టీడీపీ నేతలకు భయం పట్టుకుంది: కన్నబాబు

Janasena Chief Pawan Kalyan never abides by his words, says Kannababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన వైఖరి చెప్పారని వ్యవసాయ శాఖ మంత్రి క‍న్నబాబు తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘రాజధాని విషయంలో మసిపూసి మారేడుకాయ చేయాల్సిన అవసరం లేనది ముఖ్యమంత్రి అభిప్రాయం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సీఎం స్పష్టం చేశారు. వికేంద్రీకరణ జరిగితే తప్పేంటి? వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని సీఎం జగన్‌ ఉద‍్దేశం. గత అయిదేళ‍్లలో విభజన చట్టంలోని హామీలను సాధించుకోలేకపోయాం. హైకోర్టు ఒకచోట... రాజధాని మరోచోట ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో అయితే హైకోర్టు అలహాబాద్‌ (ప్రయోగరాజ్‌)లో ఉంది.  

టీడీపీ వారికి బాధ ఉంది. వాళ్ల ఆస్తులు, భూములు పోతాయని భయంగా ఉంది. గత అయిదేళ్లలో ఏ జిల్లాకైనా చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్‌ తెచ్చారా?. వాటన్నింటినీ సరిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌కు అవగాహన లేదు. కర్నూలు వెళ్లి ఆయన ఏమి మాట్లాడారు. మనసుకి ఒక రాజధాని...మనిషికి ఒక రాజధాని ఉంటుందా? అలజడి ఎందుకు వస్తుంది. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా? అదే గతంలో పవన్‌ కల్యాణ్‌ రాజధాని కోసం ఇన్ని భూములు తీసుకుంటారా అని అన్నారు. ఇప్పుడు వారి వెనుక ఉంటాను అంటున్నారు. పవన్‌ ఆలోచనలు స్థిరంగా ఉండవు. చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే ఆయన వాయిస్‌ మారింది’ అని మండిపడ్డారు. 

గ్రామల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, వాటి ద్వారానే విత్తనాలు సరఫరా చేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో అగ్రి ఇన్‌పుట్‌ షాపులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో నెలాఖరు వరకూ రైతు భరోసాకు అవకాశం కల్పిస్తామన్నారు. భూసార పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని, రైతులకు కల్తీలేని ఎరువులు, పురుగుల మందులు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో పంటల బీమ, పశువుల బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. అలాగే నాణ్యమైన పశువుల దాణా కూడా అందిస్తామని, ఇక ఆక్వా ఫీడ్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

చదవండిఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top