శ్రీకృష్ణదేవరాయ కళామందిరానికి చేయూత! | Srikrishnadevaraya kalamandir under the Telugu vigana samithi | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణదేవరాయ కళామందిరానికి చేయూత!

Mar 30 2016 12:54 AM | Updated on Sep 3 2017 8:49 PM

బెంగళూరు తెలుగు ప్రజల భాషా సాంస్కృతుల వికాసానికి దాదాపు 65 సంవత్సరాల చరిత్ర ఉంది.

బెంగళూరు తెలుగు ప్రజల భాషా సాంస్కృతుల వికాసానికి దాదాపు 65 సంవత్సరాల చరిత్ర ఉంది. దివంగతులు డా. తెన్నేటి విశ్వనాధం, డా. సూరి భగవంతం, డా. అన్నారావు ఈ నగరంలో స్థాపించిన తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయ కళామందిరాన్ని నిర్మిస్తు న్నారు. దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ కళా మందిరానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రూ. 65 లక్షలు ఇచ్చింది. ఇక తమ ఎంపీ నిధుల నుంచి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రూ. 25 లక్షలు ఇవ్వగా, ఒక ప్రముఖ సినీ నటి, శాసన మండలి సభ్యురాలు మరో రూ.25 లక్షలను ఇచ్చారు. కాగా, తెలుగు విజ్ఞాన సమితి దాతల నుంచి 50 లక్షల విరాళాలు సేకరించి నిర్మాణ పనులు చేపట్టారు.
 
 తెలుగు విజ్ఞాన సమితి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తుఫాను బాధితులకు తన శ క్తిమేరకు ఆర్థిక సహాయం అందించింది. 1977లో దివిసీమ బాధితులకోసం రూ.20 లక్షలు, 1996లో ఏపీ తుఫాను బాధితుల సహాయార్థం 6 కోట్ల రూపాయలను అందించింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి మేము సైతం అంటూ రూ.25 లక్షలను తెలుగు విజ్ఞాన సమితి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అందించింది. తెలుగు విజ్ఞాన సమితి గత ఏడాది నిర్వహించిన ఉగాది ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమితి తలపెట్టిన కళామందిర నిర్మాణానికి చేయూతను ఇస్తామని వాగ్దానం చేశారు. సమితి విజ్ఞప్తి మేరకు ఈ కళామందిర నిర్మాణానికి రూ.50 లక్షలను ఇవ్వాలని ఏపీ సాంస్కృతిక శాఖ సిఫార్సు చేసింది. శ్రీకృష్ణదేవరాయ కళామందిరంగా నామకరణం చేసి డా॥రామారావు దివ్యస్మృతికి అంకితం చేస్తున్నాము. ఎన్టీఆర్‌కు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న విశిష్ట అభిమానులను దృష్టిలో ఉంచు కుని ఈ చారిత్రాత్మకమైన కళామందిరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పక తగు సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి.
 
 ఈ సందర్భంగా డా. టి . సుబ్బరామిరెడ్డి దాతృత్వ ఔదా ర్యాన్ని తప్పక గుర్తించుకోవాలి. నిరుడు జరిగిన తెలుగు విజ్ఞాన సమితి బెంగళూరు ఉగాది ఉత్సవాలలో పాల్గొన్న ఆయన కళామందిరానికి విరాళం ఇస్తానని వాగ్దానం చేశారు. ప్రముఖ చలనచిత్ర దర్శకులు పద్మశ్రీ డా. కె. విశ్వనాథ్, ప్రముఖ నటి డా. జయసుధలకు శ్రీ కృష్ణ దేవరాయ పురస్కారం ప్రదానం చేసిన సభలో ఇచ్చిన వాగ్దానం మేరకు టి. సుబ్బరామిరెడ్డి.. శ్రీకృష్ణ దేవరాయ కళామందిరం కోసం 50 లక్షల రూపాయల చెక్కును తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులకు అందించారు. ఈ ఔదార్యానికి, అందించిన భూరి విరాళానికి గాను తెలుగు విజ్ఞాన సమితి సంస్థ తరపున, కర్ణాటక రాష్ట్ర తెలుగు ప్రజల తరపున డా.టి. సుబ్బరామిరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.    
 -    డా॥ఎ.రాధాకృష్ణరాజు
 తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు, బెంగళూరు
 
 భళా బాహుబలి
 రాజమౌళి మానసపుత్రిక ‘బాహుబలి’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలబడటం తెలుగు సినీ అభిమానులకు గర్వకారణం. ఎనభై ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో మరుపురాని మధుర ఘట్టం ఈ విజయంతో ఆవిష్కృతమైంది. ఆరు దశాబ్దాలకుపైగా తెలుగు చిత్ర సీమకు అందని ద్రాక్షలా ఉన్న జాతీయ అవార్డునును బాహుబలి సాధించి, తెలుగు సినీ రంగ స్వప్నాన్ని సాకారం చేసింది. హిందీ తర్వాత అత్యధిక చిత్రాలను నిర్మిస్తున్న పరిశ్రమగా పేరున్నప్పటికీ మన సినిమాలు జాతీయస్థాయి ప్రమాణాలతో కూడా ఉండటం లేదన్న విమర్శకులకు బాహుబలి సరైన సమాధానం.
 
 రాజమౌళి దర్శక ప్రతిభ, నటీనటుల అద్భుత నటన, అద్భుతమైన గ్రాఫిక్స్ ఈ సినిమా విజయానికి మూల కారణాలు. సగటు ప్రేక్షకుడిని ఊహాలోకంలో విహరింపజేయగల బలమైన మాధ్యమం సినిమా. ఆచంద్రతారార్కం గుర్తుంచుకునే కళాఖండాలు అరుదుగానే రూపుదిద్దుకుంటాయి. బాహు బలి అలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సాంకేతిక విలు వలతో చిత్రాలు నిర్మిస్తే.. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగలిగితే కనకవర్షంతోపాటు అవార్డులను కూడా సునాయాసంగా సాధించ వచ్చని బాహుబలి నిరూపించింది. ఇక మనుషుల మధ్య అడ్డుగోడగా ఉన్న కులమతాల కంచెల కూల్చివేతను ఆకాంక్షించిన కంచె తెలుగులో ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావటం శుభపరిణామం.     
 -    బట్టా రామకృష్ణ దేవాంగ, సౌత్‌మోపూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement