మేము ఆ పదవి కోరలేదు: వైఎస్‌ జగన్‌

AP CM YS Jagan Mohan Reddy Has Given a Letter To BJP Chief Amit Shah Ragarding Special Status - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. భేటీ ముగిసిన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా అంశంతో పాటు, విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అన్నీ హోంమంత్రి పరిధిలోనే ఉన్నాయి.. వాటన్నింటికీ సంబంధించి హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ కూడా ఇచ్చామని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతో ఉందని చెప్పామని, రాష్ట్రం అన్నిరకాలుగా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో సహాయ సహకారాలు కావాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.


రేపు నీతి అయోగ్‌ సమావేశం ఉంది.. ఆ సమావేశం ప్రధాని ఆధ్వర్యంలో జరగబోతోంది.. ఆ సమావేశంలో కూడా మా సమస్యల్ని ప్రస్తావిస్తామని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ప్రత్యేక హోదా కచ్చితంగా ఇవ్వాలని కోరతామని, ఎప్పుడు, ఎక్కడ అవకాశం వచ్చినా ప్రత్యేక హోదా కావాలని కోరుతూనే ఉంటానని స్పష్టంగా పేర్కొన్నారు. దేవుడి దయతో ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నిస్తాను.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా ప్రధానిని ఒప్పించాలని అమిత్‌ షాను కోరినట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవిపై లేనిపోనివి ఊహించుకోవద్దని హితవు పలికారు. తాము ఆ పదవి కావాలని కోరలేదు వారు ఇస్తామనీ చెప్పలేదన్నారు. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్చ జరగలేదని, కాబట్టి దానిపై మాట్లాడటం అనవసరమన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top