్‌వే..
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుపొందారు. ఈ నియోజకవర్గంలోని మొత్తం పోలైన 15.4 లక్షల ఓట్లలో 6.92 లక్షల ఓట్లు టీఆర్‌ఎస్‌కు వచ్చాయి. కాంగ్రెస్‌కు 3.45 లక్షల ఓట్లే వచ్చాయి. బీజేపీకి లక్ష ఓట్లే పోలయ్యాయి. కరీంనగర్‌ అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ 66 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ మూడో స్థానానికి పరిమితమయ్యారు. హుస్నాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ప్రజాఫ్రంట్‌ అభ్యర్థిగా పోటీచేసిన సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వొడితెల సతీష్‌కుమార్‌కు 60 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు పెద్దసంఖ్యలో సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా గెలుపొందారు.

సారు.. సెంటిమెంటు!
రాజకీయ పార్టీల ముఖ్యనేతలతో పాటు కొందరు ముఖ్యమంత్రులకు కొన్ని ప్రత్యేక సెంటిమెంట్లు, నమ్మకాలు ఉంటుంటాయి. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ ప్రజా ప్రస్థానం మహా పాదయాత్ర మొదలుకుని, ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించేవారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కూడా కరీంనగర్‌ అంటే అంతే గురి. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ›ప్రచార శంఖారావాన్ని కూడా ఆయన ఈ నెల 17న అక్కడి నుంచే పూరించనున్నారు. 2001లో డిప్యూ టీ స్పీకర్‌ పదవికి కేసీఆర్‌ రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టాక మొదటి ‘సింహగర్జన’ బహిరంగసభ కరీంనగర్‌లోనే నిర్వహించారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీ స్థానానికి కేసీఆర్‌ పోటీచేయడమే కాకుండా, అక్కడి నుంచే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 2014లో సీఎం అయ్యాక ఆయన తొలి అధికారిక పర్యటనకు కరీంనగరే వేదికైంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘రైతుబంధు’ పథకాన్ని కూడా గతేడాది కేసీఆర్‌ కరీంనగర్‌ నుంచే మొదలుపెట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీదళం విజయం సాధించడంలో ఈ పథకం కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

51 శాతానికి పైగా ఓట్లు..
2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ మిత్రపక్షంగా టీఆర్‌ఎస్‌ పోటీచేసినప్పుడు ఈ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పోటీ చేసి 51.59 శాతం ఓట్లు సాధించారు. బీజేపీ 36.6 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ విడివిడిగా పోటీచేయగా కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు 32.14 శాతం ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు 27 శాతం ఓట్లు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వినోద్‌కుమార్‌కు 44.85 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నంకు 26.88 శాతం, బీజేపీ అభ్యర్థి సి.హెచ్‌.విద్యాసాగర్‌ రావుకు 19.15 శాతం ఓట్లు వచ్చాయి.

ఈసారి బరిలో ఎవరు?
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పోటీచేయడం దాదాపు ఖరారైనట్టే. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పోటీచేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టుగా చెబుతున్నారు. బీజేపీ తరపున బండి సంజయ్‌కుమార్‌ పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ బలీయంగా ఉండటంతో లోక్‌సభ ఎన్నికల్లో ఏయే రాజకీయ అంశాలు ప్రభావితం చూపుతాయన్నది ప్రధానంగా మారింది. గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన నేపథ్యంలో ఈసారి వినోద్‌కి అంత స్థాయిలో మెజారిటీ వస్తుందా లేక ఈ స్థానంలో అనూహ్య ఫలితాలేవైనా వచ్చేందుకు అవకాశం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది.

1952: తొలి విజేత బద్దం ఎల్లారెడ్డి
1952లో కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడ్డాక 1962 వరకు ద్విసభ్య స్థానంగా కొనసాగింది. 1952లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో ప్రముఖ కమ్యూనిస్టు నేత బద్దం ఎల్లారెడ్డి ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) అభ్యర్థిగా విజయం సాధించారు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం నేపథ్యంలో ఆయన పీడీఎఫ్‌ టికెట్‌పై పోటీచేశారు.
మళ్లీ ఇప్పటివరకు ఆ స్థానం నుంచి కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులెవరూ గెలుపొందలేదు. అయితే ఈ నియోజకవర్గం పరిధిలోని సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ అగ్రనేత చెన్నమనేని రాజేశ్వరరావు, మరో స్థానం నుంచి సీపీఐ (ఎంఎల్‌) అభ్యర్థిగా ఎన్‌.వి.కృష్ణయ్య గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కరీంనగర్‌ జిల్లాలోని ఇందుర్తి నియోజకవర్గం నుంచి దేశిని చినమల్లయ్య పలుమార్లు, ఆ తర్వాత చాడ వెంకటరెడ్డి గెలుపొందారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top