2019 ఎన్నికలే టార్గెట్‌గా..

2019 Elections as Target - Sakshi

     పించన్లు, ఇళ్లు, సంక్షేమ పథకాలపై కాంగ్రెస్‌ సమాలోచనలు

     గాంధీభవన్‌లో జీవన్‌రెడ్డి కమిటీ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ఎజెండాగా, 2019 ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు, ఇళ్లు, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని, ఈ కోణంలో లోతైన అధ్యయనం చేసి ఎన్నికల హామీలను తయారు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో 42 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఈ కమిటీ శుక్రవారం గాంధీభవన్‌లో భేటీ అయి రానున్న ఎన్నికలలో అనుసరించాల్సిన ‘సంక్షేమ’వ్యూహంపై చర్చించింది. సంక్షేమ పథకాల అమలు విషయంలో గత ప్రభుత్వాలకంటే ఎంతో మెరుగ్గా ఉండాలని, అందుకు  అన్ని వర్గాల ప్రజలను పరిగణనలోకి తీసుకుని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత  ఓ నివేదికను తయారుచేయాలని నిర్ణయించింది. వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, విద్యార్థులు, రోగులు, మహిళలు, నిరుద్యోగుల విషయంలో అమలు చేయాల్సిన పథకాలపై చర్చించిన కమిటీ, ఏప్రిల్‌ నెల మొదటివారంలో పార్టీకి తన నివేదికను అందించనుంది. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు హర్కర వేణుగోపాల్, నిరంజన్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top