ఆ ఇద్దరిలో ఎవరు గెలిచినా రికార్డే

Congress And BJP Leaders Tension on Election Results - Sakshi

కీలక ఘట్టానికి నేడు తెర

ఫలితాల కోసం కుతూహలంగా వేచి చూస్తున్న ప్రజలు

గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు

కోలారు: లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టానికి నేడు తెరపడనుంది. కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు కోసం జిల్లా ప్రజలు యావత్తు కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈవీఎంల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. కోలారు లోక్‌సభ బరిలో నిలిచిన 14 మందిలో విజేతలు ఎవరో..పరాజితులు ఎవరో గురువారం తేలనుంది. కోలారు నగరంలోని డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కోలారు లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే మొదటి సారిగా కాంగ్రెస్, బీజేపీల  మధ్య  తీవ్ర పోటీ నెలకొంది. ఫలితాలు ఎలా ఉంటాయోనని  అభ్యర్థులైన కెహెచ్‌ మునియప్ప( కాంగ్రెస్‌), ఎస్‌.మునియప్ప(బీజేపీ)ల్లో గుండె దడ ప్రారంభమైంది. కాగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా సరికొత్త రికార్డు అవుతుంది.

గెలుపుపై ఉభయ నేతల్లోనూ ధీమా
లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు.   7 సార్లు నియోజవకవర్గం నుంచి పోటీ చేసి వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్‌ అభ్యర్థి కెహెచ్‌ మునియప్పకు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మునిస్వామి నుంచి గట్టి పోటీ ఎదురైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కెహెచ్‌ మునియప్ప విజయం కోసం అపసోపాలు పడాల్సి వచ్చింది. కెహెచ్‌ మునియప్పకు టికెట్‌ ఇవ్వరాదని జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీ వరకు వెళ్లి ప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం ఆయన్నే ఎంపిక చేసింది. అనంతరం ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్‌ నాయకులు స్వంత పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ముందుకు రాలేదు. ఇలా పార్టీలోని కుంపటి మునియప్ప విజయానికి అడ్డుపడుతుందని పలువురు అంచనా వేశారు. అయితే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల జేడీఎస్‌కు చెందిన నాయకులు కొంతమంది కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడంతో మునియప్ప కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు.
 జిల్లాలో బీజేపీకి గట్టి పునాదులు లేవు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో కెహెచ్‌ మునియప్పపై  ఉన్న అసంతృప్తినే పెట్టుబడిగా చేసుకుని అసంతృప్త కాంగ్రెస్‌ నాయకుల సహకారంతో బీజేపీ అభ్యర్థి మునిస్వామి విజయం కోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికలలో విజయం తనదేనని మునిస్వామి ఆత్మ విశ్వాసంతో ఉన్నారు.  

ఎవరూ గెలిచినా రికార్డే
ఈ లోక్‌సభ  ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థుల్లో ఎవరూ విజయం సాధించినా అది రికార్డు అవుతుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి మునియప్ప వరుసగా 7 సార్లు విజయం సాధించారు. ఆయన ఈ పర్యాయం గెలిస్తే  భారీ రికార్డు అవుతుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో వరసగా 8 సార్లు విజయం సాధించిన వారు ఇంతవరకు ఎవరూ లేరు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ఎస్‌. మునిస్వామి   విజయం సాధించినా అది  సరికొత్త రికార్డు అవుతుంది. కోలారు రిజర్వు లోక్‌సభ నియోజవకర్గంలో ఇంతవరకు బీజేపీ అభ్యర్థులు ఎవరూ విజయం సాధించలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top