విమర్శలో రాచ‘పాళీ’యం

ఆచార్య చంద్రశేఖరరెడ్డి - Sakshi


పద్నాలుగేళ్ల్ల విరామం తర్వాత రాయలసీమ సాహిత్య విమర్శకునికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మాటల్లో చేతల్లో తనువెత్తు ఆదర్శం రాచపాళెం. గత 42 ఏళ్లుగా సుదీర్ఘ కాలం విరామం పాటించకుండా విమర్శా సాహిత్యం అందిస్తున్న నిబద్ధ, మార్క్సిస్ట్ సాహిత్యకారుడాయన. ఆయన పేరు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. ఆయన రచించిన ‘మన నవలలు-మన కథాని కలు’ పుస్తకానికి, జీవిత కాల సాహిత్య కృషికి గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. 2014వ ఏడాదికి ఇచ్చే ఈ అవార్డు ఆయనకు న్యూఢిల్లీలో జనవరి 9న ప్రదానం చేస్తారు. 42 ఏళ్ల క్రితం 1972 అక్టోబర్ నెలలో ‘స్రవంతి’ మాసపత్రికలో ‘సినిమా కవిత్వం’ మీద రాచపాళెం తొలి విమర్శా వ్యాసం అచ్చయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 36 గ్రంథాలు రచించారు. దాదాపు 3,500 పేజీల సాహిత్య విమర్శ రాశారు. సాహిత్యం ఇచ్చిన సంస్కారం రాచపాళెంలోని సంస్కర్తను తట్టి లేపింది.

 

చిత్తూరు జిల్లా కుంట్రపాకం గ్రామంలోని సామాన్య రైతు కుటుంబంలో 1948 అక్టోబర్ 16న రాచపాళెం చంద్రశేఖరరెడ్డి జన్మించారు. తల్లిదండ్రులు రాచపాళెం రామిరెడ్డి, మంగమ్మలు. కుంట్రపాకం, కట్టకింద వెంకటాపురం, తిరుపతిలో ప్రాథమిక, ఉన్నత విద్య, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. ఆ తర్వాత 1977 ఆగస్టు 25న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురంలో తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరారు. 31 ఏళ్లపాటు అనంతపురంలో పనిచేసి 2008లో ఉద్యోగ విరమణ చేశారు. ఆపై కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖలోను, సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ప్రధాన బాధ్యులుగా గత 6 ఏళ్లుగా సేవలందిస్తున్నారు.

 

 రాచపాళెం అనంతపురంలో ఆచార్యునిగా పని చేస్తున్న కాలంలోనే లక్ష్మీ కాంతమ్మతో పెండ్లి జరిగింది. అప్పట్లో ఆయన పచ్చి భావవాది. సరిగా ఆ కాలంలో గురజాడ కన్యాశుల్కంపై విద్యార్థులకు ఏకంగా నాలుగేళ్లపాటు పాఠం చెప్పాల్సివచ్చింది. దాంతో కన్యాశుల్కం నాటకానికి సంబంధించిన విమర్శనా గ్రంథాలు అధ్యయనం చేయడంతో తనలో కొత్త ఆలోచనలు రేకెత్తాయి. ఆలోచనలు మారాయి. పైగా అనంతపురంలో జనవిజ్ఞాన వేదిక, అభ్యుదయ రచయితల సంఘం, విశాలాంధ్ర, సీపీఎం, సీసీఐ నాయకులతో పరిచయాలు మార్క్సిస్టుగా ఆయన్ను తేర్చాయి. ఈ క్రమంలో కులాంతర మతాంతర వివాహాలు నిర్వహించారు. గుర్రంజాషువా విగ్రహం ఏర్పాటులో ప్రధాన భూమిక నిర్వహించారు. ఈ ప్రభావంతో కూతురు శ్రీవిద్యకు నారాయణ స్వామితో కులాంతర వివాహం, అలాగే కుమారుడు ఆనందకుమార్‌కు సుధా లావణ్యతో మతాంతర వివాహం చేశారు.

 

 అవార్డు గ్రంథం మన నవలలు-మన కథానికలు

 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఏకగ్రీవంగా న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన గ్రంథం ‘మన నవలలు- మన కథానికలు’. ఈ పుస్తకంలోని 24 వ్యా సాలు 13 ఏళ్ల సాహిత్య అధ్యయన కృషికి అక్షరరూపం. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలకు చెందిన ప్రాతినిధ్య నవలలు, కథానికల మీద చేసిన మూల్యాంకనం, పునర్ మూల్యాంకనాలే ఇందులో ఉన్నాయి. ఈ పుస్త కంలో మాస్టర్‌పీస్‌లు రెండు ఉన్నాయి. అవి ఒకటి. ‘సామాజిక ఉద్యమాలు- తెలుగు కథానికా వికాసం’. ఈ వ్యాసంలో సంఘసంస్కరణ ఉద్యమం నుండి ప్రపంచీకరణ నేపథ్యం వరకు తెలుగు కథానిక ఎలా వికసించిందో చెప్పారు. రెండు. ‘అయ్యో పాపం నుండి ఆగ్రహం దాకా తెలుగు దళిత కథానిక’. ఈ వ్యాసంలో 1925-2008 మధ్య 9 దశాబ్దాలలో దళిత జీవితం వస్తువుగా వచ్చిన కథానికల్ని చారిత్రక దృక్పథంతో అధ్యయనం చేశారు. దళిత సాహిత్య విమ ర్శలో ఈ వ్యాసం కలికితురాయి. జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన చంద్రశేఖరరెడ్డికి అభినందనలు.

 - శశిశ్రీ

 (వ్యాసకర్త రచయిత, పత్రికా సంపాదకుడు) ఫోన్: 9347914465

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top