‘కేసీఆర్‌ ఈసారైనా దళితున్ని ముఖ్యమంత్రి చేస్తావా..?’

Amit Shah Fires On KCR On Mahabubnagar BJP meeting - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : జమిలీ ఎన్నికలను సిద్ధమన్న తెలంగాణ ముఖ్యమంతి కే. చంద్రశేఖర్‌ రావు ఇప్పుడు యూ టర్న్‌ ఎందుకు తీసుకున్నారు..? ముందస్తు ఎన్నికల పేరుతో కేసీఆర్‌ ప్రజలపై కోట్ల రూపాయల భారాన్ని మోపుతున్నారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మండిపడ్డారు. శనివారం మహబూబ్‌నగర్‌ పాలమూరులో నిర్వహించిన బీజేపీ శంఖారావ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘ఇంతకాలం జమిలీ ఎన్నికలను సమర్ధించిన కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు యూ టర్న్‌ తీసకున్నారో ప్రజలకు వివరించాలి. లోక్‌ సభతో కలిసి పోటీ చేస్తే ఓడిపోతామని భయపడ్డారు. అందుకే మే నెలలో కాకుండా నవంబర్‌, డిసెంబర్‌లోనే ఎన్నికలకు వెళ్తున్నారు. కానీ కేసీఆర్‌ స్వార్ధపూరిత ఆలోచన వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుంది. తెలంగాణలో కేసీఆర్‌ పాలన చూశాక ఆ పార్టీ మళ్లీ విజయం సాధిస్తుందని అనుకోవడం లేదు. మూఢనమ్మకాలతో సచివాలయానికి వెళ్లని వ్యక్తిని మరోసారి గెలిపించి రాష్ట్రంలో రజాకార్ల పాలనను ఆహ్వానిస్తారా అంటూ’ అమిత్‌ షా ప్రజలను ప్రశ్నించారు. 

కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని అమిత్‌షా ఆరోపించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లన్నారు.. దళితులకు మూడేకరాల భూమి ఇస్తామన్నారు.. కానీ వాటన్నింటిని గాలీకి వదిలి మీరు మాత్రం పదేకరాల్లో ప్రగతి భవన్‌ పేరుతో గడి కట్టుకున్నారని అమిత్‌ షా మండిపడ్డారు. ప్రభుత్వం చేసే అన్యాయాలను ప్రశ్నిస్తే వారి మీద కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దళితులను వేధించడం, రైతులను అరెస్టు చేయడం వంటి పనులు కేసీఆర్‌కే సాధ్యమవుతాయని తెలిపారు. 2014లో దళితున్ని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ కనీసం ఈ సారి ఎన్నికల్లో అయినా మాటా మీద నిలబడతారా అంటూ ప్రశ్నించారు. ఆఖరికి అమర వీరుల కుటుంబాలను అదుకోవడంలో కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందని అమిత్‌ షా ఆరోపించారు.

మహారాష్ట్ర, కర్ణాటకలోని హైదరాబాద్ విముక్తి ప్రాంతాల్లో సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతున్నారు. కానీ తెలంగాణలో కేసీఆర్‌ తన మిత్రుడు అసదుద్దిన్‌ ఓవైసీకి భయపడి విమోచన దినాన్ని జరపడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లను ఇస్తానంది.. మరి ఆ రిజర్వేషన్లను ఎలా ఇస్తుందో?! ఎవరి కోటాను కట్‌ చేసి మైనారిటీలకు రిజర్వేషన్‌ పెంచుతారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక దాదాపు 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పలు పథకాల అమలు కోసం కేంద్రం, తెలంగాణ రాష్ట్రానికి లక్షా పదిహేను వేల కోట్ల నిధులిచ్చామని, వాటన్నింటిని ఎలా ఖర్చు చేశారో ప్రజలకు తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది నిరుపేద మహిళలకు గ్యాస్‌ కనెక్షన్‌లు ఇచ్చాం అని తెలిపారు. హైదరాబాద్‌లో 30 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం మోదీ సాకారం వల్లనే పూర్తయ్యిందని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మోదీ సర్కార్‌ పనిచేస్తోందని ఆయన ప్రకటించారు. అందుకే ఈ సారి ఎన్నికల్లో కూడా కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని అమిత్‌ షా ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా అమిత్‌ షా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై ధ్వజమెత్తారు. రాహుల్‌ గాందీ గ్రాఫ్‌ రోజురోజుకు పడిపోతుందని అన్నారు. రాహుల్‌ ప్రచారం చేసిన ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అపజయం చవిచూసిందని గుర్తు చేశారు. కానీ మోదీ వచ్చాక మహారాష్ట్ర, హిమాచల్, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలో కూడా కాంగ్రెస్‌ను గద్దె దించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణలో అన్ని స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top