సానుభూతికే మొగ్గు

Odisha CM Naveen Patnaik gives Bijepur ticket to Ritarani Sahu

 బిజేపూర్‌ ఉపఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి రీతా సాహునే

స్పష్టం చేసిన బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌

నిరాశలో పార్టీ ఉపాధ్యక్షుడు

భువనేశ్వర్‌: పశ్చిమ ఒడిశాలోని బర్‌గఢ్‌ జిల్లా బిజేపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉప ఎన్నికలో అధికార పక్షం బిజూ జనతా దళ్‌ అభ్యర్థిత్వం పట్ల నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బిజేపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉపఎన్నికలో విజయ సాధనకు సానుభూతే విజయసోపానంగా  ప్రధాన రాజకీయ పక్షాలు భావించాయి. అయితే ఈ క్రమంలో అధికార పక్షం బిజూ జనతా దళ్‌ నిర్ణయించి తొలివిజయం సాధించింది. దివంగత నాయకుల కుటుంబీకుల్ని తమ పార్టీలో విలీనం చేసుకుని వారినే అభ్యర్థులుగా బరిలోకి దింపుతున్నట్లు కూడా బహిరంగపరిచింది. ఈ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సుబొలొ సాహు భార్య రీతా సాహు పోటీ చేస్తారని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సోమవారం ప్రకటించారు. ఆమె అభ్యర్థిత్వం పట్ల రెండు రోజులుగా అధికార పక్షం బిజూ జనతా దళ్‌ శిబిరం నుంచి ప్రసారమైన భిన్నాభిప్రాయాలు పార్టీ శ్రేణులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆమె భర్త, కాంగ్రెస్‌ అభ్యర్థిగా తిరుగులేని విజయాల్ని సాధించి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా జీవించారు. ఆయన మరణానంతరం కుటుంబీకులు అనుచరులతో కలిసి అధికార పక్షం బిజూ జనతా దళ్‌లో చేరినట్లు శనివారం ప్రకటించారు. దీంతో రాజకీయ వాతావరణం అకస్మాత్తుగా మలుపులు తిరిగింది. పార్టీ ఫిరాయించి బీజేడీలో చేరిన వారిని బిజేపూర్‌ నియోజకవర్గం  ఉపఎన్నిక అభ్యర్థిగా ఖరారు చేయనట్లు బీజేడీ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ ప్రసన్న కుమార్‌ ఆచార్య ఆదివారం ప్రకటించడంతో దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తాజా ప్రకటన చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో పార్టీలో ఎటువంటి అసంతృప్తివాదం లేనట్లు ఎంపీ ప్రసన్న ఆచార్య కూడా సోమవారం ప్రకటించారు.

ఎందరో ఔత్సాహికులు
పశ్చిమ ఒడిశా బర్‌గఢ్‌ జిల్లా బిజేపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత కీలకం. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం  కాంగ్రెస్‌ కంచుకోటగా వెలుగొందింది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ కోటను కైవసం చేసుకునేందుకు పలు పార్టీలు ఉరకలేస్తున్నాయి. అంతకంటే ఉత్సాహంగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించడంలో మజా వేరుగా ఉంటుందని ప్రముఖ రాజకీయ పార్టీల నుంచి పలువురు ఔత్సాహిక అభ్యర్థులు టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. అధికార పక్షం బిజూ జనతా దళ్‌ శిబిరంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆ పార్టీ బర్‌గఢ్‌ జిల్లా పర్యవేక్షకుడు, సిటింగ్‌ మంత్రి ప్రఫుల్ల మల్లిక్‌ ప్రకటించారు. ఇంతలో పార్టీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ రీతా సాహును  గత ఎన్నికల్లో అధికార పక్షం టికెట్‌తో బిజూ జనతా దళ్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ప్రసన్న ఆచార్య బిజేపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. స్వల్ప తేడాతో విజేతకు సింహ స్వప్నంగా నిలిచారు. సిటింగ్‌ ఎమ్మెల్యే అకాల మరణంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయింది. ఈసారి పోటీ చేసి తన సత్తా చాటుకోవడం తథ్యమని భావించిన డాక్టర్‌ ప్రసన్న ఆచార్యకు ఆశాభంగం కలిగినట్లు పరోక్ష సంకేతాలు లభిస్తున్నాయి. రీతా సాహును తప్పించి తాను పోటీ చేసేందుకు ఆయన చేసిన గిమ్మిక్కులు కలిసి రాలేదు. టికెట్‌ ఖరారుపట్ల ఆయన చేసిన వ్యాఖ్యలకు స్పందించిన బీజేడీ అధ్యక్షుడు 24 గంటలు పూర్తి కాకుండా ఘాటుగా స్పందించి ప్రసన్న ఆచార్య దూకుడుకు కళ్లెం వేశారు. శనివారం నుంచి ప్రతి 24 గంటలకోసారి బిజేపూర్‌ రాజకీయ ముఖచిత్రం ఆకస్మిక మార్పులతో రాష్ట్ర రాజకీయాల్లో తళుక్కుమంటోంది. 

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top