నమ్మాళ్వార్ నడచిన దారి.. | namalwar followed way | Sakshi
Sakshi News home page

నమ్మాళ్వార్ నడచిన దారి..

Jan 26 2014 11:39 PM | Updated on Jun 4 2019 5:16 PM

నమ్మాళ్వార్ నడచిన దారి.. - Sakshi

నమ్మాళ్వార్ నడచిన దారి..

మట్టిని ప్రేమించే వారు మనుషులను ప్రేమిస్తారు. వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత చదువులు చదివి, మట్టి మీద మమకారంతో మట్టి మనుషుల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహా మనిషి డాక్టర్ జీ నమ్మాళ్వార్

 మట్టిని ప్రేమించే వారు మనుషులను ప్రేమిస్తారు. వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత చదువులు చదివి, మట్టి మీద మమకారంతో మట్టి మనుషుల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహా మనిషి డాక్టర్ జీ నమ్మాళ్వార్. దార్శనికుడిగా, రైతుకు మార్గదర్శిగా నిలిచిన డాక్టర్ నమ్మాళ్వార్ గత నెల 30న తుది శ్వాస విడిచారు. సేంద్రియ వ్యవసాయ వ్యాప్తికి 30 ఏళ్లపాటు ఉద్యమించిన ఈ ప్రజా శాస్త్రవేత్త  రైతాంగానికి ఆర్థిక స్థిరత్వం చేకూరాలనే లక్ష్యంతో కొత్తదారి చూపించారు. తక్కువ ఖర్చుతో ఫలసాయం పొందినప్పుడే వ్యవసాయం, రైతు జీవితం సజావుగా ఉంటాయంటారాయన.  ఆయన పద్ధతులను తమిళనాడు, కేరళ రైతులు ఆచరిస్తున్నారు.
 
 ‘బ్రెడ్ శాండ్‌విచ్ పద్ధతి’తో అధిక ప్రయోజనం
 భూమిని సారవంతం చేయడానికి, సేంద్రియ ఎరువును సమర్థవంతంగా వినియోగించడానికి డాక్టర్ నమ్మాళ్వార్ బ్రెడ్ శాండ్‌విచ్ పద్ధతిని సూచించారు. దీన్ని పెరటి తోటల్లోనూ.. విస్తారమైన పొలాల్లోనూ అమలు చేయవచ్చు. సేంద్రియ సాగుకు దుక్కి చేసి సిద్ధం చేసుకున్న భూమి పైపొర మట్టి(టాప్ సాయిల్) పోషకాలు, సూక్ష్మజీవులకు నిలయం. ఆరు అంగుళాల లోతు నేలను గొర్రు పట్టె వంటి దానితో పక్కకు తీసి కుప్పలు చేయాలి. ఆ తరువాత నేల మీద  రెండు అడుగుల వెడల్పులో చాళ్లు వేసుకోవాలి. ఆ చాళ్లపైన పశువుల ఎరువు, కంపోస్టు వేయాలి. ఆ తర్వాత.. ముందుగా కుప్పలు చేసి పెట్టుకున్న పైపొర మట్టిని పరవాలి. దీంతో రెండు బ్రెడ్ ముక్కల మధ్య కూరలు కూరి తయారు చేసే బ్రెడ్ శాండ్‌విచ్‌లా భూమి పై పొరకు, అడుగు పొరకు మధ్య పశువుల ఎరువు, కంపోస్టు వేస్తున్నామన్న మాట. ఇలా తయారైన బెడ్ల మీద మధ్య భాగంలో కూరగాయ మొక్కలు నాటు కొని, ఇరువైపులా నత్రజనిని అందించే (స్థిరీకరించే) పప్పు ధాన్యపు పంట మొక్కలను నాటు కోవాలి.
 
 తగినంత దూరం పాటిస్తూ దుంప పంటలను కూడా ఇందులోనే నాటుకోవచ్చు. ఒకే చోట 3 రకాల పంటలను పండించుకోవచ్చు. సాగు నీరు ఆదా అవుతుంది. సేంద్రియ ఎరువు వృథా కాకుండా అన్ని మొక్కలకు సమానంగా అందుతుంది. నేల పొరల మధ్యలో మనం వేసిన సేంద్రియ ఎరువు నీటిని సంగ్రహించి తేమను నిలువరించి మొక్కకు క్రమంగా అందిస్తుంది. ఈ విధానం వలన  పదేపదే దుక్కి చేయాల్సిన అవసరం లేకుండా పంట తరువాత పంటగా కూరగాయలను పండించుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement