మండలి భేటీ తర్వాతే ప్రచారం!

Election Campaign After Mandali Meeting Said By KCR - Sakshi

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయం

సిద్ధమవుతున్న ప్రచార ప్రణాళిక

పర్యటన షెడ్యూల్‌పై కసరత్తు..

కేసీఆర్‌ కోసం అభ్యర్థుల ఎదురుచూపులు

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచార ప్రణాళికపై అస్పష్టత కొనసాగుతోంది. పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రచారం ఎప్పటి నుంచి మొదలవుతుందనేది ఇంకా ఖరారు కాలేదు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారుపై కసరత్తు ఇంకా సాగుతోంది. ఈ నెల 27న శాసనమండలి సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఇవి పూర్తయిన తర్వాతే ప్రచారం మొదలుపెట్టాలని కేసీఆర్‌ నిర్ణయించారు. మండలి సమావేశాలతోపాటు... ప్రతిపక్ష పార్టీలు కలసి ఏర్పడే మహా కూటమిపై స్పష్టత వచ్చాకే టీఆర్‌ఎస్‌ అధినేత వరుస బహిరంగ సభల నిర్వహణ ఉంటుందని తెలిసింది. సెప్టెంబర్‌ 7న హుస్నాబాద్‌లో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

50 రోజుల్లో 100 బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు అప్పుడు ప్రకటించారు. దీనికి అనుగుణంగా ప్రచార షెడ్యూల్‌ రూపకల్పనపై టీఆర్‌ఎస్‌ అధినేత కసరత్తు పూర్తి చేస్తున్నారు. పెండింగ్‌లో పెట్టిన 14 స్థానాలకు సైతం అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాతే ప్రచార కార్యక్రమం మొదలవుతుందని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు మాత్రం కేసీఆర్‌ తమ నియోజకవర్గాల్లో సభ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. వ్యక్తిగతంగా ప్రచారం కొనసాగిస్తున్నా.. కేసీఆర్‌ పర్యటనతో ఎన్నికల ప్రచారంలో ఊపు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కేసీఆర్‌ సభ తమ నియోజకవర్గంలో జరిగితే కొద్దిపాటి వ్యతిరేకత ఏదైనా ఉంటే అది అనుకూలంగా మారుతుందని ఆశిస్తున్నారు. 

అభ్యర్థులకు ప్రచార సామగ్రి పంపిణీ... 
ప్రచార పర్వంలో టీఆర్‌ఎస్‌ మరో ముందడుగు వేసింది. 105 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు సోమవారం ప్రచార సామాగ్రిని అందజేసింది. కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి శేరి సుభాశ్‌రెడ్డి పర్యవేక్షణలో సామగ్రి పంపిణీ జరిగింది. దీంతో అభ్యర్థుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఇదే ఉత్సాహంతో అభ్యర్థుల ప్రచారం ఊపందుకోనుంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఖరారు కాకముందే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు.

మండలి భేటీ ఒక్క రోజే!.. 
శాసనమండలి సమావేశాలు ఒక్కరోజే నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అనివార్యమైతే 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కీలక అంశాలు చర్చ ఉండదు. ఎక్కువ రోజులు సభలు నిర్వహించి చర్చించాల్సిన అంశాలు లేనందున ఒక్క రోజుకే ముగించే అవకాశం ఉందని తెలిసింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు సైతం రాజకీయ కార్యక్రమాల నిర్వహణలో నిమగ్నమవుతున్నాయి. దీంతో మండలి సమావేశాలు ప్రాధాన్యత అంశంగా ఉండే అవకాశం లేదు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. శాసనసభ, మండలి సమావేశాలు చివరిసారిగా మార్చి 29న జరిగాయి.

శాసనసభ రద్దయిన నేపథ్యంలో శాశ్వత సభగా ఉండే మండలి సమావేశాల నిర్వహణ అనివార్యమైంది. సెప్టెంబర్‌ 27న మండలి సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు భేటీ మొదలవుతుందని పేర్కొన్నారు. ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒక్క రోజుతోనే సభ ముగించాలని నిర్ణయించారు. ఉదయం బీఏసీ నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మండలి సమావేశాల నిర్వహణ అరుదైన అంశంగా చోటు చేసుకోనుంది. శాసనసభ లేకుండా మండలి సమావేశాలను నిర్వహించడం ఆంధ్రప్రదేశ్‌లోగానీ, తెలంగాణనూ గతంలో ఎప్పుడూ జరుగలేదు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top