‘కాషాయం’లో కలిసిపోయిన ‘ఎరుపు’

Bengal Left front melting with bjp - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సమీర్‌ మహతో బిద్రీ గ్రామంలో ఆఖరి కమ్యూనిస్టు. ‘ఒకప్పుడు మేము ఇక్కడ చాలా బలంగా ఉండేవాళ్లం. మొదట్లో మా మీద మావోయిస్టులు దాడులు జరిపారు. ఆ తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ వారు. తృణమూల్, పోలీసుల నుంచి మాకు రక్షణ కావాలంటే బీజేపీలో చేరడమే ఉత్తమమని ఇక్కడ అందరు భావించారు. అందుకనే మా గ్రామంలోని కమ్యూనిస్టు కార్యకర్తలందరు బీజేపీలో చేరిపోయారు. చివరకు నేను కూడా చేరిపోక తప్పడం లేదు’ అని దీర్ఘ నిశ్వాసంతో సమీర్‌ మహతో తెలిపారు. 

బెంగాల్‌లోని సాల్‌ అడవుల్లో ఝార్‌గ్రామ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో జార్ఖండ్‌కు సరిహద్దులో బిద్రీ గ్రామం ఉంది. సమీర్‌ మహతో ఎంతోకాలంగా సైద్ధాంతికంగా సీపీఎంకు కట్టుబడి ఉన్నారు. అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఓ హిందూత్వ పార్టీలో చేరడం అంటే అనూహ్య పరిణామం. కొరుకుడు పడని విషయం. ‘బెంగాల్‌ రాష్ట్రానికి కమ్యూనిస్టులు ఒక్కరే మార్గదర్శకులు, నిర్దేషకులు అనుకున్నాం. చివరి వరకు నేను కమ్యూనిస్టు పార్టీలోనే ఉండిపోతానని అనుకున్నాను. ఓ జనరేటర్‌ను దొంగిలించానని పోలీసులు నాపై తప్పుడు కేసు పెట్టారు. బీజేపీ కార్యకర్తలే నాకు అండగా నిలిచారు’ అని సమీర్‌ వివరించారు. 34 ఏళ్ల సీపీఎం  సుదీర్ఘ పాలనకు 2011లో తెరపడినప్పటికీ ఐదేళ్ల పాటు దాని ప్రభావం ఎక్కువే ఉండేది. ఇటీవలి కాలంలో మాత్రం ఆ పార్టీ ప్రభావం అతివేగంగా పడిపోతూ వచ్చింది.

2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు వచ్చిన పోలింగ్‌ శాతం 29.58 శాతం కాగా, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల ఓట్ల శాతం 41 శాతం. అంటే, ఆ ఎన్నికల్లో 184 సీట్లను సాధించి అధికారంలోకి వచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ కన్నా రెండు శాతం ఓట్లు ఎక్కువ. 2016 ఎన్నికల నాటికి రాష్ట్రంలో వామపక్షాల ప్రభావం అనూహ్యంగా పడిపోయింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి 44.9 శాతానికి పెరగ్గా, వామపక్షాల పోలింగ్‌ శాతం 24కు పడిపోయింది. అయినప్పటికీ ప్రతి నలుగురు ఓటర్లలో ఒకరు కమ్యూనిస్టు ఉండేవారు. ఆ తర్వాత కమ్యూనిస్టు కార్యకర్తలపై మార్క్స్‌ ప్రభావం తగ్గుతూ మోదీ ప్రభావం పెరగుతూ వచ్చింది. 

2017లో కాంటాయ్‌ సౌత్‌లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థియే గెలిచినప్పటికీ వామపక్షాలు, బీజేపీ పోలింగ్‌ శాతాలు తిరగబడ్డాయి. బీజేపీ పోలింగ్‌ శాతం 9 నుంచి 31 శాతానికి పెరగ్గా, వామపక్షాల శాతం 34 నుంచి 10 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీకి కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వడం అన్నది 2018 పంచాయతీ ఎన్నికల నుంచి ప్రారంభమైంది. ఆ ఎన్నికల్లో అన్ని పార్టీల వారిని పాలకపక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌ టెర్రరైజ్‌ చేయడంతో పలు పంచాయతీ సీట్లలో కమ్యూనిస్టులు, బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలిపారు. ఫలితంగా సీపీఎం తన సొంత ఉనికిని కోల్పోవాల్సి వచ్చింది. దాంతో బలం పుంజుకున్న బీజేపీ, తృణమూల్‌కు ప్రధాన ప్రతిపక్షంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇతర పార్టీల అభ్యర్థులను పాలకపక్ష తణమూల్‌ టెర్రరైజ్‌ చేయడం వల్ల ఆ ఎన్నికల్లో 34 శాతం తృణమూల్‌ సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనే విషయం తెల్సిందే.

సీపీఎం కార్యకర్తలు భద్రత కోసం తమ పార్టీని వీడి బీజేపీలోకి పోతున్నారని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, ఆ పార్టీ వద్ద డబ్బులు ఎక్కువగా ఉండడం, పైగా బీజేపీ కార్యకర్తపై చిన్న దాడి జరిగినా మీడియాలో పెద్దగా ప్రచారం వస్తుండంతో ఇది జరుగుతోంది. ఝార్‌గ్రామ్‌ జిల్లా పార్టీ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ సర్కార్‌ తెలిపారు. సైద్ధాంతిక కట్టుబాటు గురించి ప్రస్తావించగా, క్షేత్రస్థాయిలో అది పనిచేయదని, ఎలాగైనా తృణమూల్‌ను ఓడించడమే లక్ష్యంగా తమ పార్టీవారు ఆలోచిస్తున్నారని తెలిపారు. మాల్దా ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం ఆదివాసీలకు కేటాయించడంతో ఆ సీటును 1962 నుంచి సీపీఎం గెలుచుకుంటూ వస్తోంది. అక్కడ గత మూడుసార్లు వరుసగా విజయం సాధిస్తూ వచ్చిన ప్రముఖ సీపీఎం నాయకుడు ఖాగెన్‌ ముర్మూ గత మార్చి నెలలో బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వామపక్షమనేది ఏదీ లేదని, బీజేపీ ఒక్కటే మిగిలిందనీ మాజీ సీపీఎం కార్యకర్త సురేంద్ర నాథ్‌ బర్మన్‌ తెలిపారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. 

కమ్యూనిస్టుల పాలనలో అధ్వాన్నంగా గ్రామీణ ప్రాంతాల రోడ్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనలో మెరుగుపడ్డాయి. కొత్త రోడ్లు వేశారు. కేంద్ర ఆవాస్‌ యోజన పథకాన్ని సవ్యంగా అమలు చేస్తోన్న రాష్ట్రాల్లో బెంగాల్‌ రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కమ్యూనిస్టులు తణమూల్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీలో చేరిపోవడం విడ్డూరంగా, అసంబద్ధంగా కనిపిస్తోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top