బీజేపీ దూకుడుకు బ్రేక్‌?

BJP breaks aggression - Sakshi

కొత్త ప్రాంతాలకు పార్టీ విస్తరణపై ‘కర్ణాటక’ ప్రభావం

న్యూఢిల్లీ: కర్ణాటకలో మూడు రోజులకే బీజేపీ సర్కారు పతనమవడం 2019 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూలంగా మారనుందా? ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య రసవత్తరమైన పోరు నెలకొంటుందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవునంటున్నారు. ప్రస్తుతం బీజేపీకి మంచి పట్టున్న ప్రాంతాలే కాకుండా, దేశంలోని ఇతర భాగాల్లోనూ పార్టీని బలోపేతం చేయాలన్న మోదీ ఆలోచనకు కర్ణాటక రూపంలో ఎదురుదెబ్బ తగిలిందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి మంచి బలం ఉండగా ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ అంతంత మాత్రంగా ఉంది. దక్షిణాదిలో కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో బలహీనంగా ఉంది.

కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా నిలిచినా అధికారం దక్కించుకోలేక పోయిందనీ, 2019లో మోదీ తిరిగి ప్రధానిగా ఎన్నికవ్వకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ జట్టు కట్టే అవకాశాలను ఇది మరింత ఎక్కువ చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకమైనందుకు నేను గర్విస్తున్నాను. ఈ దేశంలో అహంకారానికి ఓ హద్దుంటుంది. బీజేపీ, ఆరెస్సెస్‌లు ఈ ఓటమి నుంచైనా ఆ విషయాన్ని గ్రహిస్తాయని అనుకుంటున్నా’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. కర్ణాటకలో అత్యధిక స్థానాలను బీజేపీ దక్కించుకున్నా అధికారం చేపట్టలేకపోవడం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపుతుందనీ, కొత్త ప్రాంతాలకు విస్తరించకుండా బీజేపీ దూకుడుకు బ్రేక్‌ పడినట్లేనని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌కు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని అంచనా వేస్తున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top