కళ్లు మూస్తే కారు.. తెరిస్తే కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

కళ్లు మూస్తే కారు.. తెరిస్తే కేసీఆర్‌

Published Wed, Apr 10 2019 1:23 AM

Harish Rao Comments On BJP And Congress - Sakshi

మెదక్‌ మున్సిపాలిటీ: కళ్లు మూస్తే కారు.. తెరిస్తే కేసీఆర్‌.. ఇంటి ముందు జరిగిన అభివృద్ధి.. కంటి ముందు అభ్యర్థిని చూసి ఓటేసి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు మంగళవారం ఆయన మెదక్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నర్సాపూర్‌లో రోడ్‌ షో, మెదక్‌ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. రెండ్రోజులు మీరు కష్టపడితే.. వచ్చే ఐదేళ్లు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు సీట్లు ఇస్తామన్నా పోటీచేసే నాయకులే లేరని ఎద్దేవా చేశారు.

ఆ పార్టీలకు ఓట్లు వేస్తే మోరీలో వేసినట్లేనని వ్యాఖ్యా నించారు. డిపాజిట్లు రాని పార్టీలకు ఓట్లు వేసి వృథా చేసుకోవద్దని సూచించారు. ఎన్నికలు కాకముందే కాంగ్రెస్, బీజేపీలు చేతులెత్తేశాయని ఎద్దేవా చేశారు. మండలాల్లో సైతం ప్రచారం చేయలేకపోయారని, జాతీయ స్థాయి నాయకులు ప్రచారానికి రాలేదని పేర్కొన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మాటలు మాత్రమే చెప్పాయని, టీఆర్‌ఎస్‌ చేతల్లో చేసి చూపించిందని తెలిపారు. ఆ పార్టీల పోరాటం డిపాజిట్ల కోసమైతే.. మా ఆరాటం భారీ మెజార్టీ కోసమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు 24 గంటల కరెంట్‌ ఇస్తోందని, మే నుంచి వృద్ధాప్య, వితంతులకు పెరిగిన పింఛన్లు ఇస్తామని తెలిపారు.

కొత్త పీఎఫ్‌ కార్డు ఉన్న బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తామన్నారు. దేశం దశ దిశ ఓటర్ల చేతుల్లోనే ఉందని, ఓటింగ్‌ శాతం పెంచేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మెదక్‌ లోక్‌సభ ఫలితాలు చరిత్రను తిరగరాయబోతున్నాయని, ఇక్కడి నుంచి కొత్త ప్రభాకర్‌ రెడ్డి రికార్డు మెజార్టీతో లోక్‌సభలో అడుగు పెడతారని జోస్యం చెప్పారు. హరీశ్‌రావు వెంట ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement