ఈ శాపం పాలకుల పాపం

ఈ శాపం పాలకుల పాపం - Sakshi
విశ్లేషణ:  ఎమ్‌వీఎస్  నాగిరెడ్డి,  వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర వ్యవసాయ విభాగ కన్వీనర్ ఈ ఏడాది ముంగారు వర్షాలు రైతును మురిపించాయి. వారం రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా అలుముకున్న రుతుపవనాలు పుడమి తల్లిని పులకరింప చేశాయి. ఈ ఏడాదైనా మంచి పంట రాకపోతుందా అన్న ఆశతో.. నిరుటి ‘నీలం’ గాయాలను లెక్క చేయకుండా  రైతు కాడి పట్టాడు. అదనుకు బ్యాంకులు రుణాలివ్వకపోయినా.. అప్పో సప్పో చేసి పదును పోకముందే విత్తనాలు విత్తాడు. ఐదారెళ్లలో ఎప్పుడూ లేనంతగా సాగు విస్తీర్ణం పెరిగింది. చేలో పచ్చదనం.. రైతు ముఖంలో సంతోషం.. మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. అర్రొంచిన వరి, కళ్లంలో మొక్కజొన్న, అప్పుడప్పుడే విచ్చుకుంటున్న ‘తెల్ల బంగారం’ ఒక్కసారిగా కకావికలయ్యాయి. తీరా పంట చేతికొచ్చే దశలో సర్వం తుడిచిపెట్టుకుపోయి రైతు యథావిధిగా కట్టుబట్టలతో మిగిలిపోయాడు. నెత్తిపై అప్పులకుప్ప.. వచ్చిపోయే నాయకుల కల్లబొల్లి మాటలు మాత్రమే మిగిలాయి. ‘పంట నష్ట పరిహారం’ అందని ద్రాక్షయ్యింది. కౌలు రైతు పరిస్థితి మరీ ఘోరం. బ్యాంకులో అప్పు పుట్టదు... పంట పరిహారమూ రాదు. చావే బతుకుకన్నా నయమన్న దశకు చేరువవుతున్న కౌలు రైతును ప్రభుత్వం గాలికొదిలేసింది. బ్యాంకు రుణాల్లో ఒక్క శాతం వాటా కూడా కౌలు రైతుకు దక్కని పరిస్థితి. ప్రకృతి కన్నెర్ర ... పాలకుల నొసటి వెక్కిరింతల మధ్య 2013 రైతన్నను ఉక్కిరిబిక్కిరి చేసింది. కన్నీరు తుడిచే నాయకుడు, రైతుకు.. నేనున్నానంటూ భరోసా ఇచ్చే నేత... ‘వ్యవసాయాన్ని పండగ’గా మార్చే ప్రభుత్వం రాకపోతుందా అన్న ఆశే రైతును 2014లోకి నడిపిస్తోంది. కడగండ్ల సాగు మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ) వ్యవసాయ రంగం వాటా 14.5 శాతం కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీలో 21 శాతం. అంటే వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మొత్తంగా ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటాయి. రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో 120 లక్షల హెక్టార్లలో వివిధ పంటలసాగు జరుగుతుంది. ఇందులో 40 లక్షల హెక్టార్లు వరి. 21.5 లక్షల హెక్టార్లలో పత్తి, 22 లక్షల హెక్టార్లలో నూనె గింజలు. 70 శాతంగా ఉన్న ఈ మూడు పంటల సాగే వ్యవసాయ రంగానికి ఆయువుపట్టు. ఈ మూడు పంటల సాగులో 70 శాతం కౌలు రైతులు, చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు చేసేదే. నేటి పాలకులు చెబుతున్న 0 శాతం వడ్డీ రుణాలు వీరికి చేరడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నది కూడా వీరే. ప్రకృతి కన్నెర్రకు తోడు ప్రభుత్వ అలసత్వంతో 2013 కౌలు రైతుకు శాపంగా మారింది.  నీలం తుఫానుకు తడిసి, రంగుమారిన పత్తి కొనుగోలుకు ప్రభుత్వం చొరవ చూపలేదు. కూలి ఖర్చులు గిట్టని ధరకు తడిసిన పత్తిని అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక మంచి పత్తి విషయానికి వస్తే అధికారిక లెక్కల ప్రకారమే క్వింటాలుకి ఉత్పత్తి ఖర్చు రూ. 5,760 కాగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 3,900. వాస్తవంగా అమ్ముడుపోయింది మాత్రం రూ. 3,400-3,500కే. సీసీఐ సెంటర్లు దళారులకే తప్ప రైతులకు ఉపయోగపడలేదు. రైతుల ఉత్పత్తి మొత్తం వ్యాపారుల దగ్గరకు చేరిన తరువాతే ఎగుమతులను అనుమతించడంతో మేలో పత్తి ధర రూ. 5,000కు పైకి చేరింది.  రైతుకు పెట్టుబడి రాలేదుగానీ వ్యాపారులకు 20 నుంచి 30 శాతం లాభించింది. అలాగే ధాన్యం అమ్మకంలోనూ రైతులకు కనీస పెట్టుబడి రాలేదు. వరి పంటకు నష్టం వాటిల్లిన ప్రాంతాన్ని తగ్గించి నమోదు చేసి ఇన్‌పుట్ సబ్సిడీని మేమే పెంచాం అని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. ఇన్‌పుట్ సబ్సిడీ అంటే ఒక పంట నష్టపోయిన రైతుకు వెంటనే రెండవ పంట విత్తనాలకు, ఎరువుల కొనుగోలుకు ఇచ్చే సబ్సిడీ సదుపాయం. పైలిన్, హెలెన్, లెహర్ తుఫానుల తరువాత గత ఏడాది నాటి నీలం తుఫాను నష్టపరిహారాన్ని రైతులకు ఇప్పుడు చెల్లించే ప్రయత్నాన్ని చే స్తున్నారు. రబీకి మినుము సాగు డెల్టా కౌలు రైతులకు ప్రధాన ఆధారం. దీనికి ప్రభుత్వ మద్దతు ధర రూ. 4,300 కాగా మార్కెట్‌లో రూ. 3,500కు  కొనేవారు లేక రైతాంగం రోడ్డెక్కింది. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామంటూ తెలంగాణలో ఒకటి, కోస్తాంధ్రలో ఒకటి కొనుగోలు సెంటర్లను ప్రారంభించి, పది రోజులకే మూసివే శారు. పసుపు, మిర్చి, పెసర, కంది, జొన్న, సజ్జ ధరలు కుప్ప కూలి కనీస పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. పాలకుల వెక్కిరింత ఏప్రిల్, మే నెలల్లో వచ్చిన వడగళ్ల వానలకు నిజామాబాద్ జిల్లాలో వరి పంట మొత్తం నేలపాలైంది. గాలివానలకు కడప జిల్లాలోనూ, మరికొన్ని చోట్ల అరటి తోటలు నేలపాలయ్యాయి. ఖరీఫ్ సీజన్‌లో కృష్ణా డెల్టాకు ఆగస్టు 6 వరకూ నీరు విడుదల కాకపోయినా ఖరీఫ్‌కు ప్రకృతి అనుకూలించింది. అనంతపురం సహా అన్ని జిల్లాల్లోనూ మంచి వర్షవర్షపాతం నమోదైంది. అన్ని పంటల సాగు పెరిగింది. కానీ అదే సమయంలో మహోధృతంగా వచ్చిపడ్డ పైలిన్ తుఫానుకు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు దెబ్బతిన్నాయి. అక్టోబర్ 20 వరకు రాష్ట్ర రైతాంగం  సంతోషంగానే ఉంది. అయితే అక్టోబర్ 22- 26 హెలెన్ తుఫానుకు కృష్ణా, గోదావరి డెల్టాలలోని వరి పైరు కొంత వరకూ ముంపునకు గురైంది. అత్యధికంగా తీతకు వచ్చిన పత్తి తడిసి, కాయలు కుళ్లి, పూత రాలి ఎకరానికి కనీసం 3 నుండి 5 క్వింటాళ్ల దిగుబడిని రైతులు నష్టపోయారు. రాష్ట్రంలో మొత్తం పత్తి ఉత్పత్తిలో 3/4వ వంతు తెలంగాణ జిల్లాల్లో పండుతుంది. అలానే మొక్కజొన్న కూడా. ఈ తుఫానుకు పత్తి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హెలెన్ తెరిపిచ్చేసరికి లెహర్ తుఫాను ముంచుకొచ్చింది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో కోతకు వచ్చిన వరి పైరు నేలవాలి, గింజలు మొలకెత్తి తీవ్ర నష్టం సంభవించింది. గత ఏడాది బీపీటీ 5204 (సోనామసూరి) రకానికి అధిక ధర పలకడంతో ఈ ఏడు అనేక జిల్లాల్లో దాన్నే ఎక్కువగా సాగుచేశారు. చిన్న వర్షానికి, గాలికి కూడా పడిపోయి,  తొందరగా మొలకెత్తే లక్షణమున్న ఈ రకం వేసినందువల్ల 50 నుంచి 65 శాతం వరకు పంట నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులే కౌలు రైతులుగా 75 శాతం సాగును చేస్తున్నారు. ప్రకటనలు తప్ప వీరికి ప్రభుత్వం నుండి అందిన సహాయం సున్నా. ధాన్యం పంటకు కోస్తాలాగా వేరుశనగ పంటకు అనంతపురం జిల్లా ప్రసిద్ధి. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం ఎంత వేరుశనగ సాగవుతుందో అంత ఒక్క అనంతపురం జిల్లాలోనే సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వర్షపాతం బాగున్నా తీత సమయంలో వచ్చిన తుఫాను, వర్షాలకు 60 శాతం వేరుశనగ పంటకు నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కోనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. వరుస తుఫానుల వల్ల పని పెరిగి, కూలి రేట్లు బాగా పెరిగిపోయాయి. సకాలంలో కూలీలు దొరక్క రైతులు వ్యవసాయమంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభావం కూడా ఎక్కువగా వ్యవసాయ కార్మికులైన కౌలు రైతులపైనే పడింది. కూలి చెల్లించాలంటే పంటను ఏదో ఒక ధరకు తక్షణం అమ్ముకోవలసిందే. క్వింటాలు ధాన్యం  ఉత్పత్తి ఖర్చు అధికారిక లెక్కల ప్రకారమే రూ. 1,760. అయితే ప్రభుత్వం ప్రకటించిన ధర రూ. 1,310 మాత్రమే. రంగుమాసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నేటికీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. నష్టాననికి గురైన నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పత్తి సాగుకు, కృష్ణా, గోదావరి డెల్టాల్లో వరికి నేటికీ నిబంధనలు సడలించలేదు. ‘కోతల’ క్షోభ ప్రస్తుతం మరలా రబీ సీజన్ నడుస్తోంది. రబీ వ్యవసాయం ఎక్కువగా విద్యుత్ పంపు సెట్లపై ఆధారపడే సాగుతుంది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 252 మిలియన్ యూనిట్లు ఉండగా, ఉత్పత్తి 241.199 మిలియన్ యూనిట్లుగా (డిసెంబర్ 23) ఉన్నది. కేవలం 5 శాతం విద్యుత్ కొరత ఉంటే వ్యవసాయరంగానికి విద్యుత్ సరఫరాను 7 గంటల నుండి 5 గంటలకు తగ్గించారు. అది కూడా సరిగా అందడం లేదని అప్పుడే సబ్‌స్టేషన్‌ల వద్ద రైతాంగం ధర్నాలు చేస్తున్నారు. ఏపాటి కొద్దిగ విద్యుత్ కొరత ఏర్పడ్డా వ్యవసాయ పంపు సెట్లకు కోత పెట్టడం అమానుషం. బోరుకు 7 గంటల పాటు కరెంట్ వస్తుందనే లెక్కన సాగుకు దిగిన రైతులకు ఏప్రిల్ నెలల్లో 4 గంటలు కూడా విద్యుత్ సరఫరా జరగక రైతులు పూర్తిగా నష్టపోయారు. రైతు ఒక ఎకరం సాగుతో 50 నుండి 60 మందికి పని కల్పిస్తున్నాడు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా రూ. 4 వేల నుండి 6 వేల వరకూ ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. నిజానికి ఇది సబ్సిడీ పథకం కానేకాదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు,  ఆహార భద్రతకు తప్పనిసరి కార్యక్రమం. అలాంటి విద్యుత్ సరఫరా సమయాన్ని కుదించి, దాన్ని కూడా నిరంతరం సరఫరా చేయకపోవడం మూలంగా రైతు ఆర్థికంగా కుదేలవుతున్నాడు. అటు ప్రకృతి కన్నెర్ర చేయగా నడ్డి విరిగిన రైతాంగానికి ప్రభుత్వ వైఖరి పెను శాపంగా మారింది. దీంతో రైతు ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ప్రాంతాలు కళ తప్పి వెలవెలబోతున్నాయి.          

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top