భూమి చెప్పినా ఆకాశం నమ్మక... పదేళ్ళు! | Sakshi
Sakshi News home page

భూమి చెప్పినా ఆకాశం నమ్మక... పదేళ్ళు!

Published Sun, Sep 10 2017 1:32 AM

భూమి చెప్పినా ఆకాశం నమ్మక... పదేళ్ళు!

సందర్భం

ఎల్తైన కొండల వరుసలు, కుప్పబోసినట్లున్న గుబురు చెట్ల మధ్య నలభై యాభై ఇళ్ళు. పొద్దున్నే గుట్టలు మిట్టలు ఎక్కుతూ పోడు వ్యవసాయానికి వెళ్ళే గిరిజనులు. ఊరు, సంతలు, కొర్రకొత్త వంటి పండుగలు తప్ప వేగం అంటని నింపాది జీవితాలు. విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి గ్రామ పంచాయతీలోని వాకపల్లి, దుర్గమమైన అడవి ఒడిలో ఒదిగిన బిడ్డలాంటి ఊరు. పదేళ్ళ కిందట ఒక తెల్ల వారు జామున కూంబింగ్‌ పేరుతో వచ్చిన గ్రేహౌండ్‌ పోలీసులు సమీపంలోని పొలాల్లో పని చేసుకుంటున్న వారిని, ఇంట్లో ఉన్న బాలింతని, ఆమె తల్లిని, మొత్తం పదకొండు మంది కోదు గిరిజన మహిళలను, అత్యాచారం చేసారు.

బాధితులను అనకాపల్లి, విశాఖ మధ్య తిప్పుతూ ఉద్దేశపూర్వకంగా వైద్యపరీక్షలను ఆలస్యం చేయడం లాంటి చర్యలతో సాక్ష్యాలను రూపుమాపే ప్రయత్నాలు చేసారు. ‘భూమి చెబితే ఆకాశం నమ్మదా!’ అంటూ నినదించిన వాకపల్లి అత్యాచార బాధితుల వాదనని పరిగణనలోకి తీసుకుని 2012లో హైకోర్టు నిందితులను కేసు పరిధిలోకి తీసుకువచ్చింది.

మరో అయిదేళ్ళు గడిచాయి. సంచలనాత్మకమైన ఈ కేసులో ఇంతటి జాప్యాన్ని ప్రశ్నిస్తూ సత్వరం న్యాయాన్ని అందించాలని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో ఈ కేసు మళ్ళీ వార్తలలోకి వచ్చింది. ఈ సందర్భంలో బాధిత మహిళల ఇప్పటి స్వరాన్ని నలుగురికీ చేరవేయాలనే తలంపుతో ప్రరవే ఏపీ శాఖ వారిని కలసి మాట్లాడింది. పదేళ్ళు గడిచాక కూడా న్యాయం దొరకని బాధితులు ఎలా ఉంటారు? గద్గద స్వరాల తడిని కాలం పీల్చేసుకుంటుంది. వేడినీటి బుగ్గల్లా ఊరే కన్నీటిని అపనమ్మకం మింగేస్తుంది. బాధితులు కొట్లాడాలి, అరవాలి, దుఃఖించాలి, ఆగ్రహపు సెగతో రగులుతూ ఉండాలి. కానీ కాలం కర్కశమైనది. ఆగ్రహాన్ని ఆర్పేసి, నిర్లిప్తతని నల్లని మసిలా పూస్తుంది.

‘‘మమ్మల్ని కోర్టు నమ్మింది కనుక మేమూ కోర్టుని నమ్ముతాము’’. సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యల మీద వారి స్పందన ఇది. అత్యాచారం చేసిన పోలీసులను శిక్షించాలని, అప్పటివరకూ ఏ పరి హారాన్ని తీసుకోబోమని, వారికి శిక్ష పడిన తర్వాత ఇక వారి దయ అని ఒక బాధితురాలు అంది. మూడునెల్ల కిందట పోలీ సులు ఇక్కడికి వచ్చి, పిల్లల చదువులకు, ఇతర సౌకర్యాలకు సాయం చేయ డం ద్వారా న్యాయం చేస్తామని చెప్పారని, ‘అన్యాయం చేసినవాళ్ళే చాక్లెట్లు పట్టుకొచ్చి న్యాయం చేస్తామంటే ఆ న్యాయం మాకు అక్కరలేదని’ తెలుగు, కువి భాషల యాసతో నిక్కచ్చిగా చెప్పారు.

అత్యాచారం జరిగి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించుకుని విశాఖ నుంచి వాకపల్లికి తిరిగి వెళ్లిన మహిళలని గ్రామంలోకి రానివ్వలేదు. తప్పు కడితే తప్ప గడ్డ (ఏరు)లోకి, కులంలోకి కలుపుకోమని గ్రామపెద్దలు చెప్పారు. అత్యాచారానికి గురైన ప్రతి మహిళ ఇంటి నుంచి ఒక ఎద్దుని తప్పు కింద చెల్లించవలసి వచ్చింది. దాంతో పాటు, కోళ్ళు, కల్లువంటివి కూడా. చివరికి వారి కాపురాలు చక్కబడటానికి అయిదేళ్ల పైన సమయం పట్టింది. అడపాదడపా సంతలకి వెళ్ళినపుడు సిగ్గుతో చచ్చిపోతున్నామని, తమని ‘పోలీసుల పెళ్ళాలు’ అంటూ అవహేళన చేస్తారని ఆ సిగ్గుతోనే అనారోగ్యం పాలై ఒక బాధితురాలు చనిపోయిందని చెప్పారు. పాడేరు సెంటర్లో ఉండే గిరిజనేతర కులాలకు చెందిన కొందరు వ్యాపారులతో యథాలాపంగా మాట్లాడినపుడు, వాళ్ళ మొహాలు, వాళ్ళ అందచందాలు చూసి ఏ పోలీసైనా ఆ పని చేస్తాడా! ఏదో కుర్రోళ్ళు ఓవర్‌ యాక్షన్‌ చేసుంటారు అన్నారు. కొన్ని దశాబ్దాలుగా అత్యాచార కేసుల్లో విన్న పడికట్టు వాదన ఆ మైదాన ప్రాంతపు దళారీల నోటి వెంట కసిగా బైటకి వచ్చింది.

వాకపల్లి ఘటన జరిగిన కొత్తల్లో నిజనిర్ధారణకి వెళ్ళినవాళ్లకి పది పన్నెండేళ్ళ ఒక కుర్రవాడు గుర్తుండే ఉంటాడు. నల్లగా పొట్టిగా చురుకైన చూపులతో రెండు చేతులూ కట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ తను చూసిన దృశ్యాలను నిర్భయంగా, న్యాయం కోసం తపనతో చెబుతూనే ఉండేవాడు. ఈ కేసులో అతనొక్కడే ప్రత్యక్షసాక్షి. తమ గ్రామం మహిళలకి త్వరగా న్యాయం జరగాలని కోరుకున్నాడు. చదువు కోసం గిరిజన సంక్షేమ వసతి గృహంలో చేరాడు. ఇక ఆ తర్వాత ఇంటికి రాలేదు. అందరికీ న్యాయం కోసం పోరాడాలని దళంలో చేరిపోయాడు. కలలు నెరవేరడానికి అక్కడ ఏం తపన పడ్డాడో, గత ఏడాది మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్లో అతడిని చంపివేశారు. వాకపల్లి ఘటనకి ఏకైక ప్రత్యక్షసాక్షి వి. డానియెల్‌ అలియాస్‌ దాసురాం మరిలేడు.

ఆర్నెల్లలోపు కేసు విషయం ఒక కొలిక్కి రావాలని సుప్రీం కోర్టు చెప్పినా ఇంతవరకూ కదలిక లేదు. ఇటువంటి కేసుల విషయంలో ప్రత్యేకమైన న్యాయ ప్రక్రియ ఉంటుంది. పాడేరులో స్పెషల్‌ కోర్టు ఏర్పాటు చేసి దానికి జడ్జి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా మహిళలనే నియమించాలి. చాలా పరిమితమైన గిరిజనుల జీవన విధానంలోకి కొత్త విషయాలు చేరినపుడు జీర్ణించుకోవడానికి వారికి చాలా సమయం పడుతుంది. కనుక వారి వ్యక్తీకరణ పద్ధతుల మీద కోర్టుకి అవగాహన కన్సర్న్‌ ఉండాలి. వాకపల్లి నుంచి పాడేరుకి రావడానికి వారికి అందవలసిన సదుపాయాలను జిల్లా యంత్రాంగం సమకూర్చాలి. ముఖ్యంగా పదేళ్ళ ఆలస్యాన్ని ఆర్నెల్ల గడువులో సరిదిద్దే ప్రయత్నం నిజాయితీగా చేయాలి.



డా. కేఎన్‌. మల్లీశ్వరి
వ్యాసకర్త కార్యదర్శి, ప్రరవే (ఏపీ)
ఈ–మెయిల్‌ :malleswari.kn2008@gmail.com

 

Advertisement

తప్పక చదవండి

Advertisement