
‘శిశుమందిర్’ చింతనతో పాలనా?
ప్రస్తుత బీజేపీ నాయకులు స్వయంసేవ కులు, ‘శిశుమందిర్’ను మనసున నిలుపుకున్న విద్యార్థులే.
జాతిహితం
ప్రస్తుత బీజేపీ నాయకులు స్వయంసేవ కులు, ‘శిశుమందిర్’ను మనసున నిలుపుకున్న విద్యార్థులే. సంఘ్ పీఠాధిపతులు ప్రభుత్వానికి ‘‘క్లాసు తీసుకోవడం’’ కోసం ఢిల్లీకి రావడం, రాజ్యాంగేతర అధికారాలను ప్రదర్శించడం విస్మయకరమే కాదు నిజం కూడా. మోదీ నిస్సందేహంగా స్వయంసేవకుడే. అయినా ఆయన తన స్వాభావిక రాజకీయ ప్రవృత్తికి కట్టుబడి ఉండేట్టయితే... ఇలా తన అధికారాన్ని కించపరచడాన్ని అనుమతించే బాపతు కాదు. తన ఆధిక్యాన్ని నిరూపించుకుంటారు. అదే జరిగితే మన ముందున్నది ఆసక్తికర మైన కాలమే.
ఈ వారం ‘జాతిహితం’ రాయడానికి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఆసక్తికరమైన సందర్భం. ఈ రోజు ఉదయం నుంచీ ప్రభుత్వానికి సంబం ధించిన వారంతా... రాష్ట్రపతి నుంచి మానవ వనరుల మంత్రి వరకు అందరూ ఉపన్యాసాలు ఇవ్వడం చూశాం. తరగతి గదిలోకి వెళ్లేపాటి సర్కారీ అధికారం ఉన్న ప్రతి ఒక్కరూ ‘‘నేనూ టీచర్‌నే’’అనే కాల్పనికతను నిజం చేసుకోడాన్ని చూశాం. మహోపాధ్యాయులు, గురువులకు గురువు అయిన ఆర్‌ఎస్‌ఎస్ సరిగ్గా అదేసమయానికి... తమ శిష్యులు నడుపుతున్న ప్రభుత్వా నికి బహిరంగంగానే బోధించడం లేదా వాడుక భాషలో చెప్పాలంటే ‘‘క్లాసు తీసుకోవడం’’ ఈ సమయాన్ని మరింత సముచితంగా చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ -బీజేపీ సంబంధాల గురించి లేదా బీజేపీ ప్రభుత్వంపై ఆర్‌ఎస్‌ఎస్ ‘‘నైతిక’’ అధికారం రాజ్యాంగాన్ని తోసిరాజనడం గురించి చర్చలు ఉండనే ఉన్నాయి. దీనికీ, సోనియాగాంధీ ఎన్‌ఏసీ పెత్తనానికి పోలిక తేవడమూ ఉంది. అంతే కాదు, 50 ఏళ్ల క్రితం నాటి ఒక వాస్తవాన్ని నేను బడాయిగా చెప్పుకోడానికి కూడా తగు సందర్భం. ఆర్‌ఎస్‌ఎస్ నాకు చేసిన రెండు ఉపకారాల గురించి వెల్లడించాల్సిన సమయం కూడా. 1965-66లో నేను ఐదవ తరగతి చదువు తున్నప్పటి పాడుబడ్డ పాత ఫొటో ఒకటి నాదగ్గరుంది. అది నేను ‘సరస్వతీ శిశుమందిర్’లో చదువుతున్నప్పటిది. ఆర్‌ఎస్‌ఎస్ దేశవ్యాప్తంగా నడిపే పెద్ద పిల్లల విద్యామందిర్‌లు, సరస్వతి శిశుమందిర్‌లలో అది కూడా ఒకటి.
ఇంగ్లిష్ విద్యపై అనుమానమే కానీ...
ఆర్‌ఎస్‌ఎస్ నాకు చేసిన రెండు ఉపకారాల్లో ఒకదాన్ని ముందుగా చూద్దాం. ఆ స్కూలు ఢిల్లీ నుంచి ఆగ్రాకు వెళ్లే గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద హరియాణా లోని పాల్వాల్ అనే చిన్న పట్టణంలో (1962-63 నాటికి పెద్ద గ్రామమే) ఆర్‌ఎస్‌ఎస్ మొట్టమొదటగా ఆ స్కూలును స్థాపించింది. అంతవరకు అక్కడ స్కూలు లేకనే నేను, మా అమ్మ ఢిల్లీలోని మా అమ్మమ్మ వాళ్ల కుటుంబంతో కలసి ఉండే వాళ్లం. పాల్వాల్‌లో ఆ స్కూలు పెట్టడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ మా కుటుంబాన్ని ఒక్క దగ్గరికి చేర్చింది. నేను కిండర్ గార్డెన్ విద్యను ఇంగ్లిషు మాధ్యమంలో కాన్వెంట్‌లో మొదలెట్టినందుకు ఆ స్కూలు వాళ్లు తప్పుపట్టక పోగా మెచ్చి... ఒకటవ తరగతి నుంచి మూడవ తరగతికి, ఆ తర్వాత మూడు నుంచి ఐదో తరగతికి డబుల్ ప్రమోషన్లు ఇచ్చారు. అలా ఆ కాలంలో ఆర్‌ఎస్ ఎస్ నాకు గురువు కావడం మాత్రమే కాదు, 18 ఏళ్లకే డిగ్రీ సంపాదించేలా చేసింది. అయితే ముఖ్యమైన విషయం నా డబుల్ ప్రమోషన్లు కాదు. ఆర్‌ఎస్ ఎస్, దాని స్కూళ్లు హిందీ లేదా సంస్కృతానికి అనుకూలమైనవిగా, ఇంగ్లిషుకు వ్యతిరేకమైనవిగా ప్రసిద్ధి. అందుకే నా విషయంలో శిశుమందిర్ చూపిన ఆ ఆదరణ ఆశ్చర్యకరమైనది. ఇంగ్లిషు అంటే ద్వేషం, అనుమానం ఉన్నా, నా ఆర్‌ఎస్‌ఎస్ గురువుల్లో దానిపట్ల ఆరాధన కూడా ఉండేది. అప్పట్లో పంజాబ్‌లోని స్కూళ్లలో (పాల్వాల్ 1966 తర్వాత హరియాణాలో భాగ మైంది) హిందీ మాధ్యమమే ఉండేది. ఆరవ తరగతి వరకు ఇంగ్లిషు బోధించే వారే కారు. అయినా అంగ్రేజీలోని ప్రాథమిక పరిజ్ఞానాన్ని ప్రశంసించేవారు.
మా స్కూల్లో హిందీ, సంస్కృతం దండిగానే ఉండేవి. పాఠశాల ప్రార్థన పవిత్రమైన సరస్వతీ వందనంలో ఒక్క ముక్కా అర్థం కాక మేము మిగతా వారితో సన్నగా గొంతుకలిపి పాడేవాళ్లం. ఇక ఆ తదుపరి హెడ్ మాస్టర్ ఉప న్యాసం మరింత కఠిన పరీక్షాసమయంగా ఉండేది. ఆ చిన్న వయసులోనే మాకు గుడ్డులో అండము, శుక్లాలు కలసి ఉంటాయి కాబట్టి దాన్ని తినరాదని బోధించడం మాకు వికారమనిపించేది. అది ఎవరికైనా నచ్చిందా? అనేది నాకు అనుమానమే. మా ఇంట్లో మేం ఓ డ జను కోళ్లను మాంసం కోసం గాక, కేవలం గుడ్ల కోసమే పెంచేవాళ్లం.
గాంధీ, నెహ్రూలు లేని ‘స్వాతంత్య్రోద్యమం’
శాఖకు వెళ్లడం తప్పనిసరేమీ కాదు గానీ ప్రోత్సహించేవారు. అది జరిగేది మా ఇంటికి ఎదురుగానే కాబట్టి చూడటానికి, వినడానికి అప్పుడప్పుడూ వెళ్లేవాళ్లం. మేమింకా ఖాకీ నిక్కర్లు, బెల్టులు, లాఠీలు కొనుక్కోగలిగేటంత పెద్దవాళ్లం కాము. స్వయంసేవకులను చూసి మేం నవ్వేవాళ్లం, వాళ్ల గురించి డజన్ల కొద్దీ ఉన్న జోకులను నేనిప్పటికీ మరచిపోలేదు. ఈ ఉదారవాద కాలం లో సైతం అవి అచ్చువేయగలిగే బాపతు కావు. శాఖల్లో ఉత్తుత్తి ‘‘సింహం’’ ‘‘మేక’’ యుద్ధాలు జరిగేవి. భయం ఎరుగని కొద్దిపాటి సింహాలు సంఖ్యా బలం ఎంతో ఎక్కువగా ఉన్న జిత్తులమారి మేకలను నాశనం చేసేవి. వీటిలో ఏ జంతువు హిందువులకు, ఏ జంతువు ముస్లింలకు సంకేతాలో మీరే ఊహిం చొచ్చు. ఆసక్తికరమైన కథలు చెప్పడం కోసం ఎదురు చూసే వాళ్లం. హఖీఖత్ రాయ్ అనే కుర్రాడు తన తల తీసేసినా సరేగానీ పిలక మాత్రం కత్తిరించుకు నేది లేదని ముస్లిం నియంతకు ఎదురుతిరిగిన కథ. గురుగోవింద్ సింగ్, ఆయన కుమారుల త్యాగం, లాలా లజపతిరాయ్, భగత్‌సింగ్, సావార్కర్‌ల గురించి, స్వాతంత్య్రోద్యమంలో వారి పాత్ర గురించి పదే పేదే చెప్పేవారు. గాంధీ, నెహ్రూల గురించి... పటేల్ వ్యతిరేకించినా గానీ వారు ఎలా దేశ విభ జనను జరగనిచ్చారో చెప్పడానికి తప్ప ప్రస్తావించేవారే కారు. కానీ లాల్ బహదూర్‌శాస్త్రిని, ప్రత్యేకించి 1965 యుద్ధంతో ఆర్‌ఎస్‌ఎస్ స్వంతం చేసేసు కుంది. ఆ ఆర్‌ఎస్‌ఎస్ స్కూలు మమ్మల్ని బస్సులో ఢిల్లీకి ్రపధాని శాస్త్రిని కలు సుకోడానికి సైతం తీసుకుపోయింది. ‘‘గాయపడ్డ జవాన్ల’’ కోసం ఓ డజను పైజమాలను మా అమ్మ కుట్టి ఇవ్వగా వాటిని, మా ఇంటి పెరట్లో పెంచిన బచ్చలి కూరను శాస్త్రీజీకి ఇవ్వడానికి వెళ్లడం నేను మరువలేదు.
‘సంఘ్’ చింతన నుంచి ముచ్చటగా మూడు
ఆర్‌ఎస్‌ఎస్ గురించి, దాని ఆలోచనా విధానం గురించి చాలానే తెలిసినా, నేను మూడు విషయాలనే ప్రత్యేకించి చెబుతాను. ఒకటి, మా విద్యాబోధ నలో స్వాతంత్య్రోద్యమానికి ప్రాధాన్యం ఎక్కువగా ఉండేది. అయితే భగత్ సింగ్, ఆజాద్, సావార్కర్, నేతాజీల గురించి తప్ప మరే జాతీయ నాయకుల ప్రస్తావనా ఉండేదే కాదు. ఇక సంగీతం తరగతుల్లో నేర్పేవన్నీ ఆ రోజుల్లో గొప్పగా ప్రాచుర్యంలో ఉన్న మన్నాడే అమర గీతం ‘‘నిర్బల్ సే లడాయీ బల్వాన్ కీ, యె కహానీ దియే కి ఔర్ తూఫాన్ కీ’’ (బలవంతునితో బల హీనుల పోరాటం, తుపాన్‌ను తట్టుకుని నిలిచిన దీపం) బాణీలోని దేశభక్తి గీతాలే. బ్రిటిష్ వారిని భారతీయులు ఎలా తరిమికొట్టారో చెప్పేవే. అయితే ఎక్కడా గాంధీ, నెహ్రూల ఊసే ఎత్తేవారు కారు.
రెండవది, ఆర్‌ఎస్‌ఎస్ చింతనలో ఇంగ్లిషు వాళ్లను, విదేశస్తులను ఖం డించడం ఎంతున్నా, ద్వేషించేది, భయపడే దీ మాత్రం ముస్లింలకే. దేశ విభ జన సమయంలో జరిగిన ఘోర అత్యాచారాలు, కశ్మీర్ ముప్పు లేదా వాస్తవా ధీన రేఖ, ముస్లిం పాలకులు హిందువులు, సిక్కులపై చేసిన దుర్మార్గాల కథలు ఉండేవి. ఈ వారం మొదట్లో ఔరంగజేబుపై తలెత్తిన వివాదంలో పదే పదే అతడు సిక్కుల తొమ్మిదవ గురువు గురు తేజ్ బహదూర్ తలను ఖండిం చాడని పదేపదే చెప్పుకొచ్చారు. అతని తండ్రి జహంగీర్ గురించిన ప్రస్తావన అసలుకే లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అతగాడు సిక్కుల ఐదవ గురువు అర్జున్‌దేవ్‌ను వేడిగా కాలిన రేకుల కింద పడేసి, శరీరమంతా వేడి ఇసుకను పోసి చిత్రహింసలకు గురిచేస్తూ, మెల్లగా చంపించాడు. ఔరంగ జేబును రాక్షసుడ్ని చేసినవారు జహంగీర్ విషయంలో నోరెత్తలేదు ఎందుకా అని ఒక్క క్షణం ఆలోచించాను. దాంతో నాకు ఆర్‌ఎస్‌ఎస్, ప్రభుత్వంతో జరుపుతున్న ‘‘సమన్వయ’’ సమావేశం, 50 ఏళ్ల క్రితం నాటి యుద్ధం స్ఫుర ణకొచ్చి... నన్ను నా శిశుమందిర్ కాలానికి తీసుకుపోయాయి. కశ్మీర్ హిందు వులను బలవంతంగా మతమార్పిడి చెందించవద్దని ప్రాధేయపడ్డందుకు ఔరంగజేబు సిక్కుల తొమ్మిదవ గురువును చంపాడు. కాగా, ఐదవ గురువు పవిత్ర ఖురాన్‌లోని కొన్ని బోధనలను గురుగ్రంథ్ సాహెబ్‌లో చేర్చారు. హిందువుల మత హక్కు కోసం చేసిన త్యాగానికీ, ఇస్లాంలోని వివేచనను తన స్వీయ ప్రాపంచిక దృక్పథంలో భాగం చేసుకుంటానని పట్టుబట్టడానికి మధ్య ఉన్న తేడా ఏమిటో మీకు తెలిసిందే. దాని నుంచి ఉత్పన్నమయ్యేదే మూడోది, పాకిస్తాన్ అంటే భయమూ, అసహ్యం. ప్రత్యేకించి ఆ పాక్‌తో భారత ముస్లింలను ముడిపెట్టడం. సంప్రదాయక ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి భారత ముస్లింలంటే పాకిస్తాన్‌కు శాశ్వత పంచమాంగ దళమే. అయితే నేటికి అది, భారత్ అతి పెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశంగా ఉండటం అనివార్య మని అంగీకరించి...‘‘మన’’ నిబంధనలకు అనుగుణంగా నివసించేలా వారి ని ‘‘ఒప్పించాల్సి’’ ఉందని భావిస్తోంది. కాన్వెంట్ విద్య లాగే, ‘‘దేశభక్తి’’ పరీక్షలో నెగ్గిన ముస్లింల పట్ల కూడా ఆర్‌ఎస్‌ఎస్‌లో గొప్ప ఆరాధనాభావంతో పాటూ లోతైన అనుమానమూ ఉంది. కలాం తన మిస్సయిళ్లతో మాత్రమే కాదు... శ్లోకాల పట్ల, వీణ పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమవల్ల వారి దృష్టిలో గొప్ప హీరో కాగలిగారు. ఆయన ఔరంగజేబుకు సరిగ్గా విరుగుడు.
‘‘క్లాస్ తీసుకోవడం’’ సహిస్తారా?
వాజపేయీ, అద్వానీలు అరుదైన ఆర్‌ఎస్‌ఎస్ నేతలు. ఆ సంస్థ పరిధిని దాటి ఎదిగినవారు. కాబట్టే వారు జశ్వంత్‌సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, అరు ణ్‌శౌరి, యశ్వంత్‌సిన్హా, రంగరాజన్ కుమారమంగళం తదితరులను ఆకర్షించ గలిగారు. భావజాలం మార్చజాలనిదనే విషయాన్ని సైతం అద్వానీ అర్థం చేసుకున్నారు. కాబట్టే హిందు-ముస్లిం సంబంధాల మెరుగుదలకు భారత్- పాక్ సంబంధాల సాధారణీకరణ అవసరమని గుర్తించారు. అది మంచి ఆలోచనే అయినా ఆయనకు ఇబ్బందులను కలిగించింది. లౌకికవాదులు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోలేక ఆయనపై దాడి చేశారు.
అయితే ప్రస్తుత బీజేపీ నాయకులు ఇంకా స్వయంసేవకులు, శిశు మందిర్ /విద్యాభారతిలను మనస్సులో నిలుపుకున్న విద్యార్థులే. నాగపూర్ లోని సంఘ్ పీఠాధిపతులు ప్రభుత్వానికి ‘‘క్లాసు తీసుకోవడం’’ కోసం ఢిల్లీకి రావడం, రాజ్యాంగేతర అధికారాలను ప్రదర్శించడం విస్మయకరమే కాదు నిజం కూడా. అయితే నరేంద్రమోదీ ఈ వ్యవహారంలో ఎక్కడ నిలుస్తారనే విషయంలో నేను తొందరపాటు నిర్ధారణకు రాదలుచుకోలేదు. ఆయన నిస్సందేహంగా స్వయంసేవకుడే. అయినా ఆయన తన స్వాభావిక రాజ కీయ ప్రవృత్తికి కట్టుబడి ఉండేట్టయితే... ఇలా తన అధికారాన్ని కించపరచ డాన్ని అనుమతించే బాపతు కాదు. తన ఆధిక్యాన్ని నిరూపించుకుంటారు. అదే జరిగితే మన ముందున్నది ఆసక్తికర మైన కాలమే.
శేఖర్ గుప్తా
twitter@shekargupta