అందుకే జ్యుడిషియల్‌ బిల్లు : అంబటి 

Ambati Rambabu Speech in Assembly Over Judicial Bill Discussion - Sakshi

సాక్షి, అమరావతి : అవినీతి రహితమైన, పారదర్శకతతో కూడిన పాలనను అందించడానికే జ్యుడిషియల్‌ బిల్లును తీసుకొచ్చినట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. అసెంబ్లీలో ఈ బిల్లు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఆహ్వానించదగిన బిల్లు అని ప్రశంసించిన ఆయన.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మౌలిక వసతుల్లో జరుగుతున్న కాంట్రాక్టుల్లో అవినీతిని అరికట్టడానికి ఈ బిల్లును తీసుకురావడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేయడం, చంద్రబాబు నాయుడు పరిపాలన విధానంతో ఈ బిల్లు అనివార్యమైందన్నారు. కమీషన్ల కోసం సొంత మనుషులకే కాంట్రాక్టులు ఇచ్చుకోని వేలకోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ దుర్బుద్ధిని తప్పించే సదుద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ బిల్లును తీసుకువస్తున్నారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు దోపిడీని దొంగల కథ ద్వారా వివరించి ఆకట్టుకున్నారు.

‘ఓ దేశంలో కొంత మంది దొంగలు బ్యాంకును దోచుకోవడానికి వెళ్లగా.. అక్కడి ఉద్యోగులు అడ్డుకుంటారు. అనవసరంగా మీ ప్రాణాలు పోతాయి.. ఇది ప్రజల సొమ్ము మీకెందుకు? అని హెచ్చరించగానే వారు అడ్డు తప్పుకుంటారు. దొంగలు కొంత సొమ్మును దోచుకునేసరికి పోలీసులు వస్తారు. వారి చెర నుంచి కొంత సొమ్ముతో ఎలాగోలా బయటపడతారు. ఎంత సొమ్ము దోచామో లెక్కిద్దామని దొంగల్లోని ఒకడనగా.. రేపు ప్రభుత్వం చెబుతుందిలే.. పడుకుందామంటాడు ఇంకొకడు. దొంగలంతా ఆ రాత్రికి విశ్రాంతి తీసుకుంటారు. ఉద్యోగులు పోలీసులకు రూ.20 కోట్ల లూటీ జరిగిందని చెబుతారు. అయితే రూ.40 కోట్లు పోయిందని చెబుదాం.. మిగతా 20 కోట్లు మనం తీసుకుందామని బ్యాంకు అధికారులు, పోలీసులు నిశ్చయించుకుంటారు. ఈ విషయాన్ని మంత్రికి తెలియజేయగా.. రూ.20 కోట్లు నొక్కెద్దామని ఆయన రూ.60 కోట్లని చెప్పమంటాడు. రూ.60 కోట్లు దోపిడీ జరిగిందని  ఆ దేశ ప్రధాని దగ్గరకు వెళ్లగా ఆయన ఏకంగా రూ.100 కోట్లు పోయాయని చెప్పమంటాడు. ఇది చూసిన దొంగలు.. సొమ్మును లెక్కించగా రూ.20 కోట్లే ఉంటుంది. మనం 20 కోట్లు దొంగలిస్తే.. వీరు మనపేరు చెప్పుకొని రూ. 80 కోట్లు నొక్కేశారు. దొంగలు వీరా? మనమా? అని ఆవేదనకు లోనవుతారు.’ అయితే ఆ దేశ ప్రధాని ఎవరో కాదు చంద్రబాబు నాయుడేనని అంబటి వివరించారు. ఇరిగేషన్‌కు వేల కోట్లు ఖర్చు చేసినట్లు చంద్రబాబు చూపించాడని, కానీ ఫలితం మాత్రం లేదన్నారు. దొంగల కథ మాదిరిగానే ఈ డబ్బులు కూడా పక్కదారి పట్టాయన్నారు. ఇలాంటి దోపిడీ జరగకుండా ఉండేందుకే ఈ జ్యుడిషియల్‌ బిల్లని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top