సీఎఎ, ఎన్‌పీఆర్‌లపై వ్యతిరేకత ఎందుకు?

BJP MP Bandi Sanjay Kumar Fires On KCR - Sakshi

బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌

సాక్షి, కరీంనగర్‌: సీఎఎ, ఎన్‌పీఆర్‌లపై వ్యతిరేకత ఎందుకో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం, వామపక్షాలు సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందువులకు వ్యతిరేకం కాదంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ కంటితుడుపు ప్రకటనలు చేస్తున్నారన్నారు. ‘దేశంలో 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే..హిందువులను అంతం చేస్తామన్న వ్యాఖ్యలు హిందువులకు వ్యతిరేకం కాదా.. హిందువుల పట్ల వ్యతిరేకత లేకపోతే అయోధ్య అంశంలో సుప్రీం కోర్టు తీర్పును ఎంఐఎం ఎందుకు తప్పుబట్టింది. లౌకికవాద పార్టీ అంటూ గొప్పగా ప్రకటించుకునే టీఆర్ఎస్‌ పార్టీ సి.ఎ.ఎ, ఎన్.పి.ఆర్ ను ఎందుకు వ్యతిరేకిస్తోంది’ అని ప్రశ్నించారు.

సమగ్ర కుటుంబ సర్వే పేరుతో పౌరుల వ్యక్తిగత వివరాలు సేకరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం... ఎన్.పి.ఆర్ ను వ్యతిరేకించడం ద్వంద్వ విధానం కాదా అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, అలజడి సృష్టించేందుకు కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్, వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. భారత్ మాతా కీ జై అనని పార్టీలు కూడా దేశం గురించి మాట్లాడటం విడ్డూరం గా ఉందన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లో మైనారిటీలపై హింసను ఏనాడూ ప్రశ్నించని ఎంఐఎం... ఆ దేశాల నుంచి భారత్ వచ్చే శరణార్ధులకు పౌరసత్వం ఇవ్వడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తోందో సమాధానం చెప్పాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని.. ప్రజలంతా ఏకమై బీజేపీకి మద్దతుగా నిలుస్తారని సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top