ప్రజాపాలన అందిస్తాం

KCR has no right to seek Muslim votes, says N Uttam Kumar Reddy - Sakshi

ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తాం

ప్రచార రథాల ప్రారంభోత్సవంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజాపాలన ఉంటుందనుకుంటే నియంతృత్వ పాలన సాగిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అందిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఈ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి పటాన్‌చెరు నియోజకవర్గంలో రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు జె.రాములు నేతృత్వంలోని ప్రచార రథాలను ఉత్తమ్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. అన్ని వర్గాలు ఉద్యమాలు, పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఇంతకాలం నియంత పాలన చూశారన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రజలకు దూరంగా, ప్రగతి భవన్‌ పేరుతో వందల కోట్ల రూపాయలతో గడీ నిర్మించుకుని బతుకుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజలకు కలవడానికి అవకాశం ఇవ్వకుండా, సచివాలయానికి రాకుండా ప్రజల సమస్యలు తీర్చకుండా ఒక నియంతలా మారారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌లో విలాసాలు చేస్తుంటే ఎమ్మెల్యేలు ప్రజలపైన దౌర్జన్యాలకు పాల్పడ్డారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను అడ్రస్‌ లేకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.  

 స్వేచ్ఛ లేకుండా పోయింది  
దేశంలో మత స్వేచ్ఛ లేకుండా పోయిం దని ఉత్తమ్‌ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వేచ్ఛ లేకుండా చేశారని, ఆయన మరోసారి ప్రధాని అయితే ప్రజల్ని బతకనివ్వరని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ మోదీకి చెంచా అని, కేసీఆర్‌కు ఓటు వేస్తే మోదీకి వేసినట్లే అని అన్నారు. బాగ్‌ అంబర్‌పేట్‌లోని తెలంగాణ జమియత్‌ ఉలేమా–ఎ–హింద్‌ సంస్థ కార్యాలయానికి వచ్చిన ఆయన ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని కోరారు.

సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు ఫీర్‌ షబ్బీర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వస్తే ముస్లింలకు అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వ్యవహారాల్లో కాంగ్రెస్‌ జోక్యం చేసుకోదని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు ఫీర్‌ ఖలీఫ్‌ అహ్మద్, సాబేర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top