
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు ఆంధ్రా పోలీసులను వద్దనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల విధులకు ఆంధ్రాపోలీసులను అనుమతించడం లేదని తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎన్నికల కమిషన్ కేసీఆర్ ఆదేశాలను అమలు చేస్తుందా లేక భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తుందా అని ప్రశ్నించారు.
ఓట్లకోసం కాళ్లు పట్టుకుంటున్నారు
కేసీఆర్ ఆంధ్రా, తెలంగాణ అంటూ విభజన రాజకీయాలు మాట్లాడుతుండగా, ఆయన కుమారుడు కేటీఆర్ వారి ఓట్ల కోసం కాళ్లు పట్టుకుంటున్నాడని శ్రవణ్ ఎద్దేవా చేశారు. కొంగరకలాన్ సభలో ఆంధ్రా రాక్షసులు, అమరావతికి అమ్ముడు పోదామా అంటూ విషం చిమ్మిన విషయాన్ని ప్రజలు ఎలా మరిచిపోతారన్నారు. ధన, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఉండటం ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యమని చెప్పారు. తార్నాక లిటిల్ ఇంగ్లండ్‌లో ఉన్న ఆంగ్లేయుల వారసులు, మల్కాజిగిరిలో ఉన్న తమిళులు, మళయాళీలు, కన్నడిగులు, బేగంబజార్‌లో రాజస్తానీలు, గుజరాతీలు ఇలా భిన్న రాష్ట్రాలనుంచి వచ్చిన వారున్నారని గుర్తు చేశారు.