మాటే మంత్రము..

KCR Impressive Speech In Election Campaign - Sakshi

ప్రచారంలో పంచ్‌లతో ఆకట్టుకున్న సీఎం కేసీఆర్‌ 

మాటల తూటాలు పేల్చిన కేటీఆర్, హరీశ్, కవిత 

బీజేపీ కేడర్‌లో జోష్‌ నింపిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ 

పదునైన మాటలు విసరడంలో వెనకబడ్డ కాంగ్రెస్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల వేళ ఆకట్టుకునే మాటకు ప్రభావం ఎక్కువ. ఇది గత శాసనసభ ఎన్నికల్లో స్పష్టమైంది. కాంగ్రెస్‌ ఎన్ని హామీలు గుప్పించినా, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాట ముందు నిలవలేకపోయాయి. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ మళ్లీ మాటే జనాన్ని బాగా ఆకట్టుకుంది. ఓట్ల రూపంలో దాని ప్రభావం ఎలా ఉండబోతోందో ఇంకా స్పష్టం కానప్పటికీ, సభలకు జనం రావడం, నలుగురు కలసిన చోట ఆ మాట నానడాన్ని పరిశీలిస్తే మాటకారి ప్రచారానికి జనం మంత్రముగ్ధులయ్యారనే చెప్పాలి. అదే పంచ్‌ లేని మాటలకు చప్పట్లు రాలలేదు సరికదా, జనం రావటానికే ఇష్టపడలేదు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఇది స్పష్టంగా కనిపించింది.
 
కేసీఆరే టాప్‌.. 
మాటను బలంగా, బాణంలా తగిలేలా విసరడంలో కేసీఆరే టాప్‌. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో ఆయనతో సాటివచ్చే మరో మాటల మాంత్రికుడు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌.. కేసీఆర్‌ మాటమీదనే ప్రధానంగా ఆధారపడి నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు కచ్చితంగా ఓడిపోతారన్న అభిప్రాయం వ్యక్తమైనా, ఆయా చోట్ల కేసీఆర్‌ ప్రచారం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ప్రత్యర్థులను మాటతో పడగొట్టే కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ దానికి మరింత పదును పెట్టారు. పూర్తి తెలంగాణ మాండలికం, అందునా స్థానికంగా ప్రాచుర్యంలో ఉండే పదాలు, మధ్యమధ్య పిట్ట కథలు, ఛలోక్తులతో రంజింపచేసి ప్రజలను కట్టిపడేయగలరు. సరిగ్గా పక్షం రోజుల క్రితం ఆయన నిజామాబాద్‌ ఎన్నికల ప్రచార సభకు వెళ్లటానికి ఒక్కరోజు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విసిరిన సవాలు.. కేసీఆర్‌కు ప్రధాన ప్రచారాయుధంగా మారింది.

తరచూ యాగాలు చేసే కేసీఆర్‌కు అయోధ్య విషయంలో ఉన్న స్టాండ్‌ ఏమిటంటూ ప్రశ్నించిన లక్ష్మణ్, కేసీఆర్‌కు పెద్ద ప్రచారాస్త్రాన్ని ఇచ్చేశారు. నిజామాబాద్‌ సభతో మొదలు ఆ తర్వాత జరిగిన ఒకటి రెండు మినహా మిగతా అన్ని సభల్లో దాన్ని ప్రస్తావించి ముఖ్యమంత్రి పంచ్‌లు విసిరారు. హిందువుల పేరుతో బీజేపీ పెట్టే ఈ లంగా పంచాయితీ ఏంది?, మతాలు వేరైతే రక్తం ఎర్రగా ఉండకపోతదా, గిచ్చితే నొప్పి పెట్టకపోతదా, ఏం మనం హిందువులం కాదా, భక్తి లేదా, ముహూర్తాలు పెట్టుకుని పెండ్లిళ్లు చేసుకుంటలేమా లాంటి మాటలతో జనాన్ని ఆకట్టుకున్నారు. ఇక నేరుగా ప్రధాని మోదీపై మాటల తూటాలు పేల్చారు. ‘జనం గోడు పట్టించుకోమంటే కేసీఆర్‌ ముక్కు పెద్దగున్నది, ఆయన జ్యోతిష్యం నమ్ముతడు అంటడు. ఇట్లాంటి చిల్లరమల్లర ప్రధానిని నేను జిందగీల చూడలే’ అంటూ రెచ్చిపోయారు. ఇక సర్జికల్‌ స్ట్రైక్‌ విషయంలో పేల్చిన మాటలకు లెక్కేలేదు.  

కారు.. సారు... పదహారు..  
ఈ ఎన్నికల్లో బాగా వినిపించిన డైలాగ్‌ ‘కారు... సారు... పదహారు’. హైదరాబాద్‌ మినహా మిగతా 16 స్థానాలు టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని, ఢిల్లీలో కేసీఆర్‌ చక్రం తిప్పుతారంటూ మొదటి ప్రచార సభలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్న మాట ఆ పార్టీ కార్యకర్తలకు “తారక’మంత్రమే అయింది. ఏ సభలో విన్నా ఇదే డైలాగ్‌. ఎన్నికల ప్రచారం ఆసాంతం బాగా పేలి జనాన్ని ఆకట్టుకుంది. వాట్సాప్‌ మెసేజ్‌ల్లో, వాట్సాప్‌ స్టేటస్‌ పేజీగా ఇది చెలరేగిపోయింది. ఈసారి మెదక్‌ జిల్లాకే పరిమితమైన టీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు కూడా తనదైన శైలిలో మాటలతో ఆకట్టుకోగలిగారు. మంచి మాటకారితనం ఉన్న హరీశ్‌ ప్రతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రధాన బలంగా వస్తున్న సంగతి తెలిసిందే. పూర్వపు మెదక్‌ జిల్లా పరిధిలో తన మాటలతో ఆకట్టుకున్నారు. నిజామాబాద్‌లో పార్టీ అభ్యర్థి కవిత కూడా మాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఫైర్‌బ్రాండ్‌ రాజాసింగ్‌...
ప్రధాని మోదీ తనదైన శైలిలో మాటలతో ఆకట్టుకునే శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీలో అలాంటి నేతలు ఎంతో మంది ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఆ పార్టీ నేతలకు పదునైన మాటలు పేల్చే శక్తి అంతంతమాత్రమే. కానీ ఈసారి ఆపార్టీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆ లోటు భర్తీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో కాకుండా విడిగా లోక్‌సభ ఎన్నికలు రావటం ఆయనకు కలసి వచ్చింది. జంటనగరాలు తప్ప దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేసి పదునైన మాటలతో ఆకట్టుకున్నారు. హిందుత్వ అంశంలో కేసీఆర్‌ బీజేపీపై చేసిన కామెంట్లకు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ దెబ్బకు కేసీఆర్‌ తాను హిందువునని చెప్పుకోవాల్సి వచ్చింది, ఇన్నిసార్లు హిందుత్వ గురించి మాట్లాడుతున్న కేసీఆర్‌కు తన మతం విషయంలో ఏదైనా డౌటా?, అసదుద్దీన్‌తో సావాసం చేస్తే ఇలాగే ఉంటుంది, పాకిస్తానీయులు మనదేశంవైపు చూస్తే కనుగుడ్లు పీకే ప్రధాని మనకున్నడు’ లాంటి మాటలతో పార్టీ కేడర్‌లో జోష్‌ నింపారు.

పేలని తూటాలు...
కాంగ్రెస్‌ పార్టీలో ఈసారి తూటాల్లాంటి మాటలు పెద్దగా ప్రచారంలో వినిపించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి పలు నియోజకవర్గాల్లో తిరిగి మాటలను పేల్చినప్పటికీ, ఈసారి ఆయన మల్కాజిగిరి నియోజకవర్గంలో పోటీలో ఉండటంతో వేరేచోట్లకు ప్రచారానికి వెళ్లలేదు. ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి ప్రభావం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అంతగా కనిపించలేదు. ఒకసారి రాహుల్‌గాంధీ వచ్చి వెళ్లినా... జనంలో నానే పంచ్‌లు విసరలేకపోయారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top