మాకు పట్టిన శని కాంగ్రెస్‌కు తగులుకుంది: జీవీఎల్‌

GVL Narasimha Rao Fires On TRS And TDP In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌, టీడీపీలపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహా రావు తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా గడువు ఉన్నా ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లారో కేసీఆర్‌ ఇంకా సమాధానం చెప్పలేదని సూటిగా అడిగారు. 2019లో అయితే ఓడిపోతారని భయమా? ఇప్పుడైతేనే గెలుస్తామని ధీమానా? సమాధానం చెప్పడానికి జంకు ఎందుకని ప్రశ్నించారు.

‘తెలంగాణ విషయంలో మొదటి నుంచి ఒకే పంథాలో ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే. కాంగ్రెస్‌ తెలంగాణాను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణ తీసుకు వచ్చిందన్న కారణంతో 2014 ఎన్నికలు, హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు విజయం కట్టబెట్టారు..కానీ కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్‌..17 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. దళితుడిని సీఎం చేస్తానన్నారు. ఏమైంది..కేసీఆర్‌ కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు వచ్చా’యని జీవీఎల్‌ వ్యాక్యానించారు.

ఇంకా మాట్లాడుతూ..‘ టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో మీరు మళ్లీ  చదివితే..ఇంటింటికీ తిరిగి కేసీఆర్‌ క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. ఓటు అడిగే ప్రతిసారి..నన్ను, నా పార్టీని, కుటుంబాన్ని క్షమించండని అడగాల్సి వస్తుంది. బంగారు తెలంగాణ మీ కుటుంబానికి మాత్రమే పరిమితం. సగం జనాభా ఉన్న మహిళలకు మంత్రివర్గంలో స్థానం లేదు. కేంద్ర పథకాలకు మీ పేరు పెట్టి డబ్బా కొట్టుకుంటున్నారు. మిషన్‌ భగీరథ నీళ్లు ఇవ్వకుండా ఓట్లు అడుగుతున్నారు. అప్పుల్లో మీరు నెంబర్‌ వన్‌..మీకు(కేసీఆర్‌), చంద్రబాబుకు రేసు నడుస్తున్నట్లు ఉంది. అప్పుల్లో అవినీతిలో కేసీఆర్‌, చంద్రబాబు పోటీపడుతున్నారు. కేవలం కుటుంబాలకు ఎలా న్యాయం చేసుకోవాలో మాత్రమే చూపించారు. అవినీతిలో ఏపీ, తెలంగాణ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయ’ని తీవ్రంగా విమర్శించారు.

‘ కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా కనుమరుగుతోంది. ఉనికి కోసం చిన్నచితకా పార్టీలను కలుపుకుని పోతోంది. టీడీపీని వదిలించుకున్నాము. 2014లో తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నాం. మాకు పట్టుకున్న శని(టీడీపీ) వదిలి ఇప్పుడు కాంగ్రెస్‌కు తగులుకుంది. కాంగ్రెస్‌, టీడీపీ రెండూ అవినీతి పార్టీలే. రాహుల్‌ గాంధీలో బాబు, లోకేష్‌ను చూసుకుంటున్నాడు. కాంగ్రెస్‌ కూటమి తెలంగాణ ద్రోహుల కూటమి. అభివృద్ధి మీద బీజేపీ నిబద్ధత కలిగిన పార్టీ. మోదీ పేరుతో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తే బీజేపీ స్వీప్‌ చేస్తుందని భయపడి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నార’ ని జీవీఎల్‌ తూర్పారబట్టారు.

‘ త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఎలా అధికారంలోకి వచ్చామో..ఇక్కడ కూడా అదే రీతిలో వస్తామనే నమ్మకం ఉంది. నల్లధనం వెలికితీత ద్వారా కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామని ఎక్కడన్నా మోదీ అంటే చూపాలి..రాహుల్‌ లాగా కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ వల్ల బీజేపీ నష్టపోయింది. ఆంధ్రాలో బీజేపీ వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అవినీతిలో కూరుకుపోయింది. సైకిల్‌కి తుప్పు పట్టింది. హైదరాబాద్‌ నుంచి అమరావతికి  బాబు ఎందుకు పారిపోయాడు..ఓటుకు నోటు కేసులో ఏదో అయిపోతుందనే కదా?. అమరావతిలో ఒలంపిక్స్‌ నిర్వహిస్తానన్నాడు. మాటలకు చేతలకు ఏదైనా పొంతన ఉందా. పార్లమెంటులో ఆంధ్ర, తెలంగాణ మధ్య గొడవ సృష్టించి అక్కడ ఆంధ్రాలో, ఇక్కడ తెలంగాణాలో రాజకీయంగా లబ్ది పొందాలని బాబు ప్రయత్నం చేశాడ’ని జీవీఎల్‌ ఆరోపించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top