అద్భుత యోగా వీడియో పోస్ట్ చేసిన మోదీ
త్వరలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ నాడి శోధన ప్రాణయామకు చెందిన ఓ వీడియో క్లిప్‌ను పంచుకున్నారు.
న్యూఢిల్లీ: త్వరలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ నాడి శోధన ప్రాణయామకు చెందిన ఓ వీడియో క్లిప్‌ను పంచుకున్నారు. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన అది ఎందుకు ముఖ్యమో.. ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతటి ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేశారు. తాను ఇప్పటికీ అంత ఉల్లాసంగా ఉండటానికి కారణం యోగా అని చెప్పే మోదీ.. ఇది భారతీయులకు గొప్ప వరం అని అంటారు. ఈ నేపథ్యంలో నాడి శోధన ప్రాణయామ అర్ధం వివరాలు తెలిపారు.
నాడి అంటే శరీరంలోని అన్ని విభాగాలకు శక్తిని చేరవేసే ఒక వాహిని అని, శోధన అంటే శుద్ధి చేసేదని, ప్రాణయామ అంటే శ్వాస తీసుకోవడంలోని మెళకువలని పేర్కొన్నారు. శరీరానికి శక్తినిచ్చే ప్రవాహికలను శుద్ధి చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచేందుకు ఉపయోగపడేది నాడీ శోధన ప్రాణయామ. ఒత్తిడి, కాలుష్యం, శారీరక, మానసిక ఒత్తిడి తదితర కారణాల ద్వారా శక్తినిచ్చే నాడులు సరిగా పనిచేయకుండా పోయి మెదడులో గందరగోళ పరిస్థితులు నెలకొల్పుతాయి. దీని నుంచి బయటపడేందుకు ఈ యోగాసనం ఉపయోగపడుతుంది.
నాడీ శోధన ప్రాణయామతో ఉపయోగాలు
- మనసు ఆలోచన ఓ చోట ఉండి నిశ్శబ్దంగా ఉంచుతుంది.
- సాధరణంగా గతం గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి ఆందోళన పడుతుండటం చేస్తుంటాం. దీని వల్ల వర్తమానంలో జీవిస్తారు.
- రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంతోపాటు ఎలాంటి శ్వాససంబంధమైన సమస్యలు ఉండవు.
- ఒత్తిడి నుంఇచ ఉపశమనం లభిస్తుంది. శరీరం తేలికవుతుంది.
- భావోద్వేగాలు సమాపాళ్లలో ఉంటాయి.
- నాడీ వ్యవస్థను సమాంతరం చేస్తూ సరైన శక్తిని శరీరానికి అందించేలా చేస్తుంది.
- శరీర ఉష్ణోగ్రతను కూడా బ్యాలెన్స్ చేస్తుంది.
Here is more about Nadi Shodhan Pranayama and its advantages. #YogaDay pic.twitter.com/rx7gmRTlat
— Narendra Modi (@narendramodi) 18 June 2017


