‘బస్తర్‌’ మే సవాల్‌

Bastar goes to polls today amid Naxal threat, tight security - Sakshi

బస్తర్, గడ్చిరోలిలో ఎన్నికల నిర్వహణ కత్తి మీద సామే..

మావోయిస్టుల పడగనీడలో.. రెండు చోట్లా నేడే ఎన్నికలు

భూమి హక్కు కాపాడేవారికే ఓటేస్తామంటున్న ఆదివాసీలు

మహారాష్ట్రలోని గడ్చిరోలి.. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌.. గిరిజన నియోజకవర్గాలు. అటవీ హక్కుల చట్టంపైనే అన్ని కళ్లూ పెట్టుకున్నారు ఇక్కడి ఆదివాసీలు. భూమి హక్కులు కాపాడే వారికే ఓటేస్తామంటున్నారు. మరోవైపు మావోయిస్టులు ఇక్కడ ఎన్నికల్ని అడ్డుకునేందుకు బెదిరింపులకు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. మంగళవారం బస్తర్‌లోని దంతేవాడకు చెందిన బీజేపీ శాసనసభ్యుడు భీమా మాండవి కాన్వాయ్‌పై దాడి జరిపి, ఆయనతో సహా నలుగురు భద్రతా సిబ్బందిని కాల్చి చంపారు. దీంతో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం బస్తర్‌లో 80 వేల భద్రతా బలగాలను, డ్రోన్లను మోహరించింది. భారీ ఏర్పాట్ల మధ్య నేడు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

గడ్చిరోలిలో అటవీ హక్కుల చట్టం ప్రభావం
మహారాష్ట్రలోని గడ్చిరోలి చిముర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్‌ బలంగా ఢీకొంటున్నాయి. బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ అశోక్‌ నేతే, కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ నామ్‌దేవ్‌ ఉసెంది మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలే. మోదీకి వున్న జనాకర్షణ తమ అవకాశాలను మెరుగుపరుస్తుందని బీజేపీ భావిస్తుండగా, ఎన్‌సీపీ, సీపీఐ పొత్తుతో తాము గట్టెక్కగలమని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. ఎటపల్లి – భమ్రాగర్‌ మైనింగ్‌ బెల్ట్‌లో పెసా, అటవీ హక్కుల చట్టాలు అమలు చేయకపోవడంపై ఇక్కడ ఆదివాసీలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ అంశం ఎన్నికల్లో కీలకం కానున్నదని గడ్చిరోలి మారుమూల ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. గిరిజనుల అటవీ హక్కులు పరిరక్షించకపోవడమనేది బీజేపీకి నష్టదాయకంగా పరిణమించగలదన్న అభిప్రాయం వినపడుతోంది.

గడ్చిరోలిలో 90.85 శాతం మంది గ్రామీణులు. 30.50 శాతం మంది ఆదివాసీలు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడిన గడ్చిరోలి ప్రజలు రైల్వే కనెక్టివిటీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వీటిపై నేతే 2014లో ఓటర్లకు ఇచ్చిన వాగ్దానం నెరవేరకపోవడం, దీనికి తోడు ఆయన ఓ ఆర్థిక కుంభకోణంలో చిక్కుకోవడం అనే అంశాలు బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. 42 శాతం ఓబీసీల ఓట్లు ఇక్కడి అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. తమ రిజర్వేషన్‌ కోటాను 19 నుంచి 6 శాతానికి తగ్గించడంపై వీరు ఆగ్రహంతో వున్నారు. కోటాను పునరుద్ధరింపచేస్తామని రెండు ప్రధాన పార్టీల నేతలూ హామీలిచ్చారు.

భూమి హక్కులే ‘బస్తర్‌’ ఎజెండా
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో భూమి హక్కే ప్రధాన ఎజెండా. అటవీ హక్కుల చట్టం కింద అడవులపై ఆధారపడి జీవించే హక్కు తమకు ఉందంటున్న ఆదివాసీలు.. తమ భూముల జోలికి రాబోమని ప్రకటించే వారికే ఓటు వేస్తామంటున్నారు. ‘జాతీయవాదం ఇక్కడ ఓట్లు రాల్చదు. జీవనాధారమైన భూమే మాకు అతి ముఖ్యం’ అంటున్నారు స్థానికులు. అడవుల్లో నివసించేందుకు అనర్హులైన ఆదివాసీలను దురాక్రమణదారులుగా గుర్తించి జూలై లోపు ఖాళీ చేయించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇక్కడి ఆదివాసీలు మండిపడుతున్నారు. ఇటీవల నిరసన ప్రదర్శనలు జరిపి, కరపత్రాలు పంచారు.

ఏ ఒక్కరినీ అడవుల నుంచి ఖాళీ చేయించబోమని ముఖ్యమంత్రి భాగెల్‌ హామీ ఇచ్చిన తర్వాతే వారు శాంతించారు. మోదీ ప్రభుత్వం కోర్టులో ఆదివాసీల తరఫున తన వాదన సరిగా వినిపించలేకపోయిందని, వారి హక్కులకు రక్షణ కల్పించలేకపోయిందని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. కొంటా, బస్తర్, చిత్రకూట్, కొండగావ్, జగదల్‌పూర్, దంతేవాడ, బీజీపూర్, నారాయణపూర్‌ అనే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఎస్టీ జనాభా 70 శాతం. బీజేపీ తరఫున ఆ పార్టీ బస్తర్‌ జిల్లా నేత బైదురామ్‌ కశ్యప్‌.. కాంగ్రెస్‌ ఫైర్‌బ్రాండ్‌ లీడర్‌ దీపక్‌ బైజ్‌తో తలపడుతున్నారు. 1998 నుంచి బీజేపీ ఖాతాలో వున్న బస్తర్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో వున్న కాంగ్రెస్‌.. ఈసారి చిత్రకూట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన దీపక్‌కు టికెట్‌ ఇచ్చింది.

బీజేపీ అభ్యర్థి కంటే ఈ యువకుడికే ప్రజాదరణ ఎక్కువ వున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గతంలో టాటా గ్రూప్‌ కోసం బీజేపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగిచ్చేయడమనేది ఆదివాసీల్లో కాంగ్రెస్‌ ఆదరణకు దోహదపడగలదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బస్తర్‌ సిట్టింగ్‌ ఎంపీ దినేశ్‌ కశ్యప్‌పై స్థానికుల్లో చోటుచేసుకున్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనుంది. పలు సమస్యలతో సతమతమవుతున్న నియోజకవర్గాన్ని ఎంపీ ఏనాడూ సందర్శించలేదని ఆదివాసీలు విమర్శిస్తున్నారు. కేంద్రంపై ఉన్న వ్యతిరేకతకు తోడు గత మూడు మాసాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరచడం, ప్రత్యేకించి రుణమాఫీ అమలు చేయడం, బీజేపీ సర్కారు స్వాధీనం చేసుకున్న గిరిజనుల భూములను తిరిగివ్వడం వంటి చర్యలు తమకు లాభిస్తాయనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్‌ ప్రచార కమిటీ నేత కవసి లక్మా.

మరోవైపు కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బస్తర్‌ లోక్‌సభ స్థానంలో దంతేవాడ మినహా మిగిలిన సీట్లను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఎన్నికలకు ముందు దంతేవాడలో మావోయిస్టులు పేల్చిన మందు పాతరలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి మృతి చెందారు. బీఎస్‌పీకి చెందిన ఆయుతు రామ్‌ మండవి, సీపీఐకి చెందిన రాము రామ్‌ మౌర్య సహా మొత్తం ఏడుగురు అభ్యర్థులు ఇక్కడ బరిలో వున్నారు. మొబైల్‌ ఫోన్లు వాడుకోగల పరిస్థితి కూడా ఈ నియోజకవర్గంలో అంతగా లేదు. రహదారులకు దగ్గరగా వుండే కొన్ని ఇళ్లలోనే ఇక్కడ టీవీలుంటాయి. బీజేపీ, కాంగ్రెస్‌లంటే ఇక్కడ పువ్వు, చేతి గుర్తులే. మావోయిస్టుల ఆదేశాల ప్రభావమే ఎక్కువ.  

మావోల బెదిరింపులు
ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు ఏర్పాటు చేసిన బ్యానర్లను పోలీసులు కొన్ని ప్రాంతాల్లో తొలగించి, దగ్ధం చేశారు. మరోవైపు మావోల భయంతో అభ్యర్థులు భమ్రాగర్, సిరోంచ, అహేరి, ధనోరా, ఎటపల్లి సహా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారానికి దూరంగా వున్నారు. బెదిరింపుల నేపథ్యంలో జనం ఎన్నికల సభలకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు నేతే. ఉసెంది మారుమూల ప్రాంతాల్లో కొద్ది మేర ప్రచారం జరిపారు.  మావోయిస్టుల హింసకు సంబంధించి ఇక్కడ 2014లో 15 కేసులు, 2009లో 18 కేసులు నమోదయ్యాయి. 2004లో ఎదురు కాల్పుల ఘటనలు సహా మొత్తం 23 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మందు పాతర పేలుళ్లలో ఇద్దరు పోలీసులు మరణించారు. గత ఏప్రిల్‌లో భద్రతా దళాలు కస్నాసుర్‌  గ్రామం వద్ద 40 మంది అనుమానిత మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఇందుకు ప్రతీకారంగా మావోలు ఇన్‌ఫార్మర్లుగా ముద్ర వేసి, అరడజను మంది గ్రామస్తులను చంపేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top