పార్టీ ప్రొఫైల్‌: బీజేపీ ఆశల వికాసం

BJP Graph Hikes From Five Years - Sakshi

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మొదటిసారి ఐదేళ్లు అధికారంలో కొనసాగాక జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలివి. 2004ఎన్నికల్లో మాదిరిగానే మళ్లీ విజయం సాధించడానికి పాలకపక్షం మున్నెన్నడూ లేనంత గట్టిప్రయత్నాలు చేస్తోంది. బీజేపీతొలి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి రెండోసారి ప్రమాణం చేశాక పదవిలో వరుసగా ఆరేళ్ల రెండు నెలలు కొనసాగినాఈ పదవీకాలం రెండు లోక్‌సభలకు సంబంధించినది. పూర్తిగా ఐదేళ్లు కొనసాగకుండానే ఈ 12, 13వ లోక్‌సభలురద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకే లోక్‌సభ కాలంలో ఐదేళ్లు ప్రధానిగా కొనసాగిన రికార్డు బీజేపీలో నరేంద్రమోదీకే దక్కింది. లోక్‌సభలో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించడం కూడా ఇదే మొదటిసారి. 1951–77 మధ్య మనుగడ సాగించినభారతీయ జనసంఘ్‌ (బీజేఎస్‌) కొత్త రూపమే బీజేపీ.

దశ మారింది
కాషాయపక్షం మొదటిసారి పోటీచేసిన లోక్‌సభ ఎన్నికల్లో (1984) గెలిచింది రెండు సీట్లే. 1989 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలం ఒక్కసారిగా 86 సీట్లకు పెరిగింది. జనతాదళ్‌ నేత వీపీ సింగ్‌ నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ సర్కారుకు బయటి నుంచి బీజేపీ మద్దతు ఇచ్చింది.  సోమ్‌నాథ్‌ నుంచి అయోధ్యకు రథయాత్రతో బయల్దేరిన సీనియర్‌ నేత లాల్‌కృష్ణ ఆడ్వాణీని బిహార్‌లో లాలూప్రసాద్‌యాదవ్‌ ప్రభుత్వం (జనతాదళ్‌) అరెస్ట్‌ చేశాక వీపీసింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. అదే సమయంలో బాబరీ మసీదు కూల్చివేతకు విఫలయత్నం జరిగింది. చంద్రశేఖర్‌ ప్రభుత్వం రాజీనామా తర్వాత 1991 మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ బలం 124 సీట్లకు పెరిగింది. ఐదేళ్ల పీవీ నరసింహారావు పాలన కాలంలో ప్రధాన ప్రతిపక్షంగా సమర్థంగా పనిచేసింది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ రాకున్నా అతిపెద్ద పార్టీగా (161 సీట్లు) అవతరించింది. 

బెడిసికొట్టిన తొలి యత్నం
సీనియర్‌ నేత వాజ్‌పేయి నేతృత్వంలో ఏర్పడిన మొదటి బీజేపీ (ఎన్డీఏ) ప్రభుత్వం లోక్‌సభలో మెజారిటీ కూడగట్టలేక 13 రోజులకే రాజీనామా చేసింది. రెండేళ్ల తర్వాత జరిగిన 12వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లతో మరోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్‌పేయి నాయకత్వాన రెండో బీజేపీ ప్రభుత్వం 1998 మార్చి 19న అధికా రంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం నుంచి జయలలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకే వైదొలగడంతో జరిగిన బలపరీక్షలో ఓడిపోవడంతో 13 నెలలకే ఈ ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత లోక్‌సభ రద్దయినా కార్గిల్‌ పోరు కారణంగా ఆలస్యంగా సెప్టెంబర్‌–అక్టోబర్‌లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ బలం (182) కంటే మిత్రపక్షాల బలం పెరిగింది. వాజ్‌పేయి మూడోసారి ప్రధానిగా 1999 అక్టోబర్‌లో ప్రమాణం చేశారు. నాలుగేళ్ల ఏడు నెలలకు పైగా అధికారంలో ఉన్న ప్రభుత్వం అనేక సవాళ్లు ఎదుర్కొంది.

మసూద్‌ను వదిలేశారు
డిసెంబర్‌లో హర్కతుల్‌ ముజాహిదీన్‌ పేరుతో కశ్మీర్‌ తీవ్రవాదులు కఠ్మాండు నుంచి బయల్దేరిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని కాందహార్‌కు బలవంతంగా దారిమళ్లించడంతో మసూద్‌ అజహర్‌ సహా  ముగ్గురు తీవ్రవాద నేతలను  బీజేపీ సర్కారు విడుదల చేసింది. 2001 డిసెంబర్‌ 13న కశ్మీర్‌ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ తీవ్రవాదులు భారత పార్లమెంటు భవనంపై జరిపిన దాడిలో 12 మంది మరణించారు. తర్వాత ఏడాది వరకూ భారత్, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకు 2002 జనవరి–ఫిబ్రవరిలో జరిగిన గుజరాత్‌ అల్లర్లపై సకాలంలో చర్యలు తీసుకోలేదనే విమర్శలు వాజ్‌పేయి ప్రభుత్వం ఎదుర్కొంది. 2004 ఫిబ్రవరి నాటికి దేశ ఆర్థికాభివృద్ధి రేటు దాదాపు పది శాతానికి చేరింది. అప్పట్లో ఏడు నెలల ముందే బీజేపీ సర్కారు మధ్యంతర ఎన్నికలకు వెళ్లింది. 

బీజేపీ అనూహ్య పరాజయం!
జీడీపీ రేటు బాగున్నా, వాజ్‌పేయి ప్రభుత్వం పనితీరుపై జనం అనేక సర్వేల్లో సంతృప్తి వ్యక్తం చేసినా చివరికి ఏప్రిల్‌–మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఓడిపోయింది. బీజేపీ బలం 182 నుంచి 138కి పడిపోయింది. కాంగ్రెస్‌ నాయకత్వాన యూపీఏ సర్కారు అధికారం చేపట్టి ఐదేళ్లు పాలన సాగించింది. సీనియర్‌ నేత ఎల్‌.కె.ఆడ్వాణీ నేతృత్వంలో బీజేపీ 2009 ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఓటమిపాలైంది. బీజేపీ బలం ఈసారి 116 స్థానాలకు దిగజారింది.

మలుపు తిప్పిన మోదీ గెలుపు
ముఖ్యమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించడంతో 2013 సెప్టెంబర్‌లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఆడ్వాణీ వంటి సీనియర్లకు ఈ నిర్ణయం మొదట మింగుడుపడకపోయినా చివరికి అందరూ అంగీకరించారు. యూపీఏ మొదటి హయాం పాలనలో జరిగిన అవినీతి కుంభకోణాలు 2009 ఎన్నికల తర్వాత ఒక్కొక్కటిగా వెలుగు చూడడం, యూపీఏ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కేబినెట్‌లోని మంత్రులు అవినీతిపరులుగా జనంలో ముద్రపడడం, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ చేతుల్లోనే అధికారం ఉండడం, మన్మోహన్‌ బలహీన ప్రధానిగా ప్రచారం జరగడంతో 2014 ఎన్నికల్లో బీజేపీ మొదటిసారి 282 సీట్లతో విజయం సాధించింది. 1984 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒక పార్టీకి సొంతంగా మెజార్టీ  సీట్లు(273) రావడం ఇదే మొదటిసారి.

వరుస పరాజయాలు
‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌’ నినాదంతో ప్రధాని అయిన మోదీ 2014 మే నుంచీ జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించారనే పేరు సంపాదించారు. అవినీతి తగ్గిపోయిందనీ, ప్రభుత్వ యంత్రాంగంపై మోదీకి పూర్తి పట్టు ఉందని ప్రచారం జరిగింది. 2016 చివర్లో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం మాయం కాలేదు గాని సామాన్య ప్రజానీకం నానా ఇబ్బందులు పడింది. జీఎస్టీతో ఆరంభంలో ధరలు పెరిగాయి. వృద్ధి రేటు తగ్గింది. నిరుద్యోగం పెరిగిందనే వార్తలొస్తున్నాయి. ఇటీవల మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయాక కాంగ్రెస్‌ దూకుడు పెరిగిం ది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత బదులుగా నిర్వహించిన ‘బాలాకోట్‌ ఆపరేషన్‌’తో బీజేపీ సర్కారు పరువు నిలిచింది.  రఫేల్‌ ఒప్పందంపై వచ్చిన విమర్శల వల్ల మోదీ నిజాయతీపై మచ్చ పడలేదు. మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు వంటి ప్రధాన రాష్ట్రాల్లో ప్రాంతీయ పక్షాలతో పొత్తులు కుదిరాయి. మొత్తానికి ఈ ఎన్నికలు మోదీకి కంటే బీజేపీకే కీలకం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top