నాడు ఎన్టీఆర్‌కు.. నేడు హోదాకు..

Chandrababu Naidu Betrayed AP Special Status Says YS Jagan - Sakshi

వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడే

ఏపీ సీఎం తీరుపై నిప్పులుచెరిగిన వైఎస్‌ జగన్‌

సాక్షి, తెనాలి: ‘‘నాడు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు. ఆ తర్వాత అధికారం కోసం అదే ఎన్టీఆర్‌ విగ్రహానికి, ఫొటోలకు దండలు వేస్తాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలోనూ సరిగ్గా అదే పద్ధతిని అనుసరిస్తున్నాడు. కేంద్రం దగ్గర హోదాను తాకట్టుపెట్టి ఏపీకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. మళ్లీ అదే హోదా కోసం సైకిల్‌ యాత్రలని బయలుదేరాడు’ అని ఏపీ ముఖ్యమంత్రి తీరును ఎండగట్టారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. 130వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

హోదా వస్తుందని బాబుకు తెలుసు: ‘‘విభజన సమయంలో మనకు హక్కుగా దక్కింది ప్రత్యేక హోదా. దాని కోసం నాలుగేళ్లుగా మనం పోరాడుతున్నాం. చివరి అస్త్రంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు పార్లమెంట్‌ సభ్యులు రాజీనామాలు చేసి, ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆ ఐదుగురూ పంచపాండవుల మాదిరి ప్రాణాలను పణంగా పెట్టి నిరాహారదీక్షకు దిగారు. వాళ్లకు తోడుగా టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి, దీక్షలోకి వచ్చేదుంటే ఈ పాటికి దేశమంతటా చర్చనీయాంశం అయ్యేది. ఒక రాష్ట్రానికి చెందిన ఎంపీలంతా రాజీనామాలు చేస్తే ఏకంగా ప్రధానే దిగొచ్చి హోదా ఇచ్చేవాడు కాదా? అలా చేస్తే ఖచ్చితంగా హోదా వస్తుందని చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ ఆయన తాను చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రత్యేక హోదాను కేంద్రం దగ్గర తాకట్టుపెట్టాడు. టీడీపీ ఎంపీలతో ఆమరణ దీక్షలు చేయించకుండా ఏపీకి వెన్నుపోటు పొడిచాడు. మళ్లీ ఆయనే.. హోదా కోసమంటూ దొంగ సైకిల్‌ యాత్రలు, దొంగ అఖిలపక్ష సమావేశాలు నిర్వహించడం దుర్మార్గం కాదా, ఈయన డ్రామాలు చూస్తే రాక్షసుడనేకదా అనిపిస్తుంది. 40 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌ అంటాడు.. ఎందుకు? మోసం చెయ్యడానికా? మాయలు చెయ్యడానికా? అధికారం కోసం, స్వార్థం కోసం, పదవి కోసం ఏదైనా చేసే నైజం చంద్రబాబుది.  కూతురినిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడుస్తాడు. మళ్లీ ఎన్నికలప్పుడు అధికారం కోసం ఆ ఎన్టీఆర్‌కే దండలేసి బయలుదేరుతాడు. సరిగ్గా ఇప్పుడు ప్రత్యేక హోదాకు కూడా బాబు వెన్నుపోటు పొడిచాడు. మళ్లీ ఆయనే హోదా కోసం సైకిల్‌ యాత్ర చేస్తాడు’’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

పేరు ఆలపాటి.. కబ్జాల్లో ఘనాపాటి..: ‘‘తెనాలి పట్టణం కవులు, కళాకారులకు నిలయం. అష్టదిగ్గజాల్లో ఒకరైన తెనాలి రామకృష్ణది ఈ గడ్డ. ఇంతటి ఘన చరిత్రగల ఈ నేలను ఇప్పుడు పచ్చచొక్కాలు రాబందుల్లా పీక్కుతింటున్నాయి. కృష్ణానదిని ఇష్టారీతిగా దోచేస్తు చుట్టుపక్కల పల్లెలను, పట్టణాలను నాశనం చేస్తున్నారు. ఆధునిక యంత్రాలతో వేల కొద్దీ లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఇష్టారీతిలో తవ్వకాల వల్ల భూగర్భజలాలు అడుగంటి రైతులు గోసపడుతున్నారు. చెరువుల్లో లోతు ఎక్కువైపోయి మంచినీరు కాస్తా ఉప్పునీరుగా మారినా పట్టించుకున్న నాధుడులేడు. ఈ ఇసుక మాఫియా మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లో సాగుతోంది. ఆ ఎమ్మెల్యేలు, అధికారులు చినబాబు ఆధ్వర్యంలో పనిచేస్తారు. వాళ్లందరిపైనా పెదబాబు చంద్రబాబు ఉంటారు. తెనాలి నుంచి సీఎం క్యాంప్‌ ఆఫీసుకు 38 కిలోమీటర్ల దూరమే. సీఎం ఇంటి చుట్టూ ఉన్న గ్రామాల్లోనూ ఇసుక దోపిడీ యధేచ్ఛగా సాగుతోంది. ఇంత దారుణంగా సాగుతోన్న దోపిడీని ఏ మీడియా చూపించదు. చంద్రబాబు అంతబాగా మేనేజ్‌ చేస్తారు మరి. ఇక్కడి ప్రజలు నాతో చెప్పారు.. ‘మా ఎమ్మెల్యే పేరు ఆలపాటి.. కబ్జాల్లో మాత్రం ఘనాపాటి’ అని! ‘విజయవాడలో శాతవాహన కాలేజీ భూములు నుంచి గుంటూరు మైనారిటీల భూముల దాకా వేటినీ వదలట్లేదాయన. భూములను కాపాడుకోవడానికి ప్రజలు కోర్టులకు పోవాల్సివస్తున్నదని జనం ఫిర్యాదులు చేస్తున్నారు.

దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలి: తెనాలికి కూతవేటు దూరంలో ఉండే ముఖ్యమంత్రి ఈ విధంగా అవినీతికి కొమ్ముకాస్తున్నారో మనం చూడొచ్చు. నాడు మహానేత వైఎస్సార్‌.. తెనాలి ప్రాంతానికి నీళ్లివ్వాలన్న లక్ష్యంతో పైపులైన్లు మంజూరుచేశారు. ఆయన ఉన్నప్పుడే 70 శాంతం పనులు పూర్తయ్యాయి. కానీ మిగిలిన పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. రైతులకు, ప్రజలకు నీళ్లు లేవంటే.. చంద్రబాబు మాత్రం కోకోకోలా ఫ్యాక్టరీకి నీళ్లిస్తారు. మిర్చీ, పత్తి రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. వాళ్లకోసం నేనే స్వయంగా ధర్నా చేశా. పత్తి కొనుగోళ్లల్లో మంత్రులు కోటానుకోట్లు బొక్కేసిన చరిత్ర ఉంది. చివరికి మరుగుదొడ్ల నిధులను కూడా తింటున్నారు. బియ్యం కోసం రేషన్‌ షాపునకు వెళితే.. ‘మీరు ఏ పార్టీ?’ అని అడుగుతున్నారు. ఇదీ.. నాలుగేళ్లుగా సాగుతోన్న దుర్మార్గపు పాలన. ఇంకో ఏడాదిలో ఎన్నికలు రానున్న తరుణంలో మీరంతా ఆలోచించాలని కోరుతున్నా.. ఈ చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా?  రైతు రుణాల మాఫీ చేస్తానని, డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ చేస్తానని, ఇంటికొక ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి కల్పిస్తామని, బెల్టుషాపులు ఎత్తేయిస్తానని, కరెంటు బిల్లులు తగ్గిస్తానని, వందలకొద్దీ హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన దుర్మార్గుడిని పొరపాటున కూడా క్షమించొద్దు’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top