రేవంత్‌ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి: రజత్‌ కుమార్‌

High Court Furious On Telangana Govt Over Revanth Reddy Arrest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పోలీసులు అదుపులో ఉన్న టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని  రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డిని ఆదేశించారు. మంగళవారం కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బహిరంగ సభ దృష్య్టా రేవంత్‌ నిరసనలకు పిలుపునిచ్చినారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా.. పోలీసులు ముందుస్తుగా మంగళవారం తెల్లవారుజామున ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ అరెస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన తెలపడం.. ఆయన అభిమానులు కొంత మంది ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో దిగివచ్చిన అధికారులు వెంటనే విడుదల చేయాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు.

రేవంత్‌ అరెస్ట్‌పై హైకోర్ట్‌ సీరియస్‌..
రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఆచూకీ కోసం దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. ఎక్కడ ఉన్నారో వివరాలు ఇవ్వాలంటూ వికారాబాద్‌ ఎస్పీని ఆదేశించింది. ఏ ఆధారాలతో రేవంత్‌ను అరెస్ట్‌ చేశారని ప్రశ్నించింది. దీనికి అల్లర్లు జరగవచ్చనే ఇంటలిజెన్స్‌ నివేదికతోనే రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నామని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సమాధానమిచ్చారు. దీంతో నివేదిక కాపీని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
న్యూఢిల్లీ : రేవంత్ రెడ్డి అరెస్టుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌నేత కపిల్‌ సిబల్‌ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌ను అక్రమంగా తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేశారని  ఎందుకు అరెస్ట్ చేశారో కూడా పోలీసులు చెప్పలేదన్నారు. ఎన్నికల వేళ భయాందోళనకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎన్నికల ప్రచారంలో అమిత్ షా చేసిన ప్రసంగంపై కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగానికి నోటీసులు ఇవ్వాలని, ఎన్నికలు ఉన్న చోట బీజేపీ అధికార దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top