అహంకారానికి మూల్యమిది!

అహంకారానికి మూల్యమిది! - Sakshi


స్వయంగా ముఖ్యమంత్రే పుష్కర ఏర్పాట్లన్నీ సమీక్షించారని అధికార పార్టీ శాసనసభ్యులే చెబుతున్నారు. మిత్రపక్షం బీజేపీ తరఫున మంత్రివర్గంలో దేవాదాయ శాఖను నిర్వహిస్తున్న మాణిక్యాలరావుకు కూడా ఈ పుష్కరాల ఏర్పాట్లలో ఎటువంటి భాగస్వామ్యమూ లేనట్టున్నది. ఆయనే స్వయంగా ఈ విషయంలో తన అసంతృప్తిని మీడియా ముందు వెల్లడించారు. ఓ అఖిల పక్ష కమిటీ లేదు. అన్నీ తానే అయి చెయ్యబోతే ఇవ్వాళ ఇంతమంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందన్న విషయం ముఖ్యమంత్రి ఇప్పటికైనా గమనించాలి.

 

కృష్ణా జిల్లా ముసునూరు తహసిల్దార్ వనజాక్షి తనకు జరిగిన అవమా నాన్ని మరచిపోయి మళ్లీ మామూలుగానే ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇసుక మాఫియా వ్యవహారంలో అధికార పార్టీ శాసనసభ్యుడే దగ్గరుండి తన మీద దాడి చేయించాడని తెలిసీ కమిటీ ఏర్పాటుకు ఆమె, ఉద్యోగ సంఘ నాయకత్వం ఎందుకు ముఖ్యమంత్రి ఎదుట గంగిరెద్దుల్లా తలలు ఊపి వచ్చారో మాట్లాడుకోవాలి. దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభా కర్ తాజాగా ఎవరిని బెదిరించాలా, ఎవరిని తన్నించాలా అని ఆలోచిస్త్తు న్నాడు. మీడియా ముందుకు వచ్చి ‘అవును, నేను దురుసుగానే ప్రవర్తిస్తాను. నా మీద బోలెడు కేసులు ఉన్నాయి.

 

 నా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు గతంలోనే రౌడీ షీట్ తెరిపించాడు!’ అని బరితెగించి మాట్లాడిన ప్రభాకర్‌ను ప్రభుత్వ విప్ పదవిలో నుండి తొలగించలేని, కనీసం మందలిం చలేని బలహీనస్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నారో కూడా మాట్లాడుకోవాలి. శాసనసభ్యురాలు కూడా అయిన కూతురు అఖిలప్రియ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులను మందలించినందుకే ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీస్ చట్టం కింద జైలుకు వెళ్లి వచ్చిన ప్రతిపక్ష శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఇంకా ఆ షాక్‌లో నుండి బయట పడనేలేదు. భూమా నాగిరెడ్డి, చింతమనేని ప్రభాకర్ ఇద్దరూ శాసనసభ్యులే. మరి ట్రీట్‌మెంట్‌లో ఈ తేడా ఏమిటీ అనే అంశాన్నీ చర్చించవలసిందే. మరో పక్క, ఈ చట్టం ఎన్ని పోరా టాలు చేస్తే, ఏ ప్రయోజనం కోసం వచ్చింది? ఏ ప్రయోజనాల కోసం దుర్వి నియోగం జరుగుతున్నది? అన్న విషయాలు కూడా ఉద్ధృత స్థాయిలో చర్చకు రావాలని దళిత మేధావులు ఆశిస్తున్నారు. ఇది జరగాల్సిందే కూడా.

 

 రాష్ర్టమంతా చెత్తమయమై, అంటురోగాల పాలవుతామేమోనని జనం బెదిరిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం ఆ దుర్వాసన తమ నాసికాపుటాలకు సోకకుండా గోదావరిలో పుష్కరస్నానాల పేరిట మునకలేస్తున్నది. తాజా విదేశీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్‌లో పర్యటించి వచ్చారు. మీ విలాసవంతమైన కార్యాలయాలకూ, నివాసా లకూ, ప్రయాణాలకూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ మున్సిపల్ కార్మి కుల కనీస కోర్కెలను పట్టించుకోకుండా ఎట్లా ఉంటారని ప్రశ్నించాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో గతవారం జరిగిన ఈ విషయాలన్నీ మాట్లాడుకోవాలి.

 

మహోపద్రవమిది

కానీ వీటన్నిటినీ వెనక్కు నెట్టేస్తూ గోదావరి పుష్కరాల ప్రారంభవేళ ఒక మహా ఉపద్రవం జరిగింది. పవిత్ర పుష్కర స్నానాలు చెయ్యడానికి రాజ మండ్రి వచ్చిన భక్తులు 30 మంది వరకు తొక్కిసలాటలో మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునంటున్నారు. సునామీ వచ్చి ఈ 30 మం ది కొట్టుకుపోలేదు. చార్‌ధామ్‌కు హఠాత్తుగా వచ్చిన వరదల వంటి ఘటన కూడా కాదు. మానవ తప్పిదం ఈ 30 మంది అమాయకుల ప్రాణాలను బలి గొన్నది. రూ. 1,600 కోట్లు కేటాయించి, అట్టహాసంగా జరప తలపెట్టిన ఈ భారీ కార్యక్రమంలో ఏర్పాట్లు సరిగా లేవని ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. సాక్షాత్తూ రాష్ర్ట ముఖ్యమంత్రి ఈ ఏర్పాట్లమీద తీవ్రఅసంతృప్తినీ, ఆగ్రహాన్నీ వ్యక్తం చే శారు. ఏర్పాట్లు సరిగా లేవనీ, స్థానిక అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చేటట్టు ఉన్నారనీ మీడియా హెచ్చరించింది.

 

 ఇంకెవరికీ ఎటువంటి బాధ్యతలూ అప్పచెప్పకుండా స్వయంగా ముఖ్యమంత్రే పుష్కర ఏర్పాట్లన్నీ సమీక్షించారని అధికార పార్టీ శాసన సభ్యులే చెబుతున్నారు. మిత్రపక్షం బీజేపీ తరఫున మంత్రివర్గంలో దేవాదా యశాఖను నిర్వహిస్తున్న మాణిక్యాలరావుకు కూడా ఈ పుష్కరాల ఏర్పా ట్లలో ఎటువంటి భాగస్వామ్యమూ లేనట్టున్నది. ఆయనే స్వయంగా ఈ విష యంలో తన అసంతృప్తిని మీడియా ముందు వెల్లడించారు. ఓ అఖిల పక్ష కమిటీ లేదు. పోనీ తన పక్షంలోనైనా పని విభజన లేదు. అన్నీ తానే అయి చెయ్యబోతే ఇవ్వాళ ఇంతమంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందన్న విష యం ముఖ్యమంత్రి ఇప్పటికైనా గమనించాలి. ఆయన ఎంతసేపూ తన రాజ కీయ అనుభవాన్ని గుర్తు చేస్తూ కూర్చుంటే కుదరదు. ఒక సినిమాలో హీరో వేషం వేస్తున్న నటుడు ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ!’ అని; ఇంకో సిని మాలో మరో నటుడు ‘పచ్చీస్ సాల్ సే చార్మినార్ క నే బైట్ కె చాయ్ పీ రహాహూ’ అని ‘నాకే చెపుతారా?’ అన్నట్టు కొట్టే డైలాగ్‌లు గుర్తొస్తాయి.

 

 ఈ ఘోర ప్రమాదం మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప స్పందన మొత్తం సిగ్గుపడే విధంగా ఉం ది. కొన్ని కోట్ల మంది హాజరవుతున్న ఇలాంటి సందర్భాలలో ఇవి మామూలే అన్నట్టుగా మాట్లాడారాయన. కోట్లమంది వచ్చి పోతున్నప్పుడు, 30 మంది చస్తే ఒక లెక్కా అన్నట్టే ఉంది ఆయన తీరు. ఒక్క ప్రాణం పోయినా ప్రభు త్వాలు సిగ్గుతో తలదించుకోవాలి కానీ, ఇంకా ఏదో ఘనకార్యం చేసినట్టు మీడియా ముందు మాట్లాడటం అసహ్యంగా ఉంటుంది. తలలు దించుకుం టారా, పదవులకు రాజీనామాలు చేస్తారా అనేది వాళ్ల ఇష్టం.

 

 కమిటీతో కాలయాపన

 మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల వంతున నష్ట పరిహారం చెల్లి స్తామనీ, పుష్కరాలు అయిపోయాక విచారణకు కమిటీ వేస్తామనీ ముఖ్య మంత్రి ప్రకటించారు. కమిటీలు వేసి కాలం వెళ్లబుచ్చడం అలవాటుగా మారి పోయింది ప్రభుత్వానికి. జరిగిందేమిటో కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తుంటే బాధ్యుల మీద తక్షణ చర్యలు ఉండవు కానీ, ఎప్పుడో పుష్కరాలయ్యాక కమి టీ వేసి విచారిస్తామనడం ఎంత దుర్మార్గం! ఎంత బాధ్యతా రాహిత్యం?! కాగా, ఈ దుర్మరణాల గురించి మిగిలిన మీడియా ప్రసారాలు చేస్తుంటే, ఒక చానల్ మాత్రం పుష్కరాలకు ప్రభుత్వం చేసిన అద్భుతమైన ఏర్పాట్ల గురించి గొంతు చించుకోవడం ఎంత అన్యాయం?

 

లక్షలాది మంది హాజరయ్యే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేశంలో చాలా జరిగుంటాయి. కుంభమేళాలు, మహా కుంభమేళాలు, పుష్క రాలు ఇంకా అనేకం జరుగుతాయి. ఇటువంటి కార్యక్రమాలలో ప్రభుత్వాలు ఎంతవరకు కల్పించుకోవాలి, ఎంతవరకు ప్రభుత్వం బాధ్యత వహించాలి అనే విషయంలో స్పష్టతలేక పరిస్థితి గందరగోళంగా తయారవుతున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ గోదావరి పుష్కరాలు జరుగు తున్నాయి. ఇది ఒక మతానికి- హిందూ మతానికి సంబంధించిన కార్య క్రమం. దేశంలో అత్యధిక సంఖ్యాకులు హిందువులు కాబట్టి, వారి ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవించవలసిందే. సౌకర్యాలు కల్పించాల్సిందే.

 

 నది అంతా పుణ్యతీర్థం కాదా?

 పుష్కరాలకు హాజరయ్యే లక్షలాది మంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్ట ప్రభుత్వాలూ పుష్కరాల కోసం ఏర్పాట్లు చేస్తున్న, కోట్లాది రూపా యలు ఖర్చు చేస్తున్న చోట్లనే గోదావరి పారడం లేదు. వేలాది కిలోమీటర్‌ల పొడవునా పారుతూ ఉంటుంది. ఫలానా రాజమండ్రిలోనో, ఫలానా ధర్మపురి లోనో పారే గోదావరిలోనే పుష్కర స్నానాలు చేయాలని ఎక్కడా లేదు. గోదా వరి ఎక్కడైనా గోదావరే. ఎక్కడ పారినా పవిత్రతలో ఏ తేడా ఉండదని ప్రభు త్వాలు ప్రజలకు చెప్పాల్సిందిపోయి, ఒక ముఖ్యమంత్రి రాజమండ్రిలో, ఇంకో ముఖ్యమంత్రి ధర్మపురిలో స్నానాలు చేసి అట్టహాసంగా పుష్కరాలను ప్రారంభించడం ఎంత మాత్రం సరికాదు. ప్రజాస్వామ్యంలో పాలకులు వీలైనంత వరకు ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.

 

 ఈ వాదనకు బోలెడు కారణాలు చెప్పొచ్చు. ఈ రోజు రాజమండ్రి దుర్ఘటన ఇందుకు ఒక ఉదాహరణ. అన్ని వసతులూ ఉన్న ఘాట్లు ప్రముఖుల కోసం కేటా యించి, సామాన్య భక్తులను గంటల కొద్దీ ఆపి, ఒక్కసారిగా వదిలినందున తొక్కిసలాట జరిగి జనం చనిపోయారు. పొద్దున్నే ముఖ్యమంత్రులకు వీటిని ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత పుష్కర స్నానాల మీద నమ్మకం ఉంటే తరువాత ఎప్పుడో రద్దీ లేని సమయాలలో గప్‌చుప్‌గా వెళ్లి మొక్కులు తీర్చుకోవచ్చు కదా! మతాన్నీ, మత విశ్వాసాలనూ తమ రాజ కీయ ప్రయోజనాల కోసం పాలకులు వాడుకోవడం వల్లనే ఇదంతా.



ప్రభువులు తమ రాజకీయాలనూ, తమనూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమా లకు దూరంగా ఉంచి, విధులూ, బాధ్యతలు వివరించి యంత్రాంగాన్ని వది లేస్తే సజావుగా జరిగిపోతుంది. లేదంటే ఇటువంటి ఘటనలు తప్పవు. ఇద్దరు ముఖ్యమంత్రులకు సరైన సలహాలు ఇచ్చేవారు కూడా చుట్టూ ఉన్నట్టు లేరు. అధికారికంగా నియమితులైన సలహాదారులు వారి విధి సక్రమంగా నిర్వర్తిస్తున్నట్టు లేదు. ముఖ్యమంత్రులు ఎవరి మాటా వినని సీతయ్యలైతే మాత్రం ప్రజలకు, ప్రజాస్వామ్యానికీ నష్టం.

 - దేవులపల్లి అమర్

 datelinehyderabad@gmail.com


 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top