ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌

BJP Leader Bandaru Dattatreya Fires On KCR - Sakshi

సాక్షి, సంగారెడ్డి: ఎంఐఎం చేతిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనితీరు మాటల్లోనే... కానీ చేతల్లో కనిపించడం లేదని ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి దృష్టి అంతా కాళేశ్వరంపైనే ఉంది కానీ ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా నీరందించలేదని ఎద్దేవా చేశారు. కల్యాణ లక్ష్మి పథకానికి ఐదు నెలల నుంచి నిధులు మంజూరు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా అవినీతి పేరుకుపోయి రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా తయారయిందని.. దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. అదేవిధంగా సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని కోరారు. సంగారెడ్డి జిల్లాలోని 16 మండలాల్లో కరువు తాండవం చేస్తోందని, ఇందుకోసం తక్షణమే జిల్లాకు రూ.100 కోట్లు కేటాయించాలని  డిమాండ్‌ చేశారు.

కేంద్రం నిధులు విడుదల చేసినా వాటిని ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. మున్సిపల్‌ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. ఇప్పటికే ఈ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్‌ వైఫల్యాలను గ్రామ స్థాయిలో తీసుకెళ్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే నావ అని, బలమైన నాయకత్వం లేకపోవటంతో పార్టీలో విశ్వసనీయత లోపించిందని అభిప్రాయపడ్డారు. మైనారిటీల రక్షణ కోసం ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు తీసుకొచ్చామన్నారు. గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందని దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top